header

Aruni Maharshi

అరుణి
పూర్వకాలమున అరుణుడను పేరు గల ముని ఉండెడివాడు. ఆతనికి అరుణి అను పేరు గల కుమారుడు గలడు. అరుణి చిన్నతనమునుండి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఈతడు సకలగుణ శోభితుడు, మౌనవ్రతుడు.
బ్రహ్మతేజస్వి. దేవికా నదీతీరాన ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉంటాడు. ఒకనాడు అరుణి దేవికా నదిలో స్నానం చేయుటకు బయలుదేరిపోతూ ఉండగా భయంకరాకారంలో ఒక క్రూరుడు ఎదురుగా రాసాగాడు.మహర్షి శ్రీహరినామం జపిస్తూ నడుస్తూన్నాడు. ఆ క్రూరుడు ఆ మహర్షి దివ్వతేజస్సును చూసి మంత్రముగ్ధుడై సాష్ఠాంగపడ్డాడు. అతడొక దొంగల నాయకుడు, అనేక క్రూరకృత్యాలు చేసాడు. మహర్షిని చూడగానే అతని మనస్సు మారినది.
మహర్షిని అనుసరిస్తూ సేవ చేయసాగాడు. సంవత్సరముల తరబడి సేవచేస్తూనే వున్నాడు.మహర్షికి ఏ ఆపదా రాకుండ కాపాడుతున్నాడు. ఒకసారి బెబ్బులి ఒకటి మహర్షి పై దాడిచేయబోగా ఆ దొంగల నాయకుడు బాణంతో దానిని సంహరించాడు.
అది అరుస్తూ అరుణి సమీపాన పడి మరణించినది. ఆ అరుపునకు అరుణి అదిరిపడి నమో నారాయణాయ అని బిగ్గరగా పలుకుతాడు . మరణించి పడివున్న బెబ్బులి శరీరం నుండి ఒక దివ్వ పురుషుడు అవతరించి వచ్చాడు. అతడు మహర్షికి నమస్కరించి మహాత్మా నేనొక వీరుడను, విప్రులను బాధించుటచే వారు నన్ను పులివికమ్మని శపించారు.
శాపవిమోచనం ప్రసాదించమని కోరగా వారు నారాయణ మంత్రం నా చెవిని శోకిన మరు క్షణం ఈ పులి రూపం పోయి మనుష్యురూపం వస్తుందని పలికారు. మీరు పలికిన నారాయణ మంత్రం విని నాకు శాపవిమోచనం కలిగింది అని అంటాడు .
తనను సేవించే దొంగలరాజుని పిలిచి నాయనా|నీ సాహసానికి ఎంతో సంతోషంగా ఉంది.నీకు ఏం కావాలో కోరుకో అని పలుకగా ఆ దొంగలనాయకుడు స్వామీ నాకు మోక్షమార్గమును తెలుపమని అనగా అరుణి నేటి నుండి మాంసము తినడం మాని, సత్య వ్రతుడివై నారాయణ స్మరణ చేయుచూ జీవించు అదే నీకు మార్గం ప్రసాదిస్తుంది అని తెలుపుతాడు. ముని అదేశానుశారం హరినామస్మరణ చేస్తూ తపస్సు ప్రారంభిస్తాడు. అతడే సత్యదేవుడను నామంతో కీర్తించి ధన్యుడవుతాడు.
అరుణి మరికొంతకాలమునకు పెండ్లిచేసికొని, ఒక కుమారుని కన్నాడు. అతనికి శ్వేతకేతు అని నామకరణం చేసి పెంచి పెద్దచేశారు. శ్వేతకేతు బ్రహ్మచర్య దీక్షతో విద్యాధ్యాయనం సాగిస్తుంటాడు. కానీ తను నేర్చినదే సమస్తమని గర్వించసాగాడు.
తండ్రి అతని జ్ఞానోదయం గావించదలచి నీవు నేర్చినది చాలా తక్కువ నీకు ఏమియూ తెలియదు. నేర్చుకోవలసినది ఎంతయో ఉన్నది. గర్వపడకుండా ప్రశాంతచిత్తుడవై సర్వమును తెలిసికొనుటకు ప్రయత్నించు.అంతేగాని గ్రహించినదే సర్వముని గర్వపడరాదు అని మందలించగ అతడు తండ్రి పాదాలపై పడి క్షమించమని ప్రార్ధిస్తాడు. అనంతరం తండ్రి వద్ద బ్రహ్మ జ్ఞానం గురించి తెలిసికొని మనస్సు అన్నమయమని, ప్రాణము ఉదకమయమని,వాక్కు తేజోమయమని తెలుసుకుంటాడు. పరమాత్మ సర్వస్వమని తెలియజేశాడు.
అరుణి కుమారుని, నాయానా మర్రి కాయను తెచ్చిపగులగొట్టిన ఎడల అందు ఏమియూ కనపడదు. కాని ఈ విత్తనము వల్లనే పెద్ద వృక్షము శాఖోపశాఖలుగా పెరుగుచున్నది కదా! జీవుడు కూడా ఇంతే. నిన్ను నీ వున్న ప్రదేశం నుండి దూరంగా గొనిపోయి అక్కడ నీ కనులకు గతంలు కట్టి నీ స్వస్థలమునకు వెళ్ళు అని అంటే నీవు రాగలవా! దారి తెలిసికోగలవా! కష్టపడి దారి తెలుసుకుంటూ రాగలవు.
అట్లే గురువునుచేరి మానవుడు మోక్షానికి దారి తెలిసికొని ముక్తి పొందాలి అని ఎన్నో విషయాలు తెలిపాడు. అంతా విని శ్వేతటకేతు తండ్రికి పాదాభివందనం చేసి తపమాచరించి బ్రహ్మర్షియై తరిస్తాడు.
అరుణి మహర్షి జీవితం మనకు ఆదర్శప్రాయమైనది. కానీ ఇతని చరిత్ర ఎక్కవ ప్రచారంలో ఉన్నట్లు కనబడదు.