header

Cancer disease, Cervical Cancer, Liver Cancer, Stomack Cancer


Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273
క్యాన్సర్ చికిత్సలు, పూర్వపు రోజుల కన్నా క్యాన్సర్లను వేగంగా కనుగొనగల పరీక్షల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పటికీ.... మన దేశంలో వ్యాధుల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. గత పదేళ్లలో క్యాన్సర్తో మరణించే రోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ప్రతి ఏడాదీ దాదాపు 45,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో 70 శాతం మందికి పూర్తిగా నయమవుతుంది కూడా. అయితే జీవితంలోని ఏదో దశలో ఇది తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో రక్తసంబంధమైన క్యాన్సర్లు (లుకేమియా), మెదడులో వచ్చే కణుతులు (బ్రెయిన్ ట్యూమర్స్) ఎక్కువ. పిల్లల్లో అకస్మాత్తుగా జ్వరం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలతో క్యాన్సర్ బయటపడుతుంది.
సర్విక్స్ క్యాన్సర్
మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ అన్నిటికంటే ఎక్కువ. అమ్మాయిలు పెళ్లికి ముందు హెచ్పీవీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే చాలు... ఈ క్యాన్సర్ బారిన ఎప్పుడూ పడకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ అప్పటికే పెళ్లయి ఉన్నవారు పాప్స్మియర్ అనే ఒక చిన్న పరీక్ష ద్వారా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా ముందుగానే గుర్తించే అవకాశమూ ఉంది. లక్షణాలను ముందే గుర్తిస్తే నయం చేయడం చాలా తేలిక. దీని లక్షణాలు ఇవి...
యోని నుంచి అసాధారణ స్రావాలు ∙ నెలసరి మధ్యలో గాని లేదా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం ∙నెలసరి సమయంలో అంతకుముందు కంటే చాలా ఎక్కువగా రక్తస్రావం కావడం ∙ఆకలి, బరువు తగ్గడం, అలసట లేదా క్యాన్సర్ దశను బట్టి తీవ్రమైన నడుమునొప్పి, ఎముకలనొప్పులు, కాళ్లవాపు వంటి ఇతర లక్షణాలు. పాప్స్మియర్, కాల్పోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. హిస్టెరోస్కోపీ, ఊపరెక్టమీ వంటి శస్త్రచికిత్సలతో దీన్ని నయం చేయవచ్చు.
రొమ్ము క్యాన్సర్
మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలూ పెరుగుతుంటాయి. అవివాహిత మహిళలు, పిల్లలు పుట్టని స్త్రీలు, పాలు ఇవ్వనివారిలో, హార్మోన్ల మీద ప్రభావం చూపించే మందులు దీర్ఘకాలం పాటు వాడే వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. దీన్ని గుర్తించడం చాలా తేలిక. రొమ్ములో కదలని గట్టి గడ్డ, రొమ్ముల్లో లేదా చంకల్లో గడ్డ లేదా వాపు, చనుమొన సైజ్లో మార్పు, అది లోపలికి తిరిగి ఉండటం, రొమ్ము మీద చర్మం మందం కావడం, సొట్టపడటం, రొమ్ము మీద గుంటలు పడటం, రొమ్ము పై భాగాన ఎంతకూ నయం కాని పుండు, చనుమొన నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించే నాటికే వ్యాధి ముదిరి తొలిదశను దాటిపోయే ప్రమాదమూ ఉంది.
అందుకే 20 ఏళ్ల వయసు నుంచే మహిళలు తమ రొమ్ము పట్ల అవగాహనతో ఉండాలి. నెలసరి తర్వాత ఏడో రోజున స్వయంగా తన వేళ్లతో పరీక్షించుకుంటూ పై మార్పులు కనిపించాయా అని చూసుకోవాలి. 40 ఏళ్ల పైబడ్డాక డాక్టర్ చెప్పిన నిర్ణీత వ్యవధుల్లో అల్ట్రాసౌండ్, మామోగ్రామ్, అవసరాన్ని బట్టి బయాప్సీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చికిత్సలో భాగంగా గడ్డను మాత్రమే తీసివేయడం లేదా అవసరాన్ని బట్టి రొమ్మును తొలగించడం జరుగుతుంది. వైద్యచికిత్సల్లో ఇటీవలి పురోగతి వల్ల రొమ్మును తొలగించే అవసరం పెద్దగా ఉండటం లేదు.
లివర్ క్యాన్సర్
హెపటైటిస్–బి ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంలో లివర్ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే అందరూ హెపటైటిస్–బి వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే మేలు. అయితే ఇంచుమించూ ఇలాగే వ్యాపించే హెపటైటిస్–సి కి వ్యాక్సిన్ ఇంకా వ్యాక్సిన్ రూపొందలేదు. కాబట్టి సురక్షితం కాని శృంగారానికి, రక్తమార్పిడికి దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది.
కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కామెర్లు, వాంతులు, పొట్టలో నీరు చేరడం వంటి లక్షణాలు కాలేయ క్యాన్సర్ తీవ్రతకు సూచనలు. అందుకే హెపటైటిస్–బి ఉన్నవారు తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తల్లికి హెపటైటిస్–బి ఉంటే పుట్టిన వెంటనే బిడ్డకు 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దాంతో బిడ్డను హెపటైటిస్ వైరస్ బారిన పడకుండా చూడవచ్చు.
లంగ్ క్యాన్సర్
ప్రపంచవ్యాప్తంగా కనిపించే క్యాన్సర్ మరణాల్లో లంగ్ క్యాన్సర్ కారణంగా సంభవించేవే ఎక్కువ. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, దగ్గు, రక్తం పడటం, బరువు తగ్గడం, ఛాతీ/పొట్టలో నొప్పి, మింగడం కష్టం కావడం లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్కు వ్యాపించే గుణం ఎక్కువ. ఛాతీ ఎక్స్రే, బయాప్సీ, సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షలతో క్యాన్సర్ కణితి నిర్దిష్టంగా ఎక్కడ, ఏ దశలో ఉందో గుర్తించి అవసరమైతే లంగ్లో కొంత భాగాన్ని తీసివేసి లోబెక్టమీ అనే శస్త్రచికిత్స చేస్తారు. లేదా అదీ కుదరకపోతే కీమోథెరపీ ఇస్తారు.
పొట్ట క్యాన్సర్
దక్షిణ భారత దేశంలో పొట్ట (స్టమక్) క్యాన్సర్లు ఎక్కువ. కారణాలు కచ్చితంగా తెలియకపోయినా మసాలాలు, కారం ఎక్కువగా తినే అలవాట్లు దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. పొట్ట క్యాన్సర్ లక్షణాలు అల్సర్ లక్షణాల్లాగే కనిపిస్తాయి. అందుకే పొట్ట క్యాన్సర్ను చాలా సందర్భాల్లో అల్సర్ లక్షణాలుగా పొరబడే అవకాశం ఉంది. ఒక్కోసారి అది జీర్ణాశయం క్యాన్సర్కు దారితీయవచ్చు. కడుపులో నొప్పి, ఎసిడిటీ, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, వికారం, ఎక్కిళ్లు, తేన్పులు, రక్తపు వాంతులు, మలం నల్లగా రావడం లేదా మలంలో రక్తం కనిపించడం వంటివి దీని లక్షణాలు. ఎండోస్కోపీ, బయాప్సీ, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేస్తారు. చికిత్స విషయానికి వస్తే... కణితి అయితే పొట్టలో కొంతభాగాన్ని తీసివేసే గ్యాస్ట్రెక్టమీ చేస్తారు. కణితి పెద్దగా ఉండి చుట్టూ ఉన్న కణజాలానికి పాకితే అన్నవాహికలో కొంతభాగాన్ని, చిన్న పేగుల్లో కొంతభాగాన్ని తీసేయాల్సి రావచ్చు. అదే జరిగితే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.