అంగిరసుడు బ్రహ్మ కుమారుడు. తండ్రి ఆదేశానుసారం తపస్సు చేసి దివ్వ తేజోసంపన్నుడు తపశ్శక్తిచే ప్రకాసిస్తాడు .అంగిరసునకు సర్వశక్తులు లభిస్తాయి. అయినా నిగర్విగానే గడుపుతాడు.
అంగిరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తెయగు శ్రద్ధను వివాహం చేసికొన్నాడు.శ్రద్ధా అంగిరసులను దేవతాగణాలు ఆశీర్వదించాయి. ఆ దంపతులు ఏడుగురు పుత్రులు ఏడుగురు పుత్రికలను కన్నారు.వారివల్ల అంగిరసుని వంశము పెరిగి విశ్వమంతము ప్రాకినది. ఒకసారి దేవతలపై అగ్నిహోత్రుడు కోపించి తన విద్యుక్త ధర్మములు నిర్వర్తింపక రహస్యముగ ఏకాంత వాసం చేయసాగాడు. ఈ విషయమును దేవతలు బ్రహ్మకు తెలయజేయగా అంగిరసుని పిలిపించి అగ్నిహోత్రుని విధులను నిర్వహించమని ఆదేశించాడు.తండ్రి ఆజ్ఞను శిరసావహించి అంగిరసుడు అగ్నిదేవుని విధులు నిర్వర్తిస్తున్నాడు.అగ్ని లేని లోపం తీరిపోయింది.అగ్నిదేవుని మరచి అంగిరసుని పూజిస్తున్నారు.దేవతా గణాలు ఆ విసయం అగ్నిహోత్రునకు తెలియగా తనకు గుర్తింపు ఉండదని గ్రహించి అంగిరసుని వద్దకు వచ్చి తన పనులు తానే నిర్వహిస్తానని కోరతాడు.
అంగీరసుడు అంగీకరించి అగ్నహోత్రుడుకే విధులు అప్పగిస్తాడు. అగ్ని సంతసించి అంగీరసునకు ద్వితీయాగ్ని స్ధానమిచ్చి సత్కరిస్తాడు. అంతే కాదు అంగిరసుని కుమారుడగు బృహసృతికి తృతీయాగ్ని స్దానం ఏర్పరిచాడు. అది అంగిరసుని గొప్పతనానికి నిదర్శనం.
అంగిరసుడు ఒకప్పుడు కశ్యపమహర్షి వలన పుణ్యక్షేత్రముల మహిమ నెరిగి గౌతమమహర్షి వలన వాటి ప్రభావమును తెలిసికొని వరుసగా చంద్రభాగ,హిరణ్యబిందు,ఇంద్రతోయ,కరతోయ,అపాంహ్రదము,మహాశ్రయ,భృగుతుంగ,కన్యాకూప,సుందరికాహ్రద,వైమానిక,విపాశ,కాళాకాశ్రమము,ద్రోణశర్మ పదము, శరస్తంభము, దేవరారువనము, చిత్రకూటము, జన్మస్ధానము,శ్యామాశ్రము, కౌశికవాల,మతంగ వాపిక, నైమికము, ఉత్పలావనము, వైవస్వతి, లౌహిత్య, రామహ్రదము, మహాహ్రాద, నర్మద, జంబూనది, కోకాముఖ, కండులికాశ్రమము, కుల్య, ఆర్షి సేవశ్రమము,ధర్మారణ్యము, బ్రహ్మసరస్సు మొదలైన పుణ్యక్షేత్రములు తిరిగి వాటిని గురించి గౌతమునకు తెలిపి అంగిరసుడు ఆనందించాడు.
ఒకప్పుడు అగ్ని సప్తర్షి పత్నులను మోహించాడు. ఆ విషయం అంగిరసుడు గ్రహించి అగ్నిని, సప్తర్షి పత్నులను శపించాడు. అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని, సప్తర్షిపత్నులను బ్రాహ్మణుల యింట సౌందర్యవతులై జన్మించమని శపించాడు. శౌనకుడు అంగిరసుని వద్దకు వచ్చి బ్రహ్మ విద్యను బోధించమని కోరగా అంగిరసుడు సవివరముగా ఉపదేశిచాడు.ఈ విషయములు ముండకోపనిషత్తునందు తెల్పబడ్డాయి. అంగిరసుడు స్మతికర్తకారులో ఒకడుగా పరగణింపబడ్డాడు. ఆయన బోధించిన ధర్మవిషయాలుఅంగిరస స్మృతియను పేర ప్రసిద్ధికెక్కినవి. అంగిరసుని మహర్షులందరు స్తుతించారు.అంగిరసులు అధర్వణ వేదద్రష్టలు.వారు ధర్మ పూర్ణమాన యజ్ఞమును చేసి స్వర్గమునందినారు.వారి యజ్ఞఫలమును భూలోకకాసులకు ధారపోసారు.అంగిరసులు దేవతాతుల్యులు,ఆదిత్యులు అంగిరసులకు భూమిని దానం చేశారు.
బ్రహ్మసృష్టిలో మొదటివారు అంగిరసులు. వారు రాజులకు పురోహితులుగా ఉండెడివారు. ఉపనిషత్తులలో అంగిరసుల ప్రస్థాపన గలదు. ఆత్మ అవినాశమని అంగిరసులు తెలియజేశారు. ఓంకారమును గురించి వివరించి చెప్పినవారు అంగిరసులే.