header

Cataract / శుక్లం అంటే?

ఆధారం : ఈనాడు సుఖీభవ

Cataract / శుక్లం అంటే?
శుక్లం అంటే?
మన కన్ను ఒక కెమేరాలాంటిది! కెమేరాలో కటకం (లెన్స్‌) ఉన్నట్టే మన కంట్లో కూడా సహజంగానే ఒక కటకం ఉంటుంది. ఈ సహజమైన లెన్సు... అద్దంలా పారదర్శకంగా, బయటి నుంచి కాంతి కిరణాలు లోనికి ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. దీని గుండా కాంతి ప్రయాణించటం వల్లే మనకు చూపు కనబడుతుంటుంది. అయితే వయసుతో పాటు ఈ లెన్సు గట్టిబడి, లోనికి కాంతి ప్రయాణించటానికి వీల్లేకుండా తయారవుతుంది. ఇదే శుక్లం. తేలికగా చెప్పుకోవాలంటే మన కంట్లో లేలేత కొబ్బరిలా, ముంజెలా ఉండే కటకం కాస్తా.. గట్టిబడి, ముదురు కొబ్బరిలా, ముదిరిన తాటిముంజెలా తయారవుతుంది. దీంతో దీని గుండా కాంతి లోనికి ప్రయాణించలేదు. దీంతో చూపు తగ్గిపోతుంది. దీన్నే శుక్లం ఏర్పడటం’ అంటారు.
* శుక్లాలు అందరికీ వస్తాయా?
ఒక వయసు వచ్చేసరికి, దాదాపు అందరికీ కంట్లో శుక్లాలు ఏర్పడటంసహజం. చాలామందికి 55-60 ఏళ్లు వచ్చేసరికి ఎంతోకొంత శుక్లాలు తయారవుతాయి. ఇలా శుక్లాలకు పెద్ద వయసు ఒక కారణమైతే కొందరికి వంశపారంపర్య కారణాల రీత్యా శుక్లాలు కాస్త ముందుగానే రావచ్చు. స్టిరాయిడ్ల వంటి కొన్ని రకాల మందులు వాడటం, కంటికి గాయాలవ్వటం, వీటికి తోడు మధుమేహం వంటి ఇతరత్రా రుగ్మతలుండటం.. ఇవన్నీ కూడా శుక్లాలు కొంత ముందే ఏర్పడేలా చేస్తాయి. * శుక్లం ఏర్పడుతుంటే ఎలా తెలుస్తుంది?
కంట్లో పారదర్శకంగా ఉండే కటకం మబ్బుగా తయారవుతుంటుంది కాబట్టి చూపు తగ్గుతుంది. శుక్లాలు ఏర్పడుతున్న తొలి దశలో కళ్ల ముందరి ఒక వస్తువు పలు వస్తువులుగా కనబడుతుంటుంది. దీనివల్ల చూపులో స్పష్టత తగ్గుతుంది. కటకం మధ్య భాగంలో శుక్లం ఏర్పడుతుంటే రాత్రిపూట చూపు ఉన్నట్టుండి బాగా తగ్గిపోయినట్టు అనిపిస్తుంటుంది. పెద్ద వయసులో ఎలాంటి నొప్పీ, బాధా లేకుండా క్రమేపీ చూపు తగ్గుతోందంటే దాన్ని శుక్లంగా అనుమానించొచ్చు.
* శుక్లాలు మందులతో తగ్గిపోవా?
శుక్లాలు తగ్గేందుకు మందులేవీ లేవు. ఆయుర్వేదంలో కొన్ని రకాల మందులున్నాయని చెబుతుంటారుగానీ ఇప్పటి వరకూ శుక్లాలను నివారించే,లేదా వాటిని ముదరకుండా నిలువరించే మందులున్నట్టుగా శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణలూ జరగలేదు. దీనికి ఆపరేషన్‌ ఒక్కటే పరిష్కారం. దానితో చూపు సంపూర్ణంగా వచ్చేస్తుంది.
* శుక్లాల ఆపరేషన్‌ ఎప్పుడు చేయించుకోవాలి?
శుక్లాల వల్ల చూపు ఇబ్బందిగా తయారైనప్పుడు ఆపరేషన్‌ తప్పనిసరి. ఎప్పుడు చేయించుకోవాలన్నది చాలా వరకూ వ్యక్తిగతంగా తమ అవసరాలు, చూపులో ఎదురవుతున్న ఇబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రాత్రిపూట కారు నడపాల్సిన అవసరం ఉంటే, అంత పెద్ద వయసు కాకపోయినా.. శుక్లం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా కూడా సర్జరీ అవసరమవుతుంది. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత ఇంట్లోనే విశ్రాంతిగా ఉండే వ్యక్తి, పెద్దగా చదవాల్సిన అవసరమూ లేని వ్యక్తి అయితే శుక్లాలు కొద్దిగా ముదిరినా కూడా వెంటనే ఆపరేషన్‌ అక్కర్లేకపోవచ్చు. కాబట్టి శుక్లం ఆపరేషన్‌ విషయంలో మనకు చూపు ఎప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంటే అప్పుడు చేయించుకోవటం ఉత్తమం.
* ఆపరేషన్‌ శుక్లాలు బాగా ముదిరిన తర్వాతే చెయ్యాలా?
ఒకప్పుడు కనుగుడ్డు మీద పెద్ద కోతబెట్టి, ముదిరిన శుక్లాన్ని దాని గుండా బయటకు తీసేవాళ్లు. ఇది పాత పద్ధతి. ఇలా శుక్లాన్ని బయటకు తీసేటప్పుడు కొందరిలో లోపల కంటి నిర్మాణం కదిలిపోయి గుడ్డులోపలి ద్రవం బయటకు రావటం, రెటీనా పొర విడివడటం వంటి సమస్యలు తలెత్తేవి, వీటివల్ల చూపు పూర్తిగా దెబ్బతినేది. అందుకని శుక్లాలు బాగా ముదిరే వరకూ కూడా ముట్టుకునే వారు కాదు. వైద్యులు కూడా శుక్లం ముదిరిన తర్వాతే ఆపరేషన్‌ చేద్దామనే వారు. కానీ ఇప్పుడు ఆపరేషన్‌ చేసే పద్ధతి చాలా మారిపోయింది.
ఫేకో ఎమల్సిఫికేషన్‌’ అని పిలిచే నూతన విధానంలో కనుగుడ్డు పైపొర మీద చిన్న రంధ్రం చేసి, దాని గుండా సూదిలాంటి పరికరాన్ని లోనికి పంపి.. శుక్లాన్ని చిన్నచిన్నముక్కలుగా చేసి, ఆ సన్న రంధ్రం నుంచే వాటిని బయటకు తీసేస్తారు. కాబట్టి శుక్లం మరీ ముదిరిపోయి, గట్టిగా తయారైతే దాన్ని ముక్కలుముక్కలుగా చేసి, బయటకు తియ్యటం కష్టమవుతుంది. ఒకవేళ బలంగా ప్రయత్నించినా ఈ గట్టి ముక్కలు కనుగుడ్డు మీది పైపొరకు తగిలి, వాపు వచ్చేలా చేస్తాయి. దీనివల్ల ఆపరేషన్‌ తర్వాత కోలుకోవటానికి చాలా వారాలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు విస్తృతంగా అమల్లో ఉన్న నూతన విధానం ప్రకారం శుక్లం బాగా ముదరక ముందే, అంటే అది బాగా గట్టిపడక ముందే, చూపు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడే ఆపరేషన్‌ చేయించుకోవటం ఉత్తమం. శుక్లాలు ముదరాలని ఎదురుచూడటం మంచిది కాదు.
...............తరువాత పేజీలో ............