తారకాసురుణ్ని సంహరించడానికి పార్వతీపరమేశ్వరులకు జన్మించినవాడే సుబ్రహ్మణ్యుడు. రూపంలో అందగాడు.. శౌర్యంలో సాటిలేని వాడు. అందుకే దేవసేనాధిపతి అయ్యాడు. ఈయన వాహనం నెమలి. ఆయుధం శూలం. దీనిని విజయ శూలమనీ, జ్ఞాన శూలమనీ అంటారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు అన్న పేరుంది. అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం. ఈ ఆరుముఖాలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వానికి ప్రతిరూపాలుగా చెబుతారు. వల్లీ, దేవసేన స్వామివారి ఉభయ దేవేరులు.
కార్తికేయుడు మేధోమూర్తి. వేదాలు ఇతణ్ని యజ్ఞాగ్నిగా అభివర్ణించాయి. ఉపనిషత్తులు సనత్కుమారుడిగా కీర్తించాయి. శివుడికి ప్రణవనాదం అయిన ‘ఓం’కార అర్థాన్ని అనుగ్రహించాడట. అలా ఆదిదేవుడికే గురుదేవుడు అయ్యాడు కుమారస్వామి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ‘సేనాధిపతులలో స్కందుడిని నేను’ అని ప్రకటించడం.. స్కందుడి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.
ఉత్తరభారతంలో కన్నా.. దక్షిణాపథంలో సుబ్రహ్మణ్యుడి ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య ఆలయాలు అధికంగా ఉన్నాయి. తమిళనాట పళని, కర్ణాటకలో కుక్కి క్షేత్రాలు ప్రధానమైనవి. మన తెలుగునాట ఆంధ్రప్రదేశ్లోనూ కుమారస్వామి ఆలయాలు ఎక్కువ. అందులో పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న మోపిదేవి ఒకటి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి అన్నవరం వెళ్లే దారిలో చేబ్రోలు సమీపంలో ఏ.మల్లవరం అనే గ్రామం ఉంటుంది. అక్కడి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ప్రశాంతంగా ఉంటుంది.
సంతానం లేని దంపతులు స్కంద షష్ఠి రోజున ఆలయాన్ని సందర్శించి, రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. హైదరాబాద్లోని స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ప్రముఖమైనది. ప్రతి మంగళవారంతో పాటు, ప్రతి నెలా శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
కార్తికేయుడు, కుమారస్వామి, స్కందుడు, శరవణభవుడు.. ఇలా సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో పేర్లు. శక్తి కారకుడిగా పేరున్న ఆ స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా, స్కంద షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ.