header

Suka Maharshi

శుకమహర్షి
suka maharshi శుకమహర్షి వేద వ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహము నందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. శమీక ముని కుమారుడైన శృంగిచే ఏడురోజులలో మరణిస్తాడని శపించబడ్డ పరీక్షిత్తు మహారాజుకు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపించాడు
శుక జననం
వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేస్తాడు. పరమశివుడు ప్రత్యక్షంకాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థించగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు. ఒకనాడు వ్యాసుడు అరణి (అగ్ని) మథించుచుండగా ఘృతాచి అనే అప్సరస కనుపిస్తుంది. ఆమెను చూడగానే వ్యాసుడు కామప్రేరితుడై వీర్యస్థలనం చేసికొన్నాడు. ఘృతాచి తన్ను బుషి శపించునేమోయని చిలుక రూపం ధరించి యున్నది. అంత వ్యాస మహర్షి వీర్యం నుండి శుకుడు జన్మించాడు. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి శుకునకు ఉపనయనం చేస్తాడు. దేవేంద్రుడు కమండలం ఇస్తాడు. దేవతలు దివ్యవస్త్రం ప్రసాదిస్తారు.
తండ్రి అనుమతి తీసికొని శుకుడు దేవగురువు బృహస్పతి వద్ద ధర్మశాస్త్రము,రాజనీతి నేర్చుకొన్నాడు. విద్య పూర్తి అయిన పిమ్మట శుకుడు తన తండ్రి యగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. వచ్చిన శుకుని చూసి వ్యాసుడు సంతోషిస్తాడు. మునిబాలకులతో బాటు నివసిస్తూ ఉంటాడు వ్యాసుడు తన కుమారుని దగ్గరకు పిలిచి నాయనా నీవు జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపుతాడు
శుకుడు తిన్నగా మిథిలానగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయమని ద్వారపాలకులకు చెబుతాడు. శుకడి రాక తెలియగనే సపరివారంగా ఎదురేగి జనకరాజు శుకుని లోనికి ఆహ్వానిస్తాడు. కాంచన సింహాసనం చూపిస్తాడు. పూలచే అతని పూజించాడు. శుకుని రాకకు కారణం తెలుపమనగా, శుకుడు జనక మహారాజా, మా తండ్రి గారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం తెలిసికొనగొరి వచ్చాను అని చెబుతాడు. జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు పరమశాంతుడై జనకుని వద్ద సెలవు తీసికొని తిన్నగా తండ్రి గారి వద్దకు వస్తాడు.
శుకునకు వ్యాసమహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు. ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞగొని ఒకబోట ఉండక భూభాగమంత సంచరించసాగాడు. శుకుడు సంచారం పూర్తిచేసికొని తిరిగి తండ్రి గారి ఆశ్రమమునకు చేరి ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేయసాగాడు.
ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమమునకు రాగా శుకమహర్షి ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి ఈ లోకమున పుట్టిన వానికి హితమేదియో తెలియజేమండని అడుగుతాడు. నారదుడు వివరించి చెప్పగా శుకుడు మహా యోగియైనాడు.
శుకుని చూచి అప్సరలు సిగ్గువిడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణము. కాని వ్యాసమహర్షిని చూచి వారు వలువలు ధరించేవారు. శుకుడు ఆసక్తత గలవాడనియూ తాను సక్తత గలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించే వాడు. పుత్రుడు మహాన్నతకు సంతోషపడేవాడు. శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాలలోనూ కనపడడు. ఇది త్రికాలబాధ్యమానమైన సత్యం. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమ యోగీశ్వరుడు. శుకుని రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమని కోరుతుంది. శుకుడు తుచ్ఛ సుఖములు ఆశించనని ఆమెను నిరాకరిస్తాడు. ఈ విషయం శుక, రంభా సంవాద రూపమున లోకమందు ప్రసిద్ధి చెందింది.