హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అపురూప సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చి తన రామునికి సందేశం చెబుతుంది.
ఇక హనుమంతుడు రావణాసురుడు పంపగా వచ్చిన రాక్షసవీరులను సంహరిస్తాడు.
రావణాసురుని కొడుకైన ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి బంధించబడినట్లు నటిస్తాడు. రాక్షసులు ఆనందంతో హనుమంతుడిని రావణాసురుని చెంతకు తీసుకువెళతారు. హనుమంతుడు రావణాసురునికి సీతమ్మను రామునికి అప్పగించి రాముని శరణుకోరి, లంకను రక్షించుకోమని, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెబుతాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని రాక్షసులను ఆదేశిస్తాడు. హనుమంతుడు తోకతో లంకను దహించి, మరొక్కమారు సీతమ్మను దర్శించుకొని, వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై దిగుతాడు.
తన సహచరులకు జరిగినదంతా వివరించి అంతా కలసి కిష్కింధకు తిరిగి వస్తారు సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి "చూచాను సీతను" అనే ఒక్కమాటతో రాముని దుఃఖాన్ని పోగొడతాడు. ఆపై సీత జాడను, ఆమె సందేశమును వినిపిస్తాడు.
తరువాత రాముడు వానరుల సహాయంతో సముద్రంపై వారధిని నిర్మించి రావణాసురునిపైకి యుద్ధానికి వస్తాడు. రామ రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను చంపుతాడు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోగా సుషేణుని సలహాపై హిమాలయానికి వెళ్ళి సంజీవినీ
పర్వతాన్ని సమూలంగా పెకలించుకొని తెచ్చి లక్ష్మణుని మూర్చనుండి తేరుకొనేటట్లు చేస్తాడు. రాముడు వానరుల సహాయంతో భీకరయుద్ధం చేసి రావణుని సంహరిస్తాడు. వానరులతో సహా పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడవుతాడు.
రాముడు హనుమంతునికి చిరంజీవత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదిస్తాడు.