గౌతమమహాముని అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కుమారుడు. దేవీ భాగవత పురాణం ప్రకారం, గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. ఈయనకు వామదేవుడు, నోధసుడు అని ఇరువురు పుత్రులు కలరు. వీరు కూడా మంత్ర ధృష్టలే.
గౌతముడి భార్య పేరు అహల్య ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. వీరి వివాహం వెనుక చాలా పెద్దకథ వుంది. ఒకసారి బ్రహ్మ ఒకఅందమైన కన్యను సృష్టించి ఆమెను ఎవరికివ్యాలని ఆలోచిస్తుండగా ఇంద్రాది దేవతలు ఎవరికి వారే ఆమెను తమకివ్వమని కోరతారు. అప్పుడు ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని బ్రహ్మ ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకొని వివాహమాడతాడు.
మిథిలా నగరానికి రాజుయైన జనకుడి కొలువులో రాజగురువైన శతానంద మహర్షి ఈయన పుత్రుడు. గౌతముడు ఆచరించిన 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వంలో చెప్పబడింది. నారదపురాణంలో ప్రస్తావించబడినట్లు ఒకసారి ఏకథాటిగా 12 ఏళ్ళు కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు. భరధ్వాజుడు, ఈయన అంగీరస మూలానికి చెందిన వారే.
గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మ సూత్రాలుగా ప్రఖ్యాతిచెందాయి. ఇవే మొట్టమొదటి ధర్మ సూత్రాలు అంటారు. మనువు రాసిన ధర్మ శాస్త్రాన్నే మొదటి మానవ జాతి ధర్మ శాస్త్రం అనికూడా అంటున్నారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంథంలో ఇందులో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలూ ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలూ, నలభై సంస్కారాలూ, చాతుర్వర్ణాలు, రాజధర్మాలు, శిక్షాస్మృతులు, స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు మొదలైన హింధూ ధర్మ శాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మ శాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు.