header

Vyagrapada

వ్యాఘ్రపాదుడు
వ్యాఘ్రపాదుడు ‘మధ్యందిన’ అనే మహర్షి కుమారుడు. గొప్పశివభక్తుడు చిదంబరంలోని శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు వ్యాఘ్రపాదుని ఒక సందేహం వస్తుంది. తాను శివుని అర్చన కోసం తాను సమీపంలోని అడవి నుండి రకరకాల పుష్పాలను సేకరిస్తున్నాను కదా! ఆ పూలను తాను సేకరించకముందే శివునికి అర్పించకముందే... తేనెటీగలు వాటిని ఆఘ్రాణిస్తున్నాయి కదా! వాటిలోని సారాన్ని పీల్చేసుకుంటున్నాయి కదా! అలా నిస్సారమైన పుష్పాలను తాను స్వామివారికి అర్పించడం ఏమిటన్న ఆలోచన తో సతమతమవుతుంటాడు.
తన సమస్యను తీర్చమంటూ ఆ పరమశివునే ప్రార్థిస్తాడు వ్యాఘ్రపాదుడు. నిజానికి తన మూర్తి ముందు ప్రేమతో ఏ పుష్పాన్ని ఉంచినా, ఆఖరికి బిల్వపత్రంతో తనను అర్చించినా శివునికి అభ్యంతరం లేదు. కానీ స్వచ్ఛమైన పూలనే తన చెంత ఉంచాలనుకునే వ్యాఘ్రపాదుని కోరికను ఆయన తీర్చదలుచుకున్నాడు. అందుకని అతను మూలమూలలా ఉండే స్వచ్ఛమైన పూలను సేకరించేందుకు అనువుగా పులి (వ్యాఘ్రము) ఇతనికి పాదాలను అనుగ్రహించాడు. అందుకనే ఆయనకు వ్యాఘ్రపాదుడు అన్న పేరు స్థిరపడిపోయింది. అమలినమైన పూలు ఎంతటి ఎత్తులో ఉన్నా, ఏ పొదలా దాగున్నా... కాళ్లకు ముళ్లు గుచ్చుకోకుండా నేర్పుగా వాటిని కోసేందుకు వ్యాఘ్రపాదాలు ఉపయోగపడసాగాయి.
చిదంబరంలో శివుడు నృత్యాన్ని చేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ అద్భుత ఘట్టానికి వ్యాఘ్రపాదుడు కూడా ఒక సాక్షిగా నిలిచాడంటారు. అందుకే ప్రాచీన చిత్రాపటాలలో పతంజలి రుషితో కలిసి నటరాజ స్వామిని కొలుస్తున్న వ్యాఘ్రపాదుని రూపం కనిపిస్తుంది.
వ్యాఘ్రపాదునికి ఇద్దరు కుమారులు- దౌమ్యుడు, ఉపమన్యుడు. ఇద్దరూ పరమశివనికి భక్తులే! అసాధారణ దీక్షా దక్షత కలిగినవారు. దౌమ్యుడు తరువాతకాలంలో పాండవులకు కులగురువుగా పేరుపొందుతాడు. ఉపమన్యుడు, సంతానాన్ని అనుగ్రహించగల ఓ వ్రతాన్ని గురించి సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణు భగవానినికే తెలుపుతాడు.