మన ఒంట్లో కణాలన్నీక్రమపద్దతిలో శరీరమంతటా పెరుగుతూ, చనిపోతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇవి గతి తప్పి.. అవసరం లేకపోయినా, అవసరానికి మించి.. మన శరీరానికి హాని కలిగించేంతగా విపరీతంగా ఒకేచోట పెరుగుతాయి. ఇదే క్యాన్సర్. శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావొచ్చు. వీటిని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స చెయ్యటం సులువు. చాలా ఎక్కువగా కనబడే 8 రకాల క్యాన్సర్లను తొలిదశలోనైతే పూర్తిగా నయం చేసే అవకాశముంది కూడా.
అకారణంగా వేగంగా బరువు తగ్గిపోతుండటం. 5 అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గిపోవటం.ఆకలి తగ్గటం. ఎప్పుడూ కడుపు నిండుగా ఉండటం. ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం.తీవ్ర నిస్సత్తువకు లోనవుతుండటం. క్యాన్సర్ వృద్ధి చెందుతున్న సమయంలో తీవ్ర అలసట కనబడుతుంటుంది. ఇది విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. ఎముక, వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావొచ్చు. విడవకుండా తలనొప్పి, వెన్నునొప్పి వస్తుండటమూ కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావొచ్చు. మల విసర్జన పద్ధతుల్లో (మలబద్ధకం, అతిసారం).. మలం పరిమాణంలో మార్పులు తలెత్తటం.
మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, తరచుగా మూత్రం వస్తుండటం. నోట్లో చాలాకాలంగా మానకుండా పుండ్లు, తెల్లటి మచ్చలు ఉండటం. జననాంగాల్లో పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుండటం. మూత్రంలో, మలంలో, కళ్లెలో రక్తం పడుతుండటం. మెడ వద్ద, చంకల్లో లింప్ గ్రంథులు ఉబ్బటం. ఇవి రెండు వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. రొమ్ముల్లో మార్పులు, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావం వస్తుండటం. విడకకుండా దగ్గు వేధించటం. దగ్గుతో పాటు ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవటం, నిస్సత్తువ, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి కనబడితే ఏమాత్రం తాత్సారం చేయరాదు.
జ్వరం తగ్గకపోవటం. క్యాన్సర్ ఇతర చోట్లకు వ్యాపించినపుడు విడకుండా జ్వరం వేధిస్తుంటుంది. ఇలాంటి జ్వరాలు పగటిపూట పెరుగుతూ తగ్గుతూ వస్తుంటాయి. రోజులో ఒకే సమయంలో తీవ్రమవుతుంటాయి కూడా.
ఆయా జబ్బులు ఉన్నంత మాత్రాన అందరికీ అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదు. కొందరిలో కొన్నిరకాల లక్షణాలు కనబడితే మరికొందరిలో మరికొన్ని లక్షణాలు పొడసూపొచ్చు. నిజానికి జలుబు, ఫ్లూ వంటి మామూలు సమస్యల్లోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పుల వంటివి కనబడుతుంటాయి. వయసుతో పాటు అప్పుడప్పుడు మతిమరుపు వేధించటమూ సహజమే. కాబట్టి ఆయా లక్షణాలు కనబడినంత మాత్రాన వెంటనే బెంబేలు పడాల్సిన పనిలేదు. కానీ ఒకసారి డాక్టర్‌ను సంప్రతించి అసలు కారణమేంటో గుర్తించటం ముఖ్యం. దీంతో సమస్య ఏదైనా ఉంటే ముదరకుండా చూసుకోవచ్చు. ముందే నయం చేసుకోవచ్చు.
ఒత్తిడి
ఒత్తిడి సహజం. స్వల్పంగా ఉన్నప్పుడిది మేలే చేస్తుంది. భయాలను జయించటానికి.. పనులను పూర్తి చేయటానికి అవసరమైన శక్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ అదేపనిగా ఒత్తిడికి లోనవుతున్నా.. దీర్ఘకాలంగా వేధిస్తున్నా ప్రమాదం తప్పదు. హైబీపీ, ఊబకాయం వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఆత్మహత్య ఆలోచనలనూ ప్రేరేపించొచ్చు.
ఇవీ సంకేతాలు..
తలనొప్పి, మెడ నొప్పి, కండరాలు బిగుసుకుపోవటం.
నోరు పొడిబారుతుండటం.
గుండె దడ, ఛాతీలో నొప్పి.
తీవ్ర అలసట, నిస్సత్తువ.
ఆకలి తగ్గిపోవటం లేదూ తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ అతిగా తినటం.
తరచుగా జలుబు, ఫ్లూ బారిన పడుతుండటం.
పనులపై శ్రద్ధ, ఆసక్తి తగ్గటం.
మతిమరుపు. అనవసర కోపం, ఆందోళన