header

Bone Fracture

Dr.k.krishnaiah ఎముక విరిగింది.. అతుక్కోవాలంటే ఏం చెయ్యాలి?

.....................ఎన్నో అపోహలు .....................
బోన్‌సూప్‌
ఎముకలు విరిగాయి కాబట్టి ఎముకల సూపు తాగితే త్వరగా అతుక్కుంటాయన్నది పెద్ద భ్రమ. అది రుచికరంగా ఉంటే ఉండొచ్చు. ఆ రుచి నచ్చిన వాళ్లు తీసుకోవచ్చు. అంతేగానీ ఎముకలు విరిగాయి కాబట్టి అవి అతుక్కోవటానికి ఎముకల సూపుతో ప్రయోజనం ఉంటుందనుకోవటం అపోహే. ఇలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వకపోవటం ఉత్తమం.
క్యాల్షియం
కొందరు క్యాల్షియం మాత్రలు తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయని భావిస్తుంటారు. ఇది సరికాదు. ఒకవేళ ఇప్పటికే ఒంట్లో క్యాల్షియం లోపం ఉంటే క్యాల్షియం మాత్రలతో ప్రయోజనం ఉంటుందిగానీ లేకపోతే వాటిని తీసుకోవటం నిరుపయోగం!
గుడ్డుసొన
కోడిరక్తం, కోడిగుడ్డు సొన కొన్ని రకాల పసర్ల వంటివన్నీ వేసి కడుతుంటారు. ఇవి వైద్యులు కట్టే ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌’లా గట్టిపడి, తర్వాత ఎముకలు కదలకుండా స్థిరంగా ఉండేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకానీ వాటివల్ల ఎముకలు అతుక్కోవటమన్నది ఉండదు.
అతుక్కోపోతే..!
కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకున్నా ఎముకలు ఎంతకీ అతుక్కోవు. ముఖ్యంగా పొగ అలవాటు, పెద్ద వయసు, అత్యంత వేగవంతమైన ప్రమాదాల్లో ఎముకలు విరగటం.. ఇలాంటి సందర్భాల్లో ఎముకలు 6-9 నెలలు దాటినా అతకవు. దీన్నే ‘నాన్‌ యూనియన్‌’ అంటారు. వీరికి మరోసారి సర్జరీ చేసి- కటి ఎముక పైభాగం నుంచి చిన్నచిన్న ఎముక ముక్కలను తెచ్చి ఆ ఖాళీలో పూరించే ‘బోన్‌ గ్రాఫ్టింగ్‌’ సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. దీంతో అక్కడ వేగంగా కొత్త ఎముక ఏర్పడుతుంది. వృద్ధుల్లో తుంటి బంతి కీలు విరిగితే రక్తసరఫరా తెగిపోయి, అది తిరిగి అతుక్కోదు. ఇలాంటి వారికి కృత్రిమ బంతికీలు వెయ్యాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆపరేషన్లు సక్రమంగా చెయ్యకపోవటం, ఆపరేషన్‌ గది పరిశుభ్రంగా లేకపోవటం కూడా ఇన్ఫెక్షన్లకు, ఎముకలు అతుక్కోకపోవటానికి ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి.