మానవ జీవితమంతా జ్ఞాపకాల సమాహారం చేసే ప్రతి పనీ.. జ్ఞాపకాలతో ముడిపడినవే. మతిమరపు సరిగ్గా ఈ జ్ఞాపకాల మీదే ప్రభావం చూపిస్తుంది. నిజానికి మనం అప్పుడప్పుడు పేర్లను, వస్తువులు పెట్టిన చోట్లను మరచిపోవటం మామూలే. కానీ కొంతసేపటి తర్వాత అవి గుర్తుకొస్తాయి. కానీ అల్జీమర్స్ అలా కాదు. క్రమంగా ఒక్కొక్క జ్ఞాపకాన్ని తుడిచేస్తుంది. ఆలోచనా శక్తినీ, వివేచన దెబ్బ తింటాయి. కానీ దీని సంకేతాలు చాలాకాలం ముందు నుంచే.. తెలుస్తాయి.
కొద్ది సమయం క్రితం జరిగినవి గుర్తుండకపోవటం. ముఖ్యమైన తేదీలు, ఘటనలు మరచిపోవటం. ఒకే విషయం గురించి పదే పదే అడుగుతుండటం. ఒకప్పుడు వాడిన వస్తువుల వాడకంలోనూ ఇంట్లోవాళ్ల సహాయం తీసుకుంటుండటం.
సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవటంలో ఇబ్బంది పడటం. ఏ పని ఎలా చేయాలో అనేది నిర్ణయించుకోలేకపోవటం. ఒకప్పుడు వేగంగా, తేలికగా చేసిన పనులను పూర్తిచేయటానికి ఎక్కువ సమయం తీసుకుంటుండటం.
తేదీలు, సమయం, కాలాల విషయంలో ఇబ్బంది పడటం. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఉన్నామో కూడా తెలియక తికమకపడటం.
దూరాన్ని అంచనా వేయటం, రంగులను గుర్తించటంలో పొరపడటం.
మాట్లాడేటప్పుడు పదాలు తట్టకపోవటం. ఒక పదానికి బదులు మరొక పదాన్ని వాడటం. దీంతో కొందరు సంభాషణ కొనసాగించటం తెలియక మధ్యలోనే మానేస్తుంటారు.
వస్తువులను ఎక్కడెక్కడో పెట్టి మరచిపోవటం. కొందరు ఎవరో వాటిని దొంగిలించారనీ నిందిస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన రోజురోజుకీ పెరుగుతూ వస్తుంటుంది కూడా.
అంకెలు, లెక్కల విషయంలో పొరపాటు పడుతుండటం. డబ్బులను లెక్కించటంలోనూ ఇబ్బంది పడటం. దుస్తులు, పరిశుభ్రత గురించి అంతగా పట్టించుకోకపోవటం. నలుగురితో కలవటానికి ఇష్టపడకపోవటం. ఇష్టమైన హాబీలను, ఆటలను మానెయ్యటం.
మూడ్, వ్యక్తిత్వం మారిపోవటం. మాటిమాటికీ తికమక పడటం, ఇతరులను అనుమానించటం. అనవసరంగా ఆందోళన, భయాలకు గురికావటం. ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ చాలా త్వరగా ‘అప్‌సెట్’ అవ్వటం. ఈ లక్షణాలు కనిపించితే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ను సంప్రదించాలి