హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన 17వ శతాబ్ధానికి చెందిన ఒక ప్రముఖమైన గురువు. రాఘవేంద్రస్వామి అసలుపేరు వెంకన్నభట్టు. జన్మస్థలం తమిళనాడులోని భువనగిరి. తల్లిదండ్రులు తిమ్మన్నభట్టు, గోపికాంబ. ఇతడు శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో పుట్టడం వలన వేంకటనాథుడని, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. ఇతనిని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. ఇతను వైష్ణవ మతాన్ని అనుసరించాడు..
ప్రాధమికవిద్యను తన బావగారైన లక్ష్మీనరసింహాచారి వద్ద నేర్చుకున్నాడు. 1614వ సంవత్సరంలో వీరికి సరస్వతీబాయితో వివాహం జరుగుతుంది. అదే సంవత్సరంలో వీరికి పుత్రసంతానం కలుగుతుంది. అతనికి లక్ష్మీనారాయణాచార్య అని పేరు పెడతారు.
తరువాత వీరి కుటుంబమంతా కుంభకోణానికి వలసవస్తారు. శ్రీమఠంలో సుదీంద్రతీర్థుల వద్ద శిష్యునిగా చేరతాడు. కొద్ది కాలంలోనే గొప్ప విద్యార్థిగా పేరుగాంచి, అన్ని తర్కాలలో, వాదోపవాదాల్లో తనకంటే గొప్పవారిని సైతం ఓడించాడు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు.
సంస్కృత. వైదిక శాస్త్రాలలో నిష్ణాతుడై అక్కడ విద్యార్థులకు విద్యను బోధిస్తుంటాడు. సంగీతంలో కూడా రాఘవేంద్రుడు పరిపూర్ణుడే. ఆకాలంలో గొప్ప వైణికుడుగా పేరుపొందాడు. తన గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరిస్తాడు. దక్షిణభారతదేశమంతా తన శిష్యులతో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు.
పంచముఖిలో తపమాచరిస్తాడు. పంచముఖ ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమంతుని దర్శనాన్ని పొందుతాడు. మంత్రాలయంలో మఠాన్ని స్థాపిస్తాడు. మంత్రాలయంలోనే జీవసమాధిలో ప్రవేశిస్తాడు. తన తరువాత 800 సంవత్సరాలపాటు తన ప్రభావం ఉంటుందని శిష్యులతో చెబుతాడు.
.