header

Astavakrudu

అష్టావక్రుడు
త్రేతాయుగంలో జనకుడు మిధిలను పాలిస్తున్న కాలంలో, ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉత్తమరాలైన తన భార్యయైన సుజాతతో సహా నివసిస్తూ ఉండేవాడు. ఏకపాదుడు వేదవేత్త కావడం వల్ల ఆయన వద్దకు చాలామంది శిష్యులు అధ్యయనము చేస్తుంటారు. కాలక్రమంలో సుజాత గర్భవతి అవుతుంది. ఏకపాదుడు తన శిష్యులకు బోధించే వేదాలను సుజాత గర్భంలో ఉన్న శిశువు వంటబట్టించుకొని వేదములు వల్లెవేస్తుంటాడు.
కుమారునికి తండ్రి శాపం
ఒకనాడు తండ్రి వేదాలను వల్లెవేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ స్వరము తప్పినదని చెబుతాడు. ఏకపాదుడు కోపంతో తన పుత్రుడు పుట్టకుండానే తనను తప్పుపట్టాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో అష్టావక్రునిగా పుట్టమని శపిస్తాడు.
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి ఆశ్రమానికి అవసరమైన ధాన్యము, నూనె తెమ్మని చెబుతుంది. ఏకపాదుడు వాటి కొరకు జనక చక్రవర్తి వద్దకు వెళతాడు. ఆసమయంలో అక్కడ ఒక పందెము జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం వరుణుడి కుమారుడైన వందిని వాదంలో ఓడించిన వారికి వారు కోరుకున్నది ఇస్తారని, లేని యెడల జలంలో బంధితులుకావాల్సి ఉంటుందని చెబుతారు. ఏకపాదుడు వందితో తలపడి ఓడిపోయి జలంలో బంధించబడతాడు.
తరువాత సుజాత కుమారునికి జన్మనిస్తుంది. ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్న కారణంచే అష్టావక్రుడని నామకరణం చేస్తారు. అదే సమయాన సుజాత తల్లి కూడా ఒక పుత్రుని కంటుంది. ఆమె మహర్షి ఉద్ధాలకుని భార్య. ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేస్తాడు. అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకు మహర్షి వద్ద విద్యాభ్యాసం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా, శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగిస్తున్నాడు.
కొంత కాలమునకు తల్లి ద్వారా తన తండ్రి గురించి తెలుసుకొని జలంలో బంధించబడ్డ తన తండ్రిని విడిపించుకు రావలెనని, తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని తిన్నగా జనకమహారాజు ఆస్థానమునకు వెళ్ళి లోనికి పోబోగా ద్వారపాలకులు అడ్డుచెబుతారు. జ్ఞానులకే గాని బాలురకు లోనకు ప్రవేశం లేదని అంటారు. కానీ అష్టావక్రుడు అనేక శాస్త్ర విషయములు తెలిపి లోపలకు దారినిమ్మని అడుగుతాడు. ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇస్తారు. అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదిస్తానని తెలుపుతాడు. బాలుడవు నీవేమి, వందితో వాదించడమేమి అంటాడు. అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తి సామర్థ్యాలు తెలియపరుస్తాడు. జనకుడు వాదనకు ఒప్పుకుంటాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమవుతాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు బాలకుడగు అష్టావక్రుడి చేతిలో వంది ఓడిపోతాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు ఓ మహాజ్ఞానీ అజ్ఞాపింపుమని అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలబంధితుణ్ణి చేయుమని ఆదేశిస్తాడు.
ఇక్కడ ఒక దేవ రహస్యమున్నది. తనతో వాదంలో ఒడిన వారందరిని జలబంధనం పేరుతో తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపిస్తుంటాడు వంది. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తిస్తాడు. ఏకపాదుని, అష్టావక్రుని జనక మహారాజు సత్కరిస్తాడు. అష్టావక్రుని కీర్తి నలుదిశల వ్యాపిస్తుంది.
అష్టావక్రుని శాపవిముక్తి
ఏకపాదుడు, అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతోషిస్తాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు స్నానం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు అనుగ్రహిస్తాడు. అష్టావక్రుడు సుందరరూపుడవుతాడు. తల్లితండ్రులకు సేవ చేస్తూ ఆశ్రమజీవనం గడుపుతూ ఉంటాడు. అతనికి వివాహ వయస్సు రాగనే పెండ్లి చేయాలని నిర్ణయిస్తారు. తమ నిర్ణయమును కుమారునకు తెలియజేయగా, అష్టావక్రుడు తన అంగీకారము తెలిసి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను వివాహము చేసుకొంటాడు.
గోపికల పూర్వ వృత్తాంతం
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములతో అష్టావక్రుని సంతోషపరుస్తారు.అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు మహావిష్ణువు యొక్క కృష్ణావతారంలో మీరు గోపికలై జన్మించి అతనిని పొందగలరని చెబుతాడు.
అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధం చేరుకొని మనస్సు పరమాత్మయందు నిలిపి తపస్సులో మునిగిపోతాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదముల వద్ద మరణిస్తాడు. మరణానంతరం అతడు గోలోమునకు పోయి మోక్షము పొందాడు.