డా.సుధీర్ ఆలపాటి, కన్సల్టంట్ పల్మనాలజిస్ట్, , సన్‌షైన్ హాస్పటల్స్, సికింద్రాబాద్
1, 2, 3, 4, 5, 6.... ఒకటి, రెండు, మూడు... చదువుతుంటే... ఇదేమిటి....? పిల్లల్లా ఒంట్లు లెక్కపెట్టడం ఏమి అనిపిస్తోందా? అదేం కాదు.. ఈ అంకెలు వేరే! వరుసగా ఆరు కూడా లెక్కపెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్లుగా ఆయాసం వస్తుంటే అది ఆస్తమా కావచ్చు. ఆ వ్యాధిలో ఊపిరి అందకపోవడంతోపాటు ఒక్కోసారి పిల్లికూతలతో, ఛాతీ అంతా పట్టేసినట్లుగానూ ఉండవచ్చు. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కుటుంబానికంతటికీ క్షోభ. కానీ.. కేవలం ఆరంకెలు లెక్కపెట్టేలోపు చదవగలిగే ఆరు స్టెప్పులతో దీన్ని నియంత్రించవచ్చు.
పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఒకింత కష్టమైన పని. ముఖ్యంగా ఆరేళ్ళలోపు వయసు ఉన్న వారిలో ఇది మరీ కష్టం. కాబట్టి లక్షణాలన్నీ ఆస్తమానే కనిపించినా డాక్టర్లు దాన్ని ఆస్తమా అని నిర్ధారణ చేయకపోవచ్చు.
ఆ తర్వాత కనిపించే లక్షణాల తీరుతెన్నులను బట్టి చిన్నారికి ఆస్తమా ఉందా అనే విషయం నిర్ధారణ చేయాలి. కాబట్టి, పిల్లికూతలు, ఆయాసం ఉన్న పిల్లల దీర్ఘకాలిక రికార్డును పరిగణనలోకి తీసుకుని దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ చిన్నారికి రెండేళ్ళలోపు ఉంటే దాన్ని ఆస్తమా అని చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే ఆస్తమాలోని లక్షణాలన్నీ బ్రాంకియోలైటిస్, వీజీ బ్రాంకైటిస్ వంటి వ్యాధులు ఉండవచ్చు. ఒకవేళ అది ఆస్తమా కూడా అయి ఉండవచ్చు. అందుకే ఊపిరి తీసుకోవడంలో కష్టం. పిల్లికూతలు వంటి లక్షణాలు ఉంటే తదనుగుణ చికిత్స తీసుకుంటూనే దాన్ని సమయానుకూలంగా రికార్డు చేస్తూ, దీర్ఘకాలికంగా గమనిస్తూ ఉండడం అవసరం.
పిల్లల్లో కనిపించే పిల్లికూతలు ప్రతిసారీ ఆస్తమా కాదు....
పిల్లల్లో ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లికూతల శబ్దం వినిపిస్తే కొందరు తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటుంది. ఇలా పిల్లికూతలు వినిపించే పిల్లలను మూడుగ్రూపులుగా విభజించవచ్చు.
గ్రూప్ - 1 : ఊపిరితిత్తుల సామర్థ్యం ఒకింత తక్కువగా ఉన్న పిల్లలు... ఇలాంటి పిల్లల్లో పిల్లికూతలు వినిపించినా కాలక్రమేణా వాళ్ళు తమ సమస్యను అధిగమించి ఆస్తమా లేని పిల్లలుగానే ఉంటారు.
గ్రూప్ - 2 : ఇమ్యూన్ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేకుండా (నాన్ ఎటోపిక్‌గా) వైరస్ కారణంగా వచ్చే ఆస్తమా. ఈ పిల్లలకూడా పై గ్రూప్ పిల్లలకంటే కొద్దిగా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా, ఆ తర్వాత సమస్యనుంచి బయటపడతారు.
గ్రూప్ - 3 : ఇలాంటి పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్యావస్థ దాటిన తర్వాత కూడా కనిపిస్తుంటాయి. కుటుంబచరిత్రలో ఆస్తమా ఉంటుంది. అలర్జీలు కూడా కనిపిస్తుంటాయి. వీళ్ళకు ఆస్తమా ఉందని చెప్పవచ్చు.
ఆస్తమాకు కారణం :
ఆస్తమా రావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జన్యుపరమైన, పర్యావరణ సంబంధమైన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. కొద్దిమేర వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల పాత్రకూడా ఉండవచ్చు.
ఎందుకు... ఎలా వస్తుంది?
మనకు పడని పదార్థం మనలోకి ప్రవేశించినపుడు లేదా ఏదైనా కాలుష్య పదార్థం ఊపిరితిత్తులకు దారితీసే గాలిమార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగిసిపోతాయి. శ్వాసమార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం (మ్యూకస్ లేదా ఫ్లమ్) ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలిగొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల కూడా ఊపిరి అందదు. ఫలితంగా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. మనకు పడనిదేదైనా మనలోకి ప్రవేశించినప్పుడు ఇదే అనుభవం పునరావృతమవుతుంది. ఇలా పడని పదార్ధాల్ని 'ట్రిగర్' అంటారు. వేర్వేరు వ్యక్తులకు ట్రిగర్స్ వేర్వేరుగా ఉంటాయి...
మారిన వాతావరణం, కాలుష్యం, పొగతో పాటు ఇళ్ళలోని దుమ్ము, కార్ప్‌ట్ లోని ధూళి, సరిపడని ఆహారపదార్ధాలు కొన్ని ఘాటైన రసాయనాల వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెట్స్ కు ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్, పోలెన్స్, ఎక్సర్‌సైజ్, ఆహారానికి కలిపే రంగులు (ఫుడ్ అడెటివ్స్ - పిల్లలను మరింత ఆకర్షించేందుకు చాలా పదార్ధాలకు ఇవి కలుపుతారు) కొన్ని రకాల మందులు (యాస్పిరిన్, సల్ఫాడ్రగ్స్ వంటివి)ఇలా వేర్వేరు ట్రిగర్స్ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉండవచ్చు. ట్రిగర్స్‌నుంచి పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు. కానీ వీలైనంతగా వాటి నుంచి దూరంగా ఉండాలి.
ఆస్తమా నిర్ధారణ....
ఆస్తమా నిర్ధారణ అంతతేలిక కాదు. దీనికి క్లినికల్ పరీక్షలు, రోగి పూర్వచరిత్ర, ల్యాబ్ పరీక్షలతో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధికి గురైనప్పుడు (ఎపిసోడ్‌లో మాత్రమే)ఊపిరి తీసుకోలేకపోవడం పిల్లికూతలు, దగ్గు రావడం, చికిత్స తీసుకుంటే తగ్గడం వంటివి జరుగుతున్నా, స్పైరోమిటి వంటి పరిక్షలు చేయించడం, నాలుగేళ్ళలోపు పిల్లలకైతే పిల్లికూతలు రోజంతా ఉండి ఆయాసంతో నిద్రపోలేక పోవడం, తల్లితండ్రులకు ఆస్తమా ఉండడం, ముక్కు కారుతూ ఉండడం (అలర్జిక్ రైనైటిస్) వంటి అంశాల ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాత తీవ్రతను అంచనా వేయాలి. తీవ్రతను బట్టి ఆస్తమాను అప్పుడప్పుడూ వచ్చేది, స్వల్పమైనది, ఓ మోస్తరు, తీవ్రత ఎక్కువగా ఉండి ఎప్పుడూ ఉండేదిగా వర్గీకరించవచ్చు.
చికిత్స
ఒకసారి ఈ వర్గీకరణ జరిగాక అత్యంత కనిష్టస్థాయి చికిత్స మొదలుకొని ఆరు దశలలో చికిత్స చేయవచ్చు.
1వ దశలో : అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడం
2వ దశలో : పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్స్ (ఇన్‌హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్-ఐసిఎస్) లేదా మాంటెలుకాస్ట్ టాబ్లట్స్
3వ దశలో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఓ మాదిరి మోతాదు (మాడరేట్)లో పీల్చదగిన యాక్టింగ్ బీ ఎగోనిస్ట్స్ (ఎల్‌బిఎ) ఇన్‌హేలర్స్
4వ దశలో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ టాబ్లెట్స్ లేదా లాంగ్ యాక్టింగ్ బీ ఎగోనిస్ట్స్ (ఎల్‌బిఎ) ఇన్‌హేలర్స్
5వ దశలో : ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎక్కువ డోస్‌తో ఉండే ఐసీఎస్ మాంటెలుకాస్ట్ టాబ్లెట్స్ లేదా లాండ్ యాక్టింగ్ బీ ఎగోనిస్ట్స్ (ఎల్‌ఎబిఎ) ఇన్‌హేలర్స్
6వ దశలో : మరీ తీవ్రంగా ఉన్నవారికి హైడోస్ ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ టాబ్టెట్స్ పాటు నోటి ద్వారా స్టెరాయిడ్స్ ఇవ్వడం.
పిల్లలకు ఆస్తమా తీవ్రమవుతున్నట్లు గుర్తించడం ఇలా....
ఉదయం వేళల్లో పిల్లలకు పిల్లికూతలు, దగ్గు ఎక్కువ అవుతుండడం.
వ్యాయామం తర్వాత పిల్లికూతలు, దగ్గు ఎక్కువగా రావడం.
రాత్రుళ్ళు నడిస్తే పిల్లికూతలు, దగ్గు పెరగడం.
ఏదైనా రిలీవర్ వాడాక ఈ లక్షణాలు తగ్గడం.
రిలీవర్ వాడుతున్నప్పుడు మునుపటి అంత మెరుగ్గా లేదా అంత త్వరగా రిలీఫ్ రాకపోవడం విం లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ఆస్తమా తీవ్రత పెరుగుతున్నట్లుగా భావించి నిపుణులకు చూపించాలి.