సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే క్రీడ ఇది. కేవలం తమిళనాడులోనే ఈ సంప్రదాయం ఉంది.
స్పెయిన్ లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా జల్లికట్టు తీరు వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపకుండా మచ్చిక చేసుకుంటారు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు ఏ ఆయుధాన్ని ఉపయోగించరాదు.
తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని జరుపుకుంటారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి.
జల్లికట్టునే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం.
కొన్ని తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో గెలిచిన వారిని తమ భర్తలుగా వరించే వారని తెలుస్తుంది. నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3500 సంవత్సరాల క్రితంవిగా చెప్పబడుతున్న శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి.
ఇంకా మధురై కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. దీని వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చునని పురాతత్త్వ శాస్త్రవేత్తల అభిప్రాయం.
జల్లికట్టు ప్రధానంగా ఈ ఊర్లలో జరుగుతుంది.
1. అనంగనల్లూరు
2. పుదుకోట్టై
3. సాలెం/తమ్మంపట్టి
4. మదురై దగ్గర ఉన్న పాలమేడు
5. కారైకుడి దగ్గర ఉన్న శ్రవయాల్
6. శివగంగ దగ్గర ఉన్న కందుప్పట్టి