header

Bruhaspati

బృహస్పతి
బృహస్పతి దేవతల గురువు. వేదములు మరియు అరవైనాలుగు కళలలో పండితుడు. దేవతల యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ, అసురుల యజ్ఞయాగాదులకు విఘ్నాలను ఏర్పరుస్తూ, దేవతలు కాపాడుతూ, వారికి మార్గనిర్ధేశకుడు అవుతాడు. అందుకే దేవతలకు బృహస్పతి గురువు మరియు పురోహితుడు. గురువారం (లక్ష్మీవారం) బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడినది. మానవుల ప్రవర్తనను నిర్ధారించే నవగ్రహాలలో బృహస్పతి (గురు గ్రహం) కూడా ఒకటి. బృహస్పతి స్వర్ణమకుటం మరియు సుందరమైన పూమాల ధరించి ఉంటాడు. పసుపుపచ్చని వస్త్రాలు ధరించి పద్మాసనములో ఆసీనుడై ఉంటాడు. ఇతనికి నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో బంగారముచే చేయబడిన దండము, రుద్రాక్ష జప మాల, పాత్ర, మరియు వరదముద్ర ఉంటాయి. బృహస్పతి అత్యంత సౌందర్యవంతుడని ఋగ్వేదం లో తెలుపబడినది. బంగారంతో నిర్మించబడిన ఇంట నివసిస్తుంటాడు. ఇతని రథము కూడా బంగారంచే నిర్మించబడి సూర్యునికి సమానంగా కాంతిని వెదజల్లుతుంది. అందులో అన్ని రకాల సౌకర్యాలుఉంటాయి. బృహస్పతి బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన అంగీరసుని కొడుకు. అయితే మరి కొన్ని పురాణాలలో ఇతను అగ్నిపుత్రుడుగా చెప్పబడుచున్నాడు. మొదట బృహస్పతి మానవమాత్రుడే. అయితే శివుడి ఆజ్ఞ చే దైవత్వం పొందినాడు. మహాబుద్ధిమంతుడు. ఇతనికి వాచస్పతి అని మరొక పేరు కలదు. ఇతని సహోదరుడు ఉతథ్యుఁడు. సహోదరి పేరు యోగసిద్ధి. బృహస్పతికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య పేరు శుభ. రెండవ భార్య తార. మూడవ భార్య మమత. ఈమె ద్వారా భరద్వాజ మరియు కచుడు జన్మించిరి.