header

Chrone Diseases / క్రోన్స్ డిసీజ్ (పూత పేగులు

Chrone Diseases / క్రోన్స్ డిసీజ్ (పూత పేగులు

Dr. Sednthil Rajappa, Medical Ancolologist, Basavatarakam Hospital, Hyderabad డా.సెంధిల్ రాజప్ప, గారి సౌజన్యంతో... మెడికల్ అంకాలజిస్ట్, బసవతారకం హాస్పటల్, హైదారాబాద్
కండ పుష్టికి బలవర్ధకమైన ఆహారం ఎంత ముఖ్యమో.. దాన్ని శరీరం ఒంట బట్టించుకోవటమూ అంతే ముఖ్యం. మనం తిన్న ఆహారంలోని పోషకాలను గ్రహించే చిన్నపేగు.. మిగిలిపోయిన వ్యర్థాలను బయటకు పంపించే పెద్దపేగు..
ఇలా జీర్ణకోశంలోని అన్ని భాగాలూ సక్రమంగా పనిచేస్తేనే ఇది సాధ్యం. వీటి పనితీరులో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా మొత్తం జీర్ణవ్యవస్థే కుదేలైపోతుంది. పేగుల్లో తలెత్తే పూత, వాపు సమస్య (క్రోన్స్ డిసీజ్) కూడా ఇలాంటిదే. ఇది ఒక పట్టాన పోయేది కాదు. ఎందుకొస్తుందో తెలియదు. ఎవరికొస్తుందో తెలియదు. కానీ ఒకసారి మొదలైందంటే దీర్ఘకాలం వేధిస్తుంది. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, విరేచనాల వంటి వాటితో పలు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఆకలి మందగించటం వల్ల తిండి సరిగా తినక.. తిన్నా పోషకాలు సరిగా ఒంట బట్టక చాలామంది చిక్కి శల్యమవుతుంటారు. పైగా ఇది ఒక్క పేగులకే పరిమితమయ్యేదీ కాదు. కళ్లు, కీళ్ల వంటి ఇతర భాగాల్లోనూ చిక్కులు తెచ్చిపెడుతుంది. దీంతో మరో చిక్కేటంటే.. ఇది పేగు గోడను కూడా దాటుకొని వచ్చి, ఇతర భాగాల్లోకి కొత్త మార్గాలనూ ఏర్పరచుకోవటం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమనుకునే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలోనూ ఎక్కువగానే కనబడుతుండటం మరింత కలవర పెడుతోంది. అందుకే దీనిపై సమగ్ర వివరాలను అందిస్తోంది ఈవారం సుఖీభవ!
అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు.. ఇలా వివిధ భాగాలుగా భావిస్తుంటాం గానీ నోటి నుంచి మలద్వారం వరకూ జీర్ణవ్యవస్థ మొత్తం ఒకటే గొట్టం అనుకోవచ్చు. మనం నోటితో నమిలి మింగిన ఆహారం.. అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. జీర్ణాశయం దాన్ని జీర్ణరసాలతో కలిపేసి బాగా చిలుకుతుంది. అలా జావలా మారిన ఆహారం 60-90 నిమిషాల్లో చిన్నపేగులోకి ప్రవేశిస్తుంది. చిన్నపేగు ఆహారంలోని పోషకాలను గ్రహించి రక్తంలోకి చేరవేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సేపు జరుగుతుంది. అనంతరం పోషకాలు పోగా మిగిలిపోయిన గుజ్జులాంటి పదార్థం పెద్దపేగులోకి వెళ్తుంది. పెద్దపేగు దీనిలోని నీటిని గ్రహించి, వ్యర్థాలను వేరుచేసి, దాన్ని మలరూపంలో బయటకు విసర్జింపజేస్తుంది. ఇంతటి కీలకమైన చిన్న, పెద్ద పేగులకు ఇప్పుడు వాపు, పూత, పుండ్ల సమస్య (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్స్- ఐబీడీ) పెద్ద శత్రువుగా పరిణమిస్తోంది. ఐబీడీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ జబ్బులు.
చాలామంది ఇవి రెండూ ఒకటేనని అనుకుంటుంటారు గానీ వేర్వేరు సమస్యలు. అల్సరేటివ్ కొలైటిస్ పెద్దపేగుకే పరిమితమవుతుంది. ఇది పేగులో వాపు, పూతతో పాటు పుండ్లతోనూ వేధిస్తుంది. కానీ క్రోన్స్.. నోటి నుంచి మలద్వారం వరకూ జీర్ణకోశ వ్యవస్థలో ఎక్కడైనా తలెత్తొచ్చు. దీని పూత ఒకదగ్గర కాకుండా చాలాచోట్ల ముద్దలు ముద్దలుగా కనబడుతుంది. సుమారు 50% మందిలో చిన్నపేగు, పెద్దపేగు కలుసుకునే చోటే ఇది తలెత్తుతుంటుంది.
అటు జన్యువులు.. ఇటు పర్యావరణం!
క్రోన్స్ ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. జన్యుపరమైన అంశాలు, మనం తినే ఆహారం, చుట్టుపక్కల పరిసరాలు, పర్యావరణం, పేగుల్లోని బ్యాక్టీరియా వంటి రకరకాల అంశాలు దీనికి దోహదం చేయొచ్చు. ముఖ్యంగా జన్యుపరంగా క్రోన్స్ వచ్చే అవకాశం గలవారికి ఆహారం, పర్యావరణం వంటి అంశాలు కూడా తోడైతే ముప్పు మరింత ఎక్కువవుతుంది. మన రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా లేదా వైరస్ల మీదే కాకుండా.. పొరపాటున పేగుల గోడల్లోని కణాలపై దాడి చేయటం కూడా దీనికి దారితీయొచ్చు. బాల్యంలో యాంటీబయోటిక్స్ మందుల వాడకం.. ఆహారంలో పీచు తగ్గటం, సంతృప్త కొవ్వులు అధికంగా తీసుకోవటం మూలంగానూ క్రోన్స్ ముప్పు పెరగొచ్చు. పేగుల్లో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినటం కూడా దీనికి దారితీయొచ్చు.
క్రోన్స్ బారినపడ్డ మూడొంతుల మంది పేగుల్లో ఇ-కొలి బ్యాక్టీరియా పెద్దమొత్తంలో కనబడుతుంటుంది. ఈ బ్యాక్టీరియా జిగురుపొరను ఛేదించుకొని వెళ్లి, పేగుల లోపలి గోడల కణాల్లో స్థిరపడుతుంది. వాపు ప్రక్రియను ప్రేరేపించే కారకాలు ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. గతంలో క్రోన్స్ జబ్బును పాశ్చాత్యదేశాల సమస్యగానే చూసేవారు. ఇప్పుడు మనదేశంలోనూ ఎక్కువగానే కనబడుతోంది. రోజురోజుకీ పట్టణీకరణ పెరుగుతుండటం, పాశ్చాత్య ఆహార అలవాట్ల వంటివి దీనికి దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు.
మిగతా భాగం తరువాత పేజీలో...