header

Ramayanam, Ramayana, Sri Rama, Lord Srirama, Valmiki Ramanayam

యుద్ధకాండము
రాముడు ఇంతటి మహాకార్యాన్ని నీవు గాక మరొకరు చేయలేరు అని హనుమంతుని గాఢాలింగనము చేసుకొని నీకు ఇంతకంటే ఏమివ్వగలనని అంటాడు.
నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సముద్రతీరానికి చేరుకుంటారు. రావణుని తమ్ముడు విభీషణుడు రావణునిచేత లంకనుండి గెంటివేయబడి రాముని శరణు కోరతాడు. రాముడు అభయమిచ్చి అప్పటికప్పుడు సముద్రజలాలతో అభిషేకించి విభీషుణుడిని లంకాధిపతిగా ప్రకటిస్తాడు. తరువాత విశ్వకర్మ వరంచే పుట్టినచ నలుని పర్యవేక్షణలో సముద్రంపై లంకవరకు వారధి నిర్మాణం జరుగుతుంది. శ్రీరాముడు వానర, భల్లూకసేనతో వారధిపై ప్రయాణించి లంకకు చేరతారు. చివరగా శ్రీరాముడు అంగదుని రాయబారం పంపిస్తాడు. కానీ రావణుడు సీతమ్మను అప్పగించటానికి తిరస్కరిస్తాడు.
వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికిగరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేస్తాడు.
అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. రామలక్ష్మణులు కుంభకర్ణునితో తలపడతారు. రాముడు దివ్యాస్త్రాలతో కుంభకర్ణుని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడి మరణిస్తాడు.
మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు. హనుమంతుడు సుషేణునుని సలహాపై సంజీవిని పర్వతాన్ని ఓషధులతో సహా పెకలించుకొని తెచ్చి లక్ష్మణునుని పునరజ్జీవితుడుని చేస్తాడు, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వస్తాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై యుద్ధానికి వెళ్ళి, ఇంద్రజిత్తును సంహరిస్తాడు.
ఇక రావణుడు మహావీరులతో యుద్ధానికి వస్తాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ప్రపంచానికి చాటిచెబుతాను అని రావణుని ఎదుర్కొంటాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే జరుగుతుంది. రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారధిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రామ రావణుల యుద్ధం భయంకరంగా సాగుతుంది. ఈ యుద్ధాన్ని చూడటానికి దేవతలు ఆకాశంలో గుమికూడతారు. రాముడు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా రావణుని తలతెగి తిరిగి వస్తుంది. మాతలి సలహాపై రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరుతుంది. దేవతలందరూ రామునకు అంజలి ఘటిస్తారు.
అనంతరం రాముడు సీతను తన పాతవ్రత్యం నిరూపించుకొనటానికి అగ్ని ప్రవేశం చేయమంటాడు. సీత అగ్నిప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా రావణుని పుష్పకవిమానంపై అయోధ్యకు తిరిగివచ్చి భరతునకు ఆనందం కలిగిస్తారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరుగుతుంది. .