డా॥.సి.హెచ్.మోహనవంశీ, ఛీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, ఒమేగా హాస్పటల్స్, హైదరాబాద్ : ఫోన్ : 9848011421
థైరాయిడ్ అనగానే చాలామందికి హార్మోన్ సమస్యలే గుర్తుకువస్తాయి. కాని కొందరిలో థైరాయిడ్ క్యాన్సర్లు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. వ్యాధిని గుర్తించి వైద్య చికిత్స తీసుకుంటే 95 శాతం క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి. అందుకే ముందుజాగ్రత్త పడడం మంచిదంటారు. ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డా॥ సి.హెచ్. మోహనవంశీ.
శరీరంలో థైరాక్సిన్ అనే అతిముఖ్యమైన హార్మోన్‌ను ఉత్పత్తిచేసే గ్రంధినే థైరాయిడ్ అంటారు. థైరిస్ అంటే గ్రీకు భాషలో షీల్డ్ అని అర్ధం. సుమారు 99 శాతం మందిలో ఈ గ్రంధి మామూలుగానే పనిచేస్తుంటుంది. కేవలం ఒక శాతం మందిలో మాత్రం ఈ గ్రంధి విరుద్ధంగా అంటే కొందరిలో తక్కువగానూ, కొందరిలో ఎక్కువగానూ పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంధి తక్కువగా పనిచేయడాన్ని హైపో థైరాయిడిజం అని, ఎక్కువగాపనిచేయడాన్ని హైపర్ థైరాయిడిజం అని పిలుస్తారు. అయితే హార్మోను ఉత్పత్తి సంబంధిత సమస్యలే కాకుండా థైరాయిడ్ ఒక్కొక్కసారి క్యాన్సర్ బారిన పడే అవకాశం వుంది. కాకపోతే హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు థైరాయిడ్ క్యాన్సర్లకు ఎటువంటి సంబంధం లేదు.
థైరాయిడ్ క్యాన్సర్ సమస్య పసిపిల్ల నుంచి వృద్థుల దాకా ఎవరికైనా రావచ్చు. కాకపోతే 20 నుంచి 40 ఏళ్లలోపు వారిలో ఈ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఒక థైరాయిడ్ గ్రంధుల్లో ఒకటి క్యాన్సర్ బారిన పడినా రెండవ గ్రంధి మొత్తం శరీరానికి కావలసిన థైరాక్సిన్ హార్మోనును ఉత్పత్తి చేస్తునే వుంటుంది. అందుకే చాలా రోజుల దాకా థైరాయిడ్ సమస్య మనకేమి మనకు తెలియకపోవచ్చు. కాని లోలోప క్యాన్సర్ పెరుగుతునే వుండవచ్చు.
ఎలా తెలుస్తుంది ?
థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడినవారు వారి మెడముందు భాగంలో వాపు కనిపిస్తుంది. ఆ వాపు గొంతు లోని ఏదో ఒకవైపున కాని, రెండువ వైపు కాని ఈ వాపు రావచ్చు. అయితే థైరాయిడ్ సమస్య సంబంధిత గాయిటర్‌లోను వాపు కనిపిస్తుంది. ఇది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. మరి కొన్ని ఇతర కారణాలతో కూడా కొందరిలో ఈ వాపు రావచ్చు. అందువల్ల థైరాయిడ్ లో వాపు కనిపించినంత మాత్రాన అది క్యాన్సర్ అనుకోవాల్సిన పనిలేదు. కాకపోతే థైరాయిడ్ క్యాన్సర్‌కు గురైన కొందరిలో ఇది ఒక లక్షణంగా కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంధినుంచి ఒక నరం, ఛాతీనుంచి స్వరపేటికకు వెళుతుంటుంది. థైరాయిడ్ క్యాన్సర్‌ను అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ కణితి ఆ నరాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల గొంతు బొంగురు పోవచ్చు. అందుకే గొంతు ఎక్కువ రోజు బొంగురుపోయి అలాగే వుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కొందరిలో థైరాయిడ్ గ్రంధిలో ఉన్న క్యాన్సర్ కణితి చాలా చిన్నగా వున్నపుడే లింక్ గ్రంధుకు సంబంధించి ముక్క పరీక్ష చేస్తే థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు బయటపడవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ రోజులు గడిచేకొద్ది ఎముకకు శ్వాసకోసాలకు వెన్నెముకకు ఇలా చాలా వివిధ భాగాలకు పాకుతు వెళుతుంటుంది.
అనేక రకాలు
థైరాయిడ్ క్యాన్సర్ అనేక రకాలు . వాటిల్లో ప్రధానంగా పాప్లిరీ కార్సినోమా,ఫాలికుర్ కార్సినోమా అనేవి రెండు రకాలు. ఈ క్యాన్సర్లు ఎక్కువగా 20 నుంచి 40 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే చాలావరకు ఈ రెండు పూర్తిగా నయమైపోయే క్యాన్సర్లే. పాప్లిరీ క్యాన్సర్‌కు ఎక్కువగా లింఫ్ నోడ్స్ లోకి పాకే స్వభావం వుంటుంది. పాలికులార్ క్యాన్సర్లు ఎముకకు, శ్వాసకోశాలకు ఎక్కువగా పాకుతూ వుంటాయి. అవసరమైన పరీక్షలన్నీ చేస్తే గాని, అది ఏరకమైన క్యాన్సరో నిర్ధారించలేము. ఈ రెండు రకాల క్యాన్సర్లలోనూ థైరాయిడ్ గ్రంధిని పూర్తిగా తొగించడం ఒక్కటే సరియైన పరిష్కారమార్గం.
శరీరంలోని ఏ ఇతర భాగాల్లో అయినా కణితి కనిపిస్తే ప్రోజన్‌బయాప్సి (ముక్క పరీక్ష) చేస్తే ఓ 10 నిమిషాల్లో రిపోర్టు వచ్చి వ్యాధి నిర్థారణ అయిపోతుంది. కాని, థైరాయిడ్ కణుతుల విషయంలో ఈ ప్రోజన్ బయాప్సి ఆధారంగా అది క్యాన్సరో కాదో నిర్ధారించడం చాలా కష్టం. థైరాయిడ్ గ్రంధికి ఇరువైపులా రెండు లోబ్స్ వుంటాయి. కుడి, ఎడమ లోబ్స్ అంటారు. ఒకవేళ కుడి లోబ్ లో కణితి ఏర్పడితే దాని ముక్క తీసి పరీక్షకు పంపితే ప్రోజన్ బయాప్సిలో ఒక్కోసారి ఏమీ తెలియకపోవచ్చు. అప్పుడు చివరి రిపోర్టు (పారాఫిన్ బయాప్సి) కోసం మళ్లీ ఎదురు చూడవలసి వుంటుంది.
పెద్ద వయసులో వేగంగా.......
నిజానికి 20 నుంచి 40 ఏళ్ల లోపు వచ్చే ఇతర క్యాన్సర్ లన్నీ వేగంగా పెరుగుతాయి. పెద్ద వయసులో మాత్రం నిదానంగా పెరుగుతాయి. అయితే, థైరాయిడ్ క్యాన్సర్ల తీరు మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వుంటుంది. ఇవి 20 నుంచి 40 ఏళ్ల లోపు నిదానంగా పెరుగుతాయి. వైద్య చికిత్సలతో 95 శాతం మందిలో పూర్తిగా నయమవుతాయి. పెద్ద వయసులో వస్తే చాలా వేగంగా పెరుగుతాయి. అలాగే మరీ చిన్న ప్లిల్లో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్లు కూడా చాలా వేగంగాపెరుగుతాయి. వీరందరికి శస్త్ర చికిత్స సరియైన మార్గం. థైరాయిడ్ క్యాన్సర్ కు శస్త్ర చికిత్స పూర్తయ్యాక రేడియో అయోడిన్ థెరపీ ఇస్తాం. నోటి ద్వారా అయోడిన్ ఇచ్చేదే ఈ థెరపీ. థైరాయిడ్ గ్రంధికి సహజంగా అయోడిన్ గ్రహించే తత్వం ఉంటుంది. అయోడిన్ థైరాయిడ్‌లో క్యాన్సర్ కణాల్లోకి వెళ్లిపోయి వాటిని నాశనం చేస్తుంది.
థైరాయిడ్ క్యాన్సర్ ఆలస్యంగానే వచ్చినా, థైరాయిడ్ గ్రంధిని మొత్తంగా తీసివేసి, రేడియో అయోడిన్ థెరపీ ఇస్తే వారిలో ఆయుష్షు గణనీయంగా పెరుగుతుంది. థైరాయిడ్ క్యాన్సర్లకు రేడియోషన్ గాని, కీమోథెరపీగాని పెద్దగా ఉపయోగపడదు. ఏమైనా శస్త్ర చికిత్స ఈ థైరాయిడ్ క్యాన్సర్లకు ప్రధాన చికిత్స.