header

Chrone Diseases / క్రోన్స్ డిసీజ్ (పూత పేగులు

Chrone Diseases / క్రోన్స్ డిసీజ్ (పూత పేగులు

Dr. Sednthil Rajappa, Medical Ancolologist, Basavatarakam Hospital, Hyderabad డా.సెంధిల్ రాజప్ప, గారి సౌజన్యంతో... మెడికల్ అంకాలజిస్ట్, బసవతారకం హాస్పటల్, హైదారాబాద్
లక్షణాలు
పేగు పూత, వాపు బాధితుల్లో లక్షణాలు నెమ్మదిగా కనబడటం మొదలవుతుంది. కానీ కొన్నిసార్లు హఠాత్తుగానూ కనబడొచ్చు. కొందరిలో లక్షణాలు తగ్గిపోతూ, తిరిగి వస్తూ ఉండొచ్చు. క్రోన్స్ చాలావరకు పేగులకే పరిమితమవుతుంది. అయితే ఇది రోగనిరోధక వ్యవస్థతో ముడిపడింది కావటం వల్ల కళ్లు, కీళ్ల వంటి భాగాలకూ విస్తరించొచ్చు. దీంతో ఇతరత్రా భాగాల్లోనూ లక్షణాలూ పొడసూపుతుంటాయి.  విరేచనాలు
 కడుపునొప్పి, కడుపుబ్బరం
 బరువు తగ్గటం
 కొద్దిగా జ్వరం
 నిస్సత్తువ
 వికారం, వాంతి
 మలంలో రక్తం పడటం
 నోట్లో పుండ్లు
 పిల్లల్లో ఎదుగుదల లోపించటం
 పోషణ లోపం
 కళ్లు ఎర్రబడటం, కళ్ల వాపు
 చర్మంపై నొప్పితో కూడిన బుడిపెలు
 కీళ్ల వాపు, నొప్పి
పైత్యరస నాళం మూసుకుపోవటం
నిర్ధరణ ఎలా?
చాలావరకు బాధితులు చెప్పే లక్షణాలతోనే గుర్తిస్తారు. అయితే క్రోన్స్ను కచ్చితంగా నిర్ధరించుకోవటానికి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మలద్వారం ద్వారా కెమెరా గొట్టాన్ని పంపించి చేసే కొలనోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. అవసరమైతే దీంతో చిన్న ముక్కను తీసి (బయాప్సీ).. వాపు కణాల గుత్తులు (గ్రాన్యులోమాస్) ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. చిన్నపేగు మూసుకుపోవటాన్ని గుర్తించటానికి సీటీ ఎంటరోగ్రఫీ ఉపయోగపడుతుంది. కొలనోస్కోపీ, సీటీస్కాన్ వంటి వాటితో సమస్య నిర్ధరణ కాకపోతే.. పొట్టకు చిన్న రంధ్రం పెట్టి ల్యాప్రోస్కోపీ ద్వారా పరీక్షిస్తారు. ఇందులో పేగుల గోడలకు అటూఇటూ కొవ్వు పోగుపడితే బయటపడుతుంది. ఎందుకంటే పేగు గోడలకు కొవ్వు పేరుకుపోయేవారికి క్రోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే పేగు బయటి నుంచి చిన్నముక్కను తీసి పరీక్షించి సమస్యను నిర్ధరిస్తారు.
క్షయ మాదిరిగానే...
క్రోన్స్లో తలెత్తే గ్రాన్యులోమాస్ కూడా అచ్చం క్షయలో ఏర్పడే గ్రాన్యులోమాస్ మాదిరిగానే కనబడతాయి. అందువల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించటం కష్టం. క్షయలో గ్రాన్యులోమాల మధ్యలో కణజాలం గట్టిపడి ఉంటుంది (నెక్రోసిస్). అయితే అందరిలోనూ ఇలాగే ఉండాలని లేదు. కొందరిలో కణజాలం గట్టిపడకపోవచ్చు. కాబట్టి క్రోన్స్, క్షయ మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టమనే చెప్పుకోవాలి.
జీవితాంతం మందులు క్రోన్స్ పూర్తిగా నయం కావటం కష్టం. కానీ మందులతో పేగులో వాపు, పూత, జ్వరం, విరేచనాల వంటి వాటిని తగ్గించి.. సమస్యను నియంత్రణలో పెట్టుకోవచ్చు. అయితే వీటిని జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా సల్ఫసలజైన్ వంటి 5-అమైనోసాలిసీలేట్స్ రకం మందులు ఇస్తారు. వీటిని ముందుగా తక్కువ మోతాదుతో మొదలెట్టి క్రమంగా మోతాదు పెంచుకుంటూ వస్తారు. వాపు ప్రక్రియను తగ్గించటానికి ప్రెడ్నిసోన్ వంటి స్టిరాయిడ్లు కూడా ఇస్తారు. రోగ నిరోధకశక్తిని తగ్గించే అజథియోప్రైన్ వంటి మందులనూ సిఫార్సు చేస్తారు. వీటితో పాటు కాస్త ఖరీదైనవే అయినా ఇన్ఫ్లెక్సిమాబ్ వంటి బయోలజికల్స్ మందులు కూడా ఇస్తారు. ఇవి రోగనిరోధక వ్యవస్థతో ముడిపడిన ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ (టీఎన్ఎఫ్) ప్రోటీన్ను నిర్వీర్యం చేస్తాయి. ఇతరత్రా మందులు పనిచేయనివారికి మెథోట్రిక్సేట్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది కూడా. చీము గడ్డలు, ఇన్ఫెక్షన్, ఫిస్టులా వంటివి తగ్గటానికి యాంటీబయోటిక్ మందులు బాగా ఉపయోగపడతాయి. అలాగే విరేచనాలు, వికారం తగ్గించే మందులు.. పోషణలోపం తగ్గించటానికి విటమిన్ మాత్రలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పరిస్థితి కాస్త కుదురుకున్నా స్టిరాయిడ్స్ వంటివి తగ్గించుకుంటూ వచ్చి.. 5-అమైనోసాలిసిలేట్ మందులు మాత్రమే ఇస్తారు.
అవసరమైతే శస్త్రచికిత్స
మందులతో ఎలాంటి ప్రయోజనం కనబడనివారికి.. మందుల ప్రభావాన్ని తట్టుకోలేనివారికి.. పేగు సన్నబడటం, చీముగడ్డ, ఫిస్టులా వంటి ఇతరత్రా సమస్యలు తీవ్రమైనవారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో దెబ్బతిన్న పేగు భాగాన్ని తీసేస్తారు. చీముగడ్డలుంటే తొలగిస్తారు. ఫిస్టులా ఉన్నవారికి కొత్తగా ఏర్పడిన భాగాన్ని కత్తిరిస్తారు. సాధారణంగా క్రోన్స్ బాధితులకు మళ్లీ మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంటుంది. అందువల్ల వీలైనంత వరకూ తక్కువ పేగును తొలగించటానికే ప్రయత్నిస్తారు. అయితే శస్త్రచికిత్స చేసినా జబ్బు పూర్తిగా నయమైందని అనుకోవటానికి వీల్లేదు. ఆ భాగాన్ని తొలగించినా ఇంకా ఎక్కడైనా పూత, వాపు ఉండి ఉండొచ్చు. అందువల్ల శస్త్రచికిత్స తర్వాత కూడా విధిగా మందులు వేసుకోవాలి. లేకపోతే వేరే చోట పూత, వాపు తలెత్తొచ్చు. చాలాసార్లు శస్త్రచికిత్స చేయాల్సి రావటం వల్ల కొందరిలో పేగు పొడవూ తగ్గుతుంది. దీంతో పోషకాలను గ్రహించే సామర్థ్యమూ తగ్గుతుంది. ఇది పోషణలోపం వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది.
ఆహారం.. కాస్త జాగ్రత్తగా!
క్రోన్స్కు ఆహారం దోహదం చేస్తుందనటానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కానీ కొన్ని పదార్థాలు విరేచనాలు, కడుపుబ్బరం వంటి లక్షణాలను ఉద్ధృతం చేస్తాయి. అందువల్ల ఏయే పదార్థాలు తింటే లక్షణాలు ఎక్కువవుతున్నాయో గుర్తించి, వాటికి దూరంగా ఉండటం మంచిది. పాల పదార్థాలను తగ్గిస్తే చాలామందిలో విరేచనాలు, కడుపునొప్పి, కడుపుబ్బరం వంటి ఇబ్బందులు తగ్గుతున్నట్టు తేలింది. చిన్నపేగులో వాపు, పూత గలవారికి కొవ్వులు జీర్ణం కాకుండానే పెద్దపేగులోకి చేరుకుంటాయి. ఇది విరేచనాలు తీవ్రం కావటానికి దోహదం చేయొచ్చు. కాబట్టి కొవ్వు పదార్థాలను మితంగా తీసుకోవటం మంచిది.