Ashtadasa Puranalu/అష్టాదశ పురాణాలు
వ్యాస భగవానుడు 18 పురాణాలను రచించాడు. వీటినే అష్టాదశ పురాణాలు అంటారు. మనిషి నియమబద్ధమైన జీవనం సాగించి మోక్షమార్గం పొందగలిగే ధర్మసూక్షాలను తెలియజేసేవి పురాణాలు. నేటికీ మన గ్రామాలలో, దేవాలయాలలో ఈ పురాణాలు ప్రవచింబడుతున్నాయి. అష్టాదశపురాణాల గురించి క్లుప్తంగా.....
01. మత్సపురాణం : దీనిలో 14,000 శ్లోకాలున్నాయి. మత్స్యావతార రూపంలో విష్ణువు మనువుకి బోధించినది మత్స్యపురాణం. మరణించిన పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో శ్రాద్ధవిధిని జరపాలని ఉపదేశిస్తున్నట్లు ఇందులోని వాటిని బట్టి తెలుస్తుంది.
02. మార్కండేయపురాణం : ఇందులో 9,000 శ్లోకాలున్నాయి. మార్కండేయ మహర్షిచే చెప్పబడింది. శివ, విష్ణు మహత్యం, చండీహోమం మొదలైనవి ఇందులో ఉన్నాయి.
03. భాగవత పురాణం : ఈ పురాణంలో 18,000 శ్లోకాలు కలవు. వేదవ్యాసుడు శుకునకు, శుకుడు పరీక్షత్ మహారాజుకు చెప్పిన విష్ణు అవతారాలు, కృష్ణచరిత్ర ఇందులోని అంశాలు
04. భవిష్యపురాణం : ఈ పురాణంలో 14,500 శ్లోకాలున్నాయి. సూర్యభగవానునిచే మనువుకు చెప్పబడినవి. వర్ణాశ్రమ ధర్మాలు, భవిష్యత్ సంగతులు ఇందులో చెప్పబడినవి
05. బ్రహ్మపురాణం : ఈ పురాణంలో 10,000 శ్లోకాలున్నాయి. ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యం, స్వర్గం, ఆయువు, కీర్తి, మెక్షం సిద్ధిస్తాయని ఈ పురాణం చెబుతుంది.
06. బ్రహ్మండపురాణం : ఇందులో12,000 శ్లోకాలున్నాయి. లలితా సహస్రనామ స్తోత్రాలు భారతదేశపు భౌగోళిక వర్ణన, ఖగోళశాస్త్రం ఇందులో ఉన్నాయి.
07. బ్రహ్మ వైవర్త పురాణం : దీనిలో 18,000 శ్లోకాలున్నాయి. సృష్టికర్త, సృష్టికి సంబంధించిన విషయాలు, అతిధి మర్యాదలు ఇందులో ఉన్నాయి.
08. వరాహ పురాణం : ఇందులో 24 వేల శ్లోకాలున్నాయి. విష్ణు ఆరాధన, వ్రతకల్పాలు, పుణ్యక్షేత్ర వర్ణన ఇందులో ఉన్నాయి.
09. వామనపురాణం : దీనిలో 10,000 శ్లోకాలున్నాయి, పులస్త్యమహర్షి నారదునకు ఉపదేశించినవి. శివ, విష్ణు, ఆరాధని, భూగోళం, ఋతువర్ణన ఇందులో ఉన్నాయి.
10. వాయిపురాణం : ఇందులో 24,000 శ్లోకాలున్నాయి. ఇది వాయిదేవునిచే చెప్పబడింది. కాలమానం, సౌరమండల వర్ణన ఇందులో చెప్పబడివనవి.
11. విష్ణుపురాణం : ఇందులో 23,000 శ్లోకాలున్నాయి. పరాశరుడు తన శిష్యునికి బోధించినవి. శివకేశవుల మధ్య భేదం లేదని బోధిస్తుంది.
12. అగ్నిపురాణం : దీనిలో 15,400 శ్లోకాలున్నాయి. అగ్నిచే వశిష్టునకు ఉపదేశింపబడినది. దీనిలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మాలు, జ్యోతిష్యం, ఖగోళం వంటి శాస్ర్తాలున్నాయి.
13. నారదపురాణం : నారదపురాణంలో 25,000 శ్లోకాలున్నయి. నారదుడు నలుగురు బ్రహ్మమానస పుత్రులకు ఉపదేశించినది. శివస్తోత్రం, వేదాంగాలు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
14. స్కందపురాణం : దీనిలో 81,000 శ్లోకాలున్నాయి. ఇది కుమారస్వామిచే చెప్పబడింది. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం వంటి అనేకమైన వ్రతాలు గురించి చెప్పబడినవి.
15. లింగపురాణం : దీనిలో శివుని ఉపదేశాలు, శివమహిమ, ఖగోళ, జ్యోతిష్య, భూగోళ శాస్త్రాలు గురించి వివరింపబడ్డాయి.
16. గరుడపురాణం : ఇందులో 19,000 శ్లోకాలున్నాయి. ఇది విష్ణువుచే గరుత్మంతునికి ఉపదేశించబడిన పురాణం. జనన మరణాలు, పాపపుణ్యాలు, స్వర్గనరకాలు మొదలైన వాటి గురించి వివరింపబడినవి.
17. కూర్మపురాణం : దీనిలో 17,000 శ్లోకాలున్నాయి. కూర్మావతారంలో చెప్పబడింది. శివ, విష్ణు ఆరాధన, పుణ్యక్షేత్రాల ప్రశస్తి ఇందులో ఉన్నాయి.
18. పద్మపురాణం : పద్మపురాణంలో 85,000 శ్లోకాలున్నాయి. పూజలు, విభూతి, ధర్మము మొదలగు వాటిని గురించి వివరించేదే పద్మపురాణం.