header

Allergy in Children / చిన్న పిల్లల్లో అలర్జీ

Allergy in Children / చిన్న పిల్లల్లో అలర్జీ

అలర్జీ.. రకరకాలు
అలర్జీలు శరీరంలో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఎవరికైనా రావొచ్చు. కుటుంబంలో ఎవరికైనా అలర్జీలు గలవారికి వీటి ముప్పు ఎక్కువ. అయితే జన్యువులు ఉన్నంత మాత్రాన అందరికీ రావాలనేమీ లేదు. వీటికి పుప్పొడి వంటి కారకాలు తోడైనప్పుడు కొందరిలో అలర్జీ ప్రేరేపితమవుతుంది. ప్రస్తుతం దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తక్షణం ఉపశమనం కలిగించే రిలీవర్లు, నియంత్రణలో ఉంచే కంట్రోలర్లతో మంచి ఫలితం కనబడుతుంది. అయితే చాలామంది లక్షణాలు తగ్గగానే మందులు మానేస్తుంటారు. దీంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. కాబట్టి డాక్టర్లు చెప్పినంత కాలం చికిత్స ఇప్పించాలి.
చర్మ అలర్జీ
దీని ప్రధాన లక్షణాలు దురద, దద్దు. రెండు నెలలకు పైగా దురద విడవకుండా వేధిస్తుంటే చర్మ అలర్జీగా నిర్ధరించొచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా). ఇది చర్మం పొడిబారటంతో మొదలై.. తీవ్రమైన దురద, దద్దుతో తెగ వేధిస్తుంది. కొందరు ఎప్పుడూ గోకుతూనే ఉంటారు. తరచుగా దద్దు రావటం వల్ల చర్మం మందంగానూ తయారవుతుంది. సొన, రసి కూడా కారొచ్చు. చాలావరకు ఇది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. అయితే కొంతమందిలో మోచేతులు, మోకాళ్ల ముడతల్లో స్వల్పంగా ఉండిపోవచ్చు. చర్మ అలర్జీలతో బాధపడే పిల్లలకు పోతపాలు, తెల్ల గుడ్డు, చేపలు ఇవ్వకపోవటం మంచిది. అలాగే సబ్బులు కూడా ఎక్కువగా వాడొద్దు. వీటితో చర్మం మరింత పొడిబారుతుంది. సబ్బులు అవసరమైతే గ్లిజరిన్‌ సబ్బులే వాడాలి. అలాగే ఉన్ని దుస్తుల వంటివి వేయొద్దు. కాటన్‌ దుస్తులు.. అదీ వదులుగా, మెత్తగా ఉన్నవే వేయాలి. చర్మానికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు తలెత్తినా వెంటనే చికిత్స చేయించాలి. చికిత్స: అటోపిక్‌ డెర్మటైటిస్‌ తీవ్రంగా ఉన్నప్పుడు స్టిరాయిడ్‌ పూతలతో తక్షణం ఉపశమనం కలుగుతుంది. అనంతరం మాయిశ్చరైజర్‌ క్రీములు వాడుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దురద తగ్గుముఖం పడుతుంది.
ముక్కు అలర్జీ
పిల్లల్లో అన్నింటికన్నా ఎక్కువగా కనబడే అలర్జీ ఇదే. ప్రతి ఆరుగురిలో ఒకరు దీంతో బాధపడుతున్నారని అంచనా. చాలామంది దీన్ని జలుబు, దగ్గుగా భావిస్తుంటారు. మామూలు జలుబు వారం, పది రోజుల కన్నా ఎక్కువుండదు. ముక్కు దురద కూడా అంతగా ఉండదు. తుమ్ము మీద తుమ్ములు రావు. కాబట్టి ఎవరికైనా 2 వారాలకు మించి జలుబు వేధిస్తుంటే అలర్జీగా అనుమానించాలి. ఇక 4 వారాలకు పైగా తుమ్ములు, ముక్కు దురద, ముక్కు బిగుసుకుపోవటం, ముక్కు కారటం వంటివి ఉంటే ముక్కు అలర్జీ అనే నిర్ధరించుకోవాలి. దీంతో పెద్ద సమస్య ఏంటంటే పిల్లల నిద్ర దెబ్బతినటం. దీంతో బడిలో కునికిపాట్లు పడుతుంటారు. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. పాఠాలు మనసుకు ఎక్కవు. చదువు వెనకబడుతుంది. అందరిలా ఆడుకోలేరు కూడా. ముక్కు బిగుసుకుపోయి నోటితోనూ శ్వాస తీస్తుంటారు. కొందరు నిద్రలో శ్వాస ఆగిపోయి.. ఉక్కిరి బిక్కిరయ్యి హఠాత్తుగా, భయంతో లేస్తుంటారు కూడా. సైనస్‌ గదులు, కళ్లు, చెవి నుంచి ముక్కులోకి వచ్చే మార్గాలు మూసుకుపోవటం వల్ల వీరిలో చాలామందికి సైనసైటిస్‌, చెవినొప్పి, చెవిలో చీము కారటం, కళ్లు ఎర్రబడటం, దురద వంటివీ ఉండొచ్చు. ముక్కు అలర్జీతో మరో పెద్ద సమస్య ఆస్థమా ముప్పు. ఇవి రెండూ జోడు గుర్రాలు. చాలామంది పిల్లల్లో ఇవి రెండూ కలిసే కనబడుతుంటాయి.
చికిత్స:
వీరికి సిట్రిజన్‌, లోరటడిన్‌, ఫెక్సిఫెనడిన్‌ వంటి కొత్తతరం మందులు వాడుకోవటం మంచిది. ఇవి పిల్లల మెదడును ప్రభావితం చెయ్యవు. మెదడు ఎగుదలను దెబ్బతీయవు. సురక్షితంగా వాడుకోవచ్చు. రోజూ ముక్కులోకి మొమెటజోన్‌ స్ప్రే వాడితే అలర్జీ నియంత్రణలో ఉంటుంది. కంటి అలర్జీలూ నియంత్రణలో ఉంటాయి. ముక్కు అలర్జీకి ఇప్పుడు ఇమ్యునోథెరపీ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ముందుగా అలర్జీ కారకాలను గుర్తించి.. వీటినే స్వల్ప మోతాదులో ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. నాలుక కింద వేసేవీ ఉన్నాయి. దీంతో రోగనిరోధకవ్యవస్థ బలోపేతమై సమస్య పూర్తిగా నయమైపోతుంది. ఒకట్రెండు అలర్జీ కారకాలు గలవారికిది బాగా పనిచేస్తుంది.
ఆస్థమా
పిల్లల పాలిట ఇప్పుడిదొక భూతంలా తయారైంది. సంపన్నులు, పేదలనే తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలనూ వేధిస్తోంది. దీని ప్రధాన లక్షణం దగ్గు. ముఖ్యంగా రాత్రిపూట దగ్గు ఎక్కువ. ఆయాసం, పిల్లికూతలూ ఉండొచ్చు. కొందరికి ఆటలు ఆడుతున్నప్పుడూ దగ్గు, ఆయాసం రావొచ్చు. ఇలాంటి లక్షణాలు తరచుగా, మళ్లీ మళ్లీ కనబడుతుండటం.. సాల్‌బుటమాల్‌ వంటి మందులతో తగ్గుతుంటే ఆస్థమాగా నిర్ధరిస్తారు.
చికిత్స:
ఆస్థమాకు నోటి ద్వారా పీల్చుకునే ఇన్‌హేలర్లు బాగా ఉపయోగపడతాయి. తక్షణం ఉపశమనం కలిగించే రిలీవర్లు (నీలం, ఆకుపచ్చ మూతగలవి).. మళ్లీ మళ్లీ రాకుండా చూసే కంట్రోలర్లు (ఎరుపు, వూదా, లేత గులాబీ రంగు మూతగలవి) అందుబాటులో ఉన్నాయి. కొందరు వీటిని జీవితాంతం వాడాల్సి ఉంటుందని, అలవాటు అవుతాయని, కీడు చేస్తాయనే అపోహలతో మధ్యలోనే ఆపేస్తుంటారు. ఇన్‌హేలర్లలో మందు చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది. అదీ అవసరమైన చోటుకే వెళ్తుంది. అందువల్ల సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తుంది. దుష్ప్రభావాలేవీ ఉండవు. వరుసగా 6 నెలల పాటు కంట్రోలర్లు వాడాక ఆస్థమా లక్షణాలేవీ లేకపోతే మందు మోతాదును సగం వరకు తగ్గించొచ్చు. తర్వాత మరో 3 నెలలు వాడాక లక్షణాలేవీ లేకపోతే ఏడాది వరకు వాడుకొని పూర్తిగా ఆపేయొచ్చు. అయితే మళ్లీ వచ్చే అవకాశం ఉందేమో గమనిస్తూ ఉండాలి.