header

Veera Brahmendra Swamy

వీరబ్రహ్మేంద్రస్వామి
బ్రహ్మంగారు సాక్షాత్ దైవస్వరూపులు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరినీ సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు
శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి వారు 1608 సంవత్సరంలో సరస్వతీ నదీతీరంలో ఉన్న బ్రహ్మానందపురంలో జన్మించారు. తల్లి దండ్రులు పరిపూర్ణాచార్య, ప్రకృతాంబ. కర్నాటక నందికొండలలోని పాపాఘ్నిమఠం (ప్రస్తుతం చిక్ బళ్ళాపుర్ జిల్లా కళావారి పల్లెలో ఉంది) పీఠాధిపతులు ఎనమదుల వీరభోజాచార్యులు, వీరపాపమాంట ఇంట బాల్యాన్ని గడిపాడు. సుమారు 12 సంవత్సరాల ప్రాయంలో ఈ ఆశ్రమాన్ని వదలి దేశ సంచారం చేస్తూ కంచి చేరి అక్కడ సూర్యోపాసన చేశాడు. తరువాత కర్నూలు జిల్లాలోని బనగానపల్లె చేరుకున్నారు. అక్కడ గరిమిరెడ్డి దంపతుల ఇంట గోవులను కాశాడు. ఇదే సమయంలో రవ్వలకొండలో కాలజ్గ్నానం రాశాడు. అన్నజయ్యను శిష్యునిగా స్వీకరించారు. పాతిక సంవత్సరాలు బనగాన పల్లెలో గడపి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లెకు చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే బ్రహ్మంగారి మఠంగా పిలువబడుచున్నది. ఇక్కడ తుది వరకు గడిపారు.
సంస్కరణల వాది
ఒకవైపు త్యాగం, మరోవైపు జ్గ్నానం, చైతన్యం, సంస్కరణ మొత్తం కలిపి బ్రహ్మంగారి జీవితం. ఈ నాలుగింటిని సమన్యయ పరచి తన ఆధీనంలోకి తెచ్చుకొని తన జీవితం దేశానికి, మొత్తం సమాజం మీదే పట్టు సాధించి తాను ఆలోచించిన సామాజిక మార్పు దిశగా జనబాహుళ్యాన్ని మళ్ళించాడు.

కాలజ్గ్నాన తత్వాలతో రాబోవు రోజుల్లో సంభవించే విపత్కర పరిస్ధితుల నుంచి ప్రజలను మేల్కొలిపాడు. చైతన్యపు కాగడాలను వెలిగించి ప్రపంచాన్ని వెలుగులతో నింపే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ స్వామి మార్గదర్శకుడు, పూజ్యనీయుడు, కీర్తింపదగినవాడు, దళితులకు, బహుజనులకు, చిరస్మరణీయుడు. వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప సంస్కర్త. భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరాన్ని చక్కగా నడుపుకుంటూ దేహాంతర యాత్ర సుగమమం చేసుకోవాలని, ఈ శరీరాన్ని లౌకిక సుఖాలకు లోను చేయకూడదంటారాయన.
సర్వశాస్త్ర నిష్ణాతుడైన స్వామి చిన్నతనంలోనే అద్త్వెత ప్రచారం, అస్పృశ్వతను వ్యతిరేకించడం, సామాజిక మార్పులు, హిందూ మహ్మదీయ సమైక్యత, వృత్తి విద్యా ప్రభోధం, సాంఘిక దురాచారాలు, జీవకారుణ్యం, మహిళాభ్యుదయానికి అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందించారు. శూద్రులకు, స్త్రీలకు వేదాధికారం లేకుండా ఉన్న రోజుల్లో స్వామి వాటన్నింటిపై పూర్తి స్థాయిలో సమాజాన్ని మేల్కొలిపే విధంగా వ్యవస్థలో చైతన్యాన్ని తీసుకు వచ్చారు.
శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి 1693 వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధిలో ప్రవేశించారు. ఆ సమాధిపై తర్వాత కాలంలో భక్తులు గుడి నిర్మించారు. గర్బగుడిలో స్వామి వారి సజీవ సమాధి ఒక్కటే ఉంది. సమాధిపై బ్రహ్మంగారి, గోవిందమాంబగారి ముఖ విలాసములు పూజకొరకు ఉంచారు. స్వామివారు రచించిన కాలజ్గ్నానం తాళపత్ర గ్రంధం ఒక వెండి పెట్టెలో ఉంచి సమాధిలో ఉంచారు. స్వామివారి పాదుకలు అక్కడే ఉన్నాయి. నాడు స్వాముల వారు మంచినీటితో వెలిగించిన జ్యోతి సమాధికి వెనుకభాగంలో ఉంది. దానిని అఖండ జ్యోతి అంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జ్యోతి వెలుగుతూనే ఉంది.
బ్రహ్మంగారి పేరుమీద ఇక్కడ రిజర్వాయర్ నిర్మించబడినది. ఈ ప్రాంతం వారి దాహార్తినీ తీరుస్తూ పంటభూములను సస్వశ్వామలం చేస్తుంది. యాత్రికులకు కనువిందు చేస్తుంది మంచి విహారస్థలం కూడా
ఎలా వెళ్ళాలి :
కడప దాకా రైలు ద్వారా ప్రయాణించి అక్కడనుండి నుండి 66 కిమీ దూరంలో ఉన్న బ్రహ్మంగారి మఠాని బస్సులలో ప్రయాణించి చేరుకోవచ్చ. విజయవాడ వైపు నుండి వెళ్ళేవారు రైలు ద్వారా ప్రయాణించి గిద్దలూరులో దిగి అక్కడ నుండి 75 కి.మీ ప్రయాణించి బ్రహ్మంగారి మఠం చేరుకోవచ్చు. లేదా విజయవాడ నుండి నేరుగా కడపకు బస్సుల ద్వారా ప్రయాణించి అక్కడనుంచి వెళ్ళవచ్చు. బ్రహ్మంగారి సదన్, గోవిందమ్మ సదన్ లలో మరియి టూరిజం వారి అతిధి గృహంలో వసతి సౌకర్యం కలదు. మఠం ఉదయం గం.6-30 ని.లనుండి మ.12-20 ని.లవరకు మరియు సా.3-00 గంటల నుండి రాత్రి 9-00 గంటల వరకు తెరచి ఉంటుంది.