హైబీపీ మందులను ఒకసారి మొదలుపెడితే ఇక జీవితాంతం వేసుకోక తప్పదనీ, శరీరం వీటికి అలవాటుపడిపోతుందనీ.. కాబట్టి సాధ్యమైనంత వరకూ మందులు మొదలు పెట్టకుండా మంచిదని చాలామంది భయపడుతుంటారు. కానీ ఇది ప్రమాదకరమైన ఆలోచన. బీపీ ఎక్కువగా ఉండి, వైద్యులు మందులు సిఫార్సు చేసినప్పుడు వాటిని వాడకపోతేనే ప్రమాదాలు ముంచుకొస్తాయి. మందులు వాడుకుంటూ బీపీని అదుపులో ఉంచుకోవటమే ఆరోగ్యానికి మంచిది. నిజానికి ఈ మందులు బీపీని నియంత్రణలో ఉంచుతూ.. మనల్ని ఇతరత్రా సమస్యల బారినపడకుండా కాపాడతాయి. ప్రస్తుతం బీపీ నియంత్రణకు పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీటిని వైద్యులు సూచిస్తారు. వీటిని క్రమం తప్పకుండా, శ్రద్ధగా వేసుకోవటం తప్పనిసరి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో మానెయ్య కూడదు. ఏదో ఒక మందు బాగా పనిచేస్తుందనో, మరెవరో చెప్పారనో మందులను మార్చొద్దు. ఈ మందుల విషయంలో డాక్టర్ సలహా ముఖ్యం.
--హైబీపీ బాధితులు మందులు వేసుకుంటూ బీపీని అదుపులో ఉంచుకుంటున్నాం కాబట్టి.. ఇక మనమేం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదని భావించకూడదు. మందులు వేసుకుంటున్నా కూడా.. ఉప్పు తక్కువగా తీసుకోవటం, ఆహారం మితంగా, కొవ్వు పదార్థాలు తక్కువగా తినటం, మద్యం, పొగ అలవాట్లు మానెయ్యటం, రోజుకి కనీసం అరగంట సేపు వ్యాయామం చెయ్యటం, కనీసం 6 గంటల సేపు నిద్రపోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
--కొందరు వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఆదుర్దా, ఆందోళన పడుతుంటారు. వీరికి ఈ సమయంలో బీపీ ఎక్కువగా కనిపించొచ్చు. అందువల్ల ఆసుపత్రికి వెళ్లిన వెంటనే కాకుండా..
5 నిమిషాల సేపు విశ్రాంతిగా కూచున్నాకే బీపీని పరీక్షించుకోవాలి.
-- పరీక్షకు గంట ముందు నుంచీ కాఫీ, టీ, పొగ తాగొద్దు.
రక్తపోటు 120/80 కన్నా తక్కువగా ఉండటం ఉత్తమం. 120/80 వరకూఉండటాన్ని ‘నార్మల్’గా భావిస్తారు. వీటిలో పైసంఖ్య 120-139 మధ్యగానీ, కింది సంఖ్య 80-89 మధ్యగానీ ఉంటే దాన్ని రక్తపోటుకు ముందస్తు దశగా (ప్రీహైపర్‌టెన్షన్) గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ పైసంఖ్య 140 గానీ, అంతకంటే ఎక్కువగాగానీ ఉన్నా.. కింది సంఖ్య 90గానీ, అంతకన్నా ఎక్కువగా గానీ ఉన్నా దాన్ని హైబీపీగా భావించాల్సిందే.
--హైబీపీ దశలోకి వెళ్లినవారు తప్పనిసరిగా మందులు వాడుకుంటూ బీపీని అదుపులో ఉంచుకోవాల్సిందే.
--ప్రీహైపర్‌టెన్షన్ దశలో ఉన్నవారు మాత్రం మందులు వాడుకోవాల్సిన పని లేదుగానీ జీవనశైలి మార్పులతో దాన్ని తప్పనిసరిగా నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి.
--అధికబరువు, వూబకాయంతో హైబీపీ ముప్పు పెరుగుతుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నవారు.. వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చెయ్యాలి.
--ఉప్పు బీపీ పెరగటానికి దోహదం చేస్తుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు రోజుకు 3-4 గ్రాములకు మించకుండా చూసుకోవాలి. పచ్చళ్లు, వడియాల వంటి నిల్వ పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మానెయ్యటం, లేదంటే బాగా తగ్గించెయ్యటం మేలు.
--మద్యం రక్తపోటు పెరిగేలా చేస్తుంది. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. ఒకవేళ మద్యం అలవాటుంటే రోజుకి 60 ఎం.ఎల్. కన్నా మించకుండా చూసుకోవాలి.
--సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చటం మూలంగా రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాలు గట్టిపడే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. అందువల్ల పొగ అలవాటుంటే మానెయ్యటం మంచిది.
రక్తపోటు నియంత్రణకే కాదు.. నివారణకూ వ్యాయామం తోడ్పడుతుంది. రోజూ కనీసం అరగంట సేపు నడక, జాగింగ్, సైకిల్ తొక్కటం, ఈత వంటివి చేయాలి. మనం వేగంగా నడుస్తున్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ ఉండటం వల్ల రక్తనాళాల సామర్థ్యం మెరుగవుతుంది. ఇది రక్తపోటు పెరగకుండా నివారిస్తుంది. గుండె పనితీరు కూడా మెరుగవుతుంది.
అధిక రక్తపోటుతో పాటు మధుమేహం కూడా ఉంటే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. ఈ రెండూ తోడు దొంగల్లాంటివి. మధుమేహులకు అధిక రక్తపోటు ముప్పు రెండు రెట్లు ఎక్కువ. అలాగే అధిక రక్తపోటు బాధితులకు మధుమేహం వచ్చే అవకాశం రెండున్నర రెట్లు అధికం. మధుమేహుల్లో తలెత్తే కరోనరీ గుండెజబ్బు (అంజైనా, గుండెపోటు), పక్షవాతం వంటివే కాదు... మూత్రపిండాలు, రెటీనా వంటి అవయవాలు దెబ్బతినటం కూడా అధిక రక్తపోటు మూలంగా ఉద్ధృతమయ్యే అవకాశముంది. కాబట్టి మధుమేహులు రక్తపోటుతో పాటు రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవటం తప్పనిసరి.