హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు. సృష్టికి ముందున్నవాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకు సృష్టి చేసే జ్ఞానాన్ని ఇచ్చింది వేదాలే. అందుకే వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్టువు నిమగ్నమై ఉంటాడు. అందుకోసమే విష్ణువు హయగ్రీవ అవతారాన్ని ధరించాడు. సృష్టి ప్రారంభంలో ఓసారి, మహావిష్ణువు నాభి కమలంలో కూర్చొని ఉన్న బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో మధుకైటభులు మొల్లగా వెనుక నుంచి వచ్చి వేదాలను అపహరించారు. చూస్తుండగానే ఆ ఇద్దరు రాక్షసులు సముద్ర జలాలలో అట్టడుగునకు వెళ్లిపోయారు.
వేదాలు లేకపోతే సృష్టి చేయడం ఎలా అని విచారించసాగాడు బ్రహ్మ.
ఆ సంక్షోభ సమయంలో ఆయనకు విష్ణువు గుర్తుకు వచ్చాడు. వెంటనే విష్ణువును స్తుతించాడు. పరిస్ధితి తీవ్రతను గమనించిన విష్ణుమూర్తి హయగ్రీయ స్వరూపంతో రసాతలానికి చేరాడు. అక్కడ స్వామి ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా సామవేదాన్ని గానం చేశాడు. ఆ మధుర గానవాహిని రసాతలమంతా మారుమోగింది. ఆ గానరసం రసాతంలోనే ఉన్న మధుకైటభుల చెవులకు సోకింది. ఆ నాదానికి పరవశించిన అసురులు, తాయి దొంగిలించిన వేదాలను ఒకచోట భద్రం చేసి, నాదం వినిపిస్తున్న దిక్కుకు పరుగులు తీశారు. ఇంతలో హయగ్రీవుడు, రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చాడు.
హయగ్రీవ రూపాన్ని విడచి అసలు రూపాన్ని ధరించాడు విష్ణువు. మధుకైటభులు గానం వినిపించిన దిక్కుకు వెళ్లారు. ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు. నిరుత్సాహంగా వేదాలను దాచిన చోటుకు తిరిగొచ్చారు. వారికి అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే బయటకు వచ్చిన ఆ రాక్షసులకు సముద్రతలం మీద దివ్యతేజస్సుతో వెలుగుతున్న ఆదిశేషుడి పడగల నీడలో యోగనిద్రా ముద్రలో ఉన్న విష్ణువు కనబడతాడు. రసాతంలో తాము దాచిన వేదాలను తీసుకువెళ్లింది ఆయనేనని నిర్ణయించుకున్నారు. స్వామిమీదకు యుద్దానికి దిగుతారు. స్వామి, లోకకంటకులు, అధర్మవర్తనులు అయిన ఆ ఇద్దరు రాక్షసులను సంహరించాడు.
అలా వేదోద్ధరణ దిశగా హయ్రగ్రీవ అవతరణం జరిగింది. అప్పుడే హయగ్రీవుడు బ్రహ్మకు వేదాధిపత్యాన్ని, సకల విద్యాధిపత్యాన్ని సరస్వతీ దేవికి అప్పగించాడు. అందుకే హయగ్రీవ ఉపాసన చేసినా హయగ్రీవ జయంతినాడు ఆస్వామిని స్మరించినా జ్ఞానానందాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.
ఇంకొక కధనం
మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మ రక్షణ కోసం అవతరించినవే. పూర్వ హయగ్రీవుడనే పేరుతో ఒక రాక్షసుడు ఉండేవాడు.ఆదిపరాశక్తిని గురించి తపస్సుచేసి, తనకు మరణం లేకుండా వరం కోరుకొన్నాడు. అమ్మ అలా కుదరదంది. హయగ్రీవుడు కొంత తెలివిగా లోచించి, గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇమ్మన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదనే నమ్మకం హయగ్రీవుడిది
అప్పటి నుండి హయగ్రీవుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా విష్ణువును శరణు వేడారు. విష్ణుమూర్తి చాలాకాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు. ఒ రోజున ఎక్కుపెట్టిన ధనస్సుకు తల ఆనించి నిద్రిస్తున్నాడు. ఎన్నాళ్లకూ నిద్ర లేవకపోవడంతో శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు. ఎక్కుపెట్టిన ధనస్సుకు బిగించి అల్లెతాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలకువ వస్తుందన్నాడు. ఆ తాడును కొరకగల శక్తి ఒక చెదపురుగుకు మాత్రమే ఉందని బ్రహ్మది దేవతలు చెదపురుగుని అల్లెతాడు తెంపమన్నారు.
చెదపురుడు తాడును కొరకడంతో ధనస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకు తగిలింది. ఆ తల ఎటో ఎగిరి దూసుకు వెళ్లింది. దానికోసం అన్నిచోట్లా వెతికారు కాని ఫలితం లేదు. ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని ప్రార్ధించారు. ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు తలను తెచ్చి విష్ణువు శరీరానికి అతికించమంది. దేవతలు అలాగే చేశారు. అలా హయగ్రీవ స్వామి అవతరించి తన పేరునే ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరిస్తాడు.
దేవతలంతా హయగ్రీవస్వామిని స్తుతించారు. ఇది జరిగింది శ్రావణ పూర్ణిమనాడు. అప్పటినుంచి హయగ్రీవ జయంతిని జరుపుకోవటం ఆచారంగా వస్తుంది.