Doctor Saratchandra Mouli/Rumatology Dept/Kims Hospital/Secunderabad
డాక్టర్ శరత్ చంద్రమౌళి/రుమటాలజి/కిమ్స్/సికింద్రాబాద్ సౌజన్యంతో....
నిర్ధరణ-పరీక్షలు
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తీవ్రమైతే చూడగానే గుర్తుపట్టొచ్చు. వీరిలో శరీర భంగిమ బాగా మారిపోతుంది. నడుము ముందుకు వంగిపోయి, గూని వచ్చినట్టుగా ఉంటారు. మెడను అటూఇటూ సరిగా తిప్పలేరు. పక్కకు చూడాలంటే శరీరం మొత్తాన్ని తిప్పి చూస్తారు. ముందుకు వంగి పాదాలను చేత్తో తాకటమూ సాధ్యం కాదు. బాసింపట్టు వేసుకొని కూచోవటం (సుఖాసనం) సాధ్యం కాదు. వీటిని బట్టి చాలావరకు దీన్ని సులభంగానే గుర్తించొచ్చు. అయితే అందరిలోనూ ఇలాంటి లక్షణాలే ఉండాలనేమీ లేదు. అందువల్ల రక్తపరీక్ష, జన్యుపరీక్ష, ఎక్స్రేల వంటి వాటి ద్వారా సమస్యను నిర్ధరిస్తారు. వీరికి ఈఎస్ఆర్, సీఆర్పీ ఎక్కువగానూ.. హిమోగ్లిబిన్ తక్కువగానూ ఉంటుంది. జన్యుపరీక్షలో హెచ్ఎల్ఏ బి27 జన్యువు ఉంటే బయటపడుతుంది.
ఎక్స్రే: ఇందులో కండరబంధనాలు, స్నాయువులు గట్టిపడటం.. వెన్నుపూసలు, కీళ్ల మధ్య ఖాళీ పూడుకుపోవటం వంటివి తెలుస్తాయి. సాక్రో ఇలియాక్ కీళ్లు గట్టిపడితే సమస్య తొలిదశలో ఉందని అర్థం. అదే తీవ్రదశకు చేరుకుంటే కీళ్లు పూర్తిగా పూడుకుపోతాయి. ఏమాత్రం ఖాళీ కనిపించదు. కొన్నిసార్లు ఎక్స్రేలో తేడా కనబడకపోయినా లక్షణాలు ఉండొచ్చు. ఇలాంటివారికి ఎంఆర్ఐ చేసి పరిశీలిస్తారు. అవసరమైతే ఐసోటోప్ బోన్స్కాన్ కూడా చేస్తారు.
చికిత్స- వ్యాయామమే కీలకం
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మూలంగా దెబ్బతిన్న ఎముక తిరిగి కోలుకోవటం దాదాపు అసాధ్యం. అందువల్ల సమస్యను వీలైనంత త్వరగా నిర్ధరించి, చికిత్స తీసుకోవటం చాలా అవసరం. దీంతో ఎముక మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు ఫిజియోథెరపీ, వ్యాయామాలు, మందుల వంటివి బాగా ఉపయోగపడతాయి.
ఫిజియోథెరపీ: వెన్ను బిర్రబిగుసుకోవటానికి విశ్రాంతి పెద్ద శత్రువు. ఎందుకంటే కదలికలు తగ్గినకొద్దీ కీళ్లు బిగుసుకుపోవటం ఎక్కువవుతుంది. చురుకుగా ఉండటం, బాగా కదిలేలా చూసుకోవటమే దీనికి మంచి మందు. అందుకే చికిత్సలో ఫిజియోథెరపీ, వ్యాయామాలే చాలా కీలకం. రోజుకు కనీసం గంట సేపు వ్యాయామం చేయటం అవసరం. నొప్పులు ఎక్కువున్నా మందులు తీసుకుంటూనైనా వ్యాయామాలు ఆరంభించాలి. కొందరు యువకులు వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. కదలికలన్నీ బాగానే ఉంటున్నాయి కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. వెన్నెముక గడకర్రలా తయారయ్యాక చేసేదేమీ ఉండదని గుర్తించాలి. వీరికి ఈత, యోగ బాగా ఉపయోగపడతాయి. వీలైతే నడక వంటి ఇతరత్రా వ్యాయామాలూ చేయొచ్చు. ఒకసారి ఫిజియోథెరపీ తీసుకొని, వ్యాయామాలను నేర్చుకున్నాక ఎవరికివారు ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద బరువులు ఎత్తటం, బాక్సింగ్, ఫుట్బాల్ వంటి ఒంటికి దెబ్బలు తగలటానికి ఆస్కారం గల వ్యాయామాలు చేయకూడదు.
నొప్పి మందులు: ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం నొప్పి మందులు బాగా ఉపయోగపడతాయి. మొదట్లో రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అప్పటికి వ్యాయామాల ప్రభావం మొదలవుతుంది. కొంతకాలానికి వ్యాయామమే మందుగా పనిచేస్తుంది. నొప్పి తగ్గుతూ వస్తుంది. తర్వాత క్రమంగా నొప్పి మందులు మానెయ్యొచ్చు. అయితే నొప్పి మందులను సొంతంగా కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. లేకపోతే కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు.
సల్ఫసలజైన్, మిథట్రక్సేట్: ఇవి కీళ్లవాతానికి దారితీసే మూల కారణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి. వీటి వాడకం ఆరంభించిన రెండు, మూడు నెలల తర్వాత పూర్తి ప్రభావం కనబడుతుంది. సల్ఫసలజైన్ను ఉదయం, సాయంత్రం 1 గ్రాము మోతాదులో ఇస్తారు. మిథట్రక్సేట్ను వారానికి ఒకసారి మాత్రమే.. అదీ 15-25 మి.గ్రా. మోతాదులో ఇస్తారు. మిథట్రక్సేట్తో దుష్ప్రభావాలు తలెత్తకుండా పాటు ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణకు ప్రయత్నించేవారు మూడు నెలల ముందుగానే మిథట్రక్సేట్ మానెయ్యాల్సి ఉంటుంది.
స్టిరాయిడ్లు: కీళ్లు బాగా వాచిపోయి, విపరీతమైన నొప్పితో బాధపడేవారికి ఇంజెక్షన్ల రూపంలో నేరుగా కీళ్లలోకి ఇస్తారు. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇవి ఎంథెసైటిస్కు కూడా బాగా ఉపయోగపడతాయి. అరుదుగా కొందరికి స్టిరాయిడ్ మాత్రలు ఇవ్వాల్సి రావొచ్చు.
బయలాజికల్స్: ఇవి సజీవ కణాల నుంచి ఉత్పత్తి చేసే ప్రోటీన్ అణువులు. చాలా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయివి. కాకపోతే ఖరీదు ఎక్కువ. ఇటీవలి కాలంలో కాస్త చవకగానూ లభిస్తున్నాయి. వీటి రాకతో కీళ్లవాతం చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇవి వాపుప్రక్రియను ప్రేరేపించే టీఎన్ఎఫ్, ఇంటర్ల్యూకిన్-17 అనే సైటోకైన్లను అడ్డుకుంటూ.. వెన్నెముక బిగుసుకుపోవటాన్ని, కీళ్లవాపును తగ్గిస్తాయి. యాంటీ టీఎన్ఎన్ఎఫ్ మందుల్లో ఇన్ఫ్లిక్సిమాబ్, ఎటనొర్సెప్ట్, అడలి మాబ్, గొలిముమాబ్, సెరటొలిజుమాబ్ అని ఐదు రకాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా సెకిక్యునిమాబ్ అనే యాంటీ ఐఎల్-17 యాంటీబాడీ చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బయలాజికల్స్ మాదిరిగానే పనిచేసే ఎటాసెప్ట్, ఇన్ఫ్లిమాబ్, ఎగ్జిమ్షియా వంటి బయోసిమిలర్లు కూడా వస్తున్నాయి. వీటి ఖరీదూ తక్కువే.