వశిష్టడు గొప్ప మహర్షి. మహాతపశ్శక్తి సంపన్నుడు. సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకరు. త్రేతాయుగం నుండి వశిష్టుని గురించి మనకు వివరాలున్నాయి. వేదములలో తెలిపిన ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు. అయోధ్యానగరాని రాజైన దశరధమహారాజుయొక్క రాజగురువు. వశిష్టుని దగ్గరే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు విద్య నేర్చుకొంటారు.
సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడట. అందువల్ల వశిష్టునికి కులపతి అని పేరు వచ్చింది.
వశిష్టుడు వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఙాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. వశిష్టునికి అరుంధతీతో వివాహం జరుగుతుంది.
అరుంధతి పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలుగా పేరుపొందుతుంది. హిందూ వివాహాలలో సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం వధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయిస్తారు. వీరికి 100 మంది
కుమారులు ఉంటారు. వారిలో శక్తి జేష్టుడు. శక్తి భార్య అద్రుశ్యంతి. శక్తి పుత్రుడే పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి పుత్రుడే వేదవ్యాసుడు