ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండములో వివరించబడింది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు.దశరథమహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు.
కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని మ్రింగుతుంది. కాలక్రమంతో ఆ జింక గర్భం ధరిస్తుంది జింకకు ఒక బాలకుడునకు జన్మనిస్తుంది. ఆ బాలకుడు తలపై కొమ్ముతో పుడతాడు. కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై నేర్పుతాడు. విభాండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు కూడా తెలియవు. ఇంద్రియ సుఖాలంటే ఏమిటో తెలియవు. ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ప్రకాశిస్తుంటాడు.
అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడవు అనావృష్టి కారణంగా కరువు వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారము చెప్పమని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడు తమ రాజ్యములో అడుగు పెడితే అతని ప్రభావంతో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.
రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, ఇంద్రియ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం తేలిక కాదని , దానికి తరుణోపాయంగా విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు.
మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమానికి పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అతనిని సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.
వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అంగదేశంలో అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము కురుస్తుంది.
ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి తెలిపి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటాడు రోమపాదుడు అంతేకాక తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు. (ఈ శాంత ధశరధుని కుమార్తె. రోమపాదుడు సంతానం లేని కారణంగా శాంతను చిన్నతనంలోనే దత్తత తీసుకుంటాడు)
ఇప్పటికీ ఋష్యశృంగుడి దేవాలయము శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.