శతానంద మహర్షి గౌతమ మహర్షి అహల్యకు పుట్టిన నలుగురు కొడుకులలో పెద్దవాడు. గౌతమ మహర్షి అహల్యలు కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యము గడుపుతూ లోకంలో కరువు కాటకాలు ప్రబలినపుడు తమ తపఃశక్తితో మూడులోకాల వాళ్లకి అన్నవస్త్రాలు ఇచ్చారు. ఇలా చాలా కాలం గడచిన తరువాత గౌతముడు అహల్యని ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె స్త్రీకి సహజంగా ఉండే కోరిక అయిన మాతృత్వాన్ని కోరుకుంది.
అహల్య కోరిక మేర గౌతముడు ఆమెను వంద వనములలో తిప్పి, వందరకాలుగా ఆనందపడేలా చేసాడు. అలా శత రకాలుగా ఆనందపడి కొడుకుని కన్నారు కాబట్టి ఆ బాలుడికి శతానందుడు అని పేరు పెట్టారు. శతానందుడు తండ్రి గౌతముని దగ్గరే సమస్త వేదశాస్త్రాది విద్యలు నేర్చుకుని బ్రహ్మచర్యాశ్రమము పాటిస్తూ మహా తపశ్శాలి అయ్యాడు.
అతని బుద్ధివైభవము, జ్ఞానసంపద, తపోనిరతి విని జనక మహారాజు తన ఆస్థాన పురోహితునిగా వుండుమని ప్రార్ధించాడు. ఇది విన్న గౌతమ మహర్షి ఆనందించి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఇద్దరినీ మిథిలా నగరానికి పంపాడు. అక్కడ జనకుడు శతానండుడిని తమ కులగురువుని చేసుకున్నాడు.
తరువాతి కాలంలో గౌతముడు అహల్యను శపించటం, శ్రీరాముదు పుట్టటం, వనవాసము, యాగ రక్షణకోసం విశ్వామిత్రుని వెంట వెళ్ళటం, శతానందుని తల్లి అయిన అహల్య శాపవిమోచనము మొదలయినవి జరిగిపోయి, శ్రీరాముడు మిధిలకు వచ్చినప్పుడు, జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతం పలుకుతాడు. శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి గొప్పతనం గురించి వివరంగా చెప్తాడు.
మిథిలా నగరంలో ఏర్పాటు చేసిన సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచి సీతమ్మను పెల్లిచేసుకునే సందర్భంలోదశరథుడి వైపు వశిష్టుడు ఉంటే జనకుడి వైపు శతానందుడు ఉండి గోత్రప్రవరాలు చెప్పి సీతారామ కళ్యాణం చేయిస్తాడు.
కొంతకాలం తరువాత శతానండుడికి తన భార్య వల్ల సత్యధృతుడు అనే కొడుకు పుడతాడు. అతను పుడుతూనే చేతిలో బాణంతో పుట్టటం వల్ల అతనికి 'శరద్వంతుడు' అని పేరు వచ్చెను. అప్పటినుండే శరము అంటే బాణం వదలకుండా ఉండటం వల్ల అతని మనస్సు వేదశాస్త్రాది విద్యల వైపు కన్నా ధనుర్వేదం వైపే ఎక్కువగా మనసు పారేసుకునేవాడు. గొప్ప తపఃశక్తితో ఎన్నో అస్త్రాలు పొంది ఇంకా మరెన్నో అస్త్రాలని పొందటానికి తపస్సు చేస్తూనే ఉండేవాడు.
శతానందుని కొడుకైన శరద్వంతుడికి కృపుడు, కృప అని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. వాళ్ళని ఎక్కువ కాలం శంతనమహారాజే పెంచుతాడు. కృపుడు కూడా ధనుర్విద్యలో గొప్పవాడయ్యి కృపాచార్యుడిగా పేరు పొంది కౌరవ - పాండవులకి గురువయ్యాడు.
ఈ విధంగా శతానంద మహర్షి తన తపఃశక్తి వల్ల మాత్రమే కాకుండా మంచి కొడుకు, మంచి మనవల్ని కూడా పొందటం వల్ల ఇంకా కీర్తిమంతుడవుతాడు.