header

Srikrishna Devarayalu….శ్రీకృష్ణ దేవరాయలు...

Srikrishna Devarayalu….శ్రీకృష్ణ దేవరాయలు..
1336 సంవత్సరంలో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో కాకతీయ ప్రతాపరుద్రుని సుబేదారు ఐన హరిహర రాయలుచే తుంగభద్రా నదీ తీరంలో స్థాపించబడ్డది విజయనగర సామ్రాజ్యం.
వీరిలో తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు. ఇతని పరిపాలనా కాలం 1509 సం. నుండి 1530 సంవత్సరం వరకు. పరిపాలనా కాలం తక్కువైననూ కళలను, సాహిత్యాన్ని పోషించిన వాడుగా పేరు తెచ్చుకున్నాడు. గొప్ప యుద్దవీరుడు కూడా. ఇతని తండ్రి తుళువ నరసనాయకుడు, తల్లి నాగలా దేవి. 17 జనవరి 1471 సంవత్సరంలో హంపిలో జన్మించాడు. ఇతని భార్య తిరుమలదేవి. ఇంకొక భార్య చిన్నాదేవి.
ఇతను స్వతాహగా కన్నడ ప్రాంతానికి చెందిన వాడు. కర్ణాటకలోని హంపీ విజయనగరం ఇతని రాజధాని. కానీ కృష్ణదేవరాయల కాలంలో ఆంధ్రదేశం అష్టైశ్వరాలతో తులతూగింది.
అష్టదిగ్గజాలుగా పేరుపొందిన అల్లసాని పెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభధ్రుడు, పింగళి సూరన, మాదయగారి మల్లన్న, ధూర్జటి, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలోని వారే. వీరిలో తెనాలి రామకృష్ణ కవి స్వస్థలం నేటి గుంటూరు జిల్లాలోని తెనాలి. దూర్జటి కవి స్వస్థలం పవిత్రక్షేత్రమైన శ్రీకాళహస్తి. మాదయగారి మల్లన కృష్ణాజిల్లాకు చెందిన అయ్యంకి పురానికి చెందినవాడుగా చెబుతారు.
శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఎన్నోదేవాలయాలు నిర్మించబడ్డాయు. వీటిలో ప్రముఖమైనది విరుపాక్షదేవాలయం. ఇతను తిరుమల శ్రీవేంకటేశ్వరుని భక్తుడు. షుమారు ఆరుసార్లు శ్రీవేంకటేశ్వరుని దర్శించుకొని అనేక అభరణాలను స్వామికి సమర్పించాడు. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు తన దేవేరులతో ఉన్న విగ్రహాలను చూడవచ్చు.
శ్రీకృష్ణదేవరాయలు జన్మతః కన్నడిగుడు ఐనా తెలుగుభాషను ఆదరించి ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అంటూ తెలుగును అభిమానించినవాడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి జాంబవతీ కళ్యాణం, మదాలసా చరితం ఇంకా అనేక కావ్యాలు వ్రాసాడు.
అనేక మంది కవులను పోషించాడు. ‘‘అమూక్తమాల్యద’’ అనే గొప్ప తెలుగు కావ్యానికి శ్రీకారం చుట్టింది కూడా నేటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలోని ఘంఠసాల మండలం శ్రీకాకుళం అనే గ్రామంలో ఉన్న శ్రీకాకుళేంద్ర మహావిష్ణు అనే దేవాలయంలోనే. ఈ గుడిలో శ్రీకృష్ణదేవరాయల జ్ఞాపకర్ధం ఇతని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీకృష్ణ దేవరాయల జీవితంలో ఎక్కుభాగం యుద్ధాలలో గడిచిపోయింది. బహమనీ సుల్తానులు, మహ్మదీయుల దండయాత్రలను నిలువరించాడు. నేటి ఆంధ్రప్రదేశ్ లోని కొండవీటి కోట, కొండపల్లి కోటలను జయించాడు.
అత్యంత సమర్ధుడు, రాజనీతిజ్ఞుడు ఐన మహామంత్రి తిమ్మరుసు సారధ్యంలో శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతమే కాకుండా ఉత్తరాన మహానది వరకు వ్యాపింపచేశాడు. ఈయన పరిపాలన గురించి మ్యానిజ్, ప్వాజ్ వంటి పోర్చుగీస్ యాత్రికులు తమ రచనలలో ప్రశంచించారు.
శ్రీకృష్ణ దేవరాయలకు తిరుమల రాయలు ఒక్కడే కుమారుడు. చిన్నతనంలో కుమారుడుకి పట్టాభిషేకం చేసి తాను రాజప్రతినిధిగా పరిపాలన సాగించాడు. కానీ దురదృష్టవశాత్తూ శత్రువుల కుట్రవలన తిరుమల రాయలు మరణించాడు. తరువాత జరిగిన చరిత్రకు సంభంధించి అనేక విభిన్నాభిప్రాయాలున్నాయి. తిమ్మరుసును అనుమానించాడాని, కొడుకు మరణంతో దిగులుతో చనిపోయాడని చెబుతారు. కానీ స్పష్టమైన ఆధారాలు లేవు.