header

Diabetic – Dental Problems ……డయాబెటిక్ వలన పళ్ళవ్యాధులు

డా. ఎం. రవిశేఖర్‌ అసిస్టెంట్ ప్రోఫెసర్‌, ఓరల్‌ హెల్త్‌ సైన్సెస్‌, నిమ్స్‌.
మన దంతంలో ఒక ఎముక! మన శరీరంలోని ఏ ఎముక కూడా బయటకి కనిపించదు. దంతం ఒక్కటే బయటకు కనిపిస్తుంది. అదీ మూడింట ఒక వంతు మాత్రమే. దంత మూలం రూపంలో రెండు వంతుల భాగం లోపలే... చిగురు లోపలి దవడ ఎముకలో ఉంటుంది. పంటికీ, దాని చుట్టూ ఉండే దవడ ఎముకకూ మధ్య సన్నని ఖాళీ ఉంటుంది. దీన్నే 'పెరియోడాంటల్‌ స్పేస్‌' అంటారు. ఇందులో ఉండే సన్నని లిగమెంట్ల వంటివన్నీ పంటికి కుషన్లలా ఉపయోగపడతాయి. ఈ ఖాళీలోకి సూక్ష్మక్రిములు చేరి... అవకాశం చిక్కినపుడు ఉన్నట్టుండి మనకు చిగుళ్ల సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. పిల్లల్లో ఆర్నెల్ల వయసులో పళ్లు రావటం మొదలవుతుంది. అప్పట్నుంచే దాని చుట్టూ సూక్ష్మక్రిములు చేరటం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచీ ఇవి అవకాశం చిక్కినప్పుడల్లా ఇన్ఫెక్షన్లు తెచ్చిపెట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టే వీటిని ఒకరకంగా 'ఆపర్చునిస్టిక్‌ ఇన్ఫెక్షన్లు' అంటారు.
పాచితో ప్రారంభం!
మనం తిన్న ఆహారం దంతాల మీద పల్చని పొరలా 'పాచి' రూపంలో పేరుకుంటుంది. అందుకే మనం 24 గంటల్లో రెండుసార్లైనా బ్రషింగ్‌ చేసుకుని దీన్ని తొలగించుకోవాలి. లేకపోతే ఈ పాచి నోటిలోపల ఉండే లాలాజలంలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్‌ వంటి వాటితో కలిసి గట్టిపడి పడి పంటి చుట్టూరా గారలా పేరుకుపోతుంది. ఇది హాని కారక సూక్ష్మక్రిములు వృద్ధి చెందానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. దీంతో చిగుళ్లకు చికాకు మొదలవుతుంది. అలాగే మనం పళ్లు తోముకునేటప్పుడో, గట్టిగా ఉండే పదార్థాలు తింటున్నప్పుడో చిగుళ్లకు చిన్న చిన్న గాయాలవుతుంటాయి. ఇవి కూడా సూక్ష్మక్రిములకు ఆస్కారం కల్పిస్తాయి. పంటికీ, చిగురుకూ మధ్య ఈ గార, సూక్ష్మక్రిములు చేరటంతో చిగుళ్లు ఎర్రగా వాచిపోయి.. వాటి నుంచి తరచూ రక్తం కారటం వంటి లక్షణాలు మొదలవుతాయి. దీన్నే 'జింజివైటిస్‌' అంటారు. చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా తొలిదశలో నొప్పి వంటి బాధలేమీ ఉండవు. చాలామందిలో ఇది వస్తూ పోతుంటుంది. క్రమం తప్పకుండా పళ్లను శుభ్రం చేసుకుంటూ ఉంటే దీంతో పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చుగానీ... నోటిశుభ్రత లోపించటం, మధుమేహం నియంత్రణలో లేకపోవటం వంటి సందర్భాల్లో ఈ సూక్ష్మక్రిములు, ఇన్ఫెక్షన్‌ చిగురు లోపలికి దాని నుంచి పంటి మూలంలోకి చేరి ఎముకను కూడా దెబ్బతీయటం ఆరంభిస్తాయి.
ఆ క్రిములు ఉత్పత్తిచేసే విషతుల్యాలు చిగుళ్ల రక్షణ పొరను ఛేదించి ఎముకకు వ్యాపిస్తాయి. ఆ ఎముకలో తిరిగి సూక్ష్మక్రిములు తమ సంతతిని వృద్ధి చేస్తాయి. ఈ లోపలి భాగాన్ని మనం ఇంటర్ డెంటల్ బ్రష్‌తో శుభ్రం చేసుకోలేం కాబట్టి నోటి దుర్వాసన, పంటి కింది ఎముక కూడా క్షీణిస్తూ దంతాలు కదిలిపోయే పరిస్థితి వస్తుంది.
ఇలా పంటి ఎముక 65 శాతం వరకు దెబ్బతిన్నా పన్ను పైకి బాగానే కనిపిస్తుంది. గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే లోపల గట్టిపడిన గార (క్యాలిక్యులస్‌) కూడా గట్టిగాగా ఉంటుంది. ఇది ఎముకనూ పంటిని పట్టుకొని ఉండటం వల్ల లోపల పన్ను క్షీణించిన విషయం పైకి ఏమీ తెలియదు. అయితే పన్ను క్షీణిస్తున్నకొద్దీ చిగురు కిందికి జారిపోతుంటుంది. పైకి తేలిన పంటి గార పట్టుకొని కనిపిస్తుంది. ఇది సాధారణంగా కనిపించే చిగుళ్ల జబ్బు (పెరియోడాంటల్‌ డిసీజ్‌). మధుమేహ బాధితులందరికీ ఈ చిగుళ్ల జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణ ఆరోగ్యవంతుల్లో 45 ఏళ్లకు చిగుళ్ల జబ్బు వస్తుందనుకుంటే.. మధుమేహుల్లో ఇది 35 ఏళ్లకే రావొచ్చు.
చిగురు, దంతం చూసి అనుమానించొచ్చు
మధుమేహం నియంత్రణలో లేకపోతే చిగుళ్ల జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి చిగుళ్లను చూసి... వాటిని బట్టి మధుమేహం వచ్చిందేమోననీ అనుమానించే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం 25-35 ఏళ్ల వారిలోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఆహారాన్ని నమలానికి మనకు రెండు వైపులా పైన, కింద మూడేసి నమిలే దంతాలు (మోలార్‌ టీత్‌) ఉపయోగపడతాయి. తొలి మోలార్‌ పన్ను ఆరేళ్ల వయసులో పుట్టుకొస్తుంది. మొనదేరి ఉండే దీనిపై భాగం 25 ఏళ్ల వయసువారిలో అరిగిపోయి నునుపుగా కనిపిస్తే టైప్‌-2 మధుమేహం ఉందేమోనని అనుమానించటం అవసరం. దీనికి చిగుళ్ల వాపు, నొప్పి, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌ కూడా తోడైతే మరింత బలంగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే చిగుళ్లవాపు ఉన్న అందరిలోనూ మధుమేహం ఉండాలనేం లేదు.
స్థూలంగా - చిన్న వయసులో నమిలే దంతం గణనీయంగా అరిగిపోయి లోపలి డెంటిన్‌ బయటపడటం.. తీవ్రమైన జింజివైటిస్‌తో పాటు తరచుగా చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుండటం.. దీనికి వయసు, బరువు, కుటుంబ నేపథ్యం కూడా తోడైతే మధుమేహం ఉండొచ్చని తప్పకుండా అనుమానించాల్సిందే.
చిగురుకు చికిత్స ?
చిగుళ్ల నుంచి కేవలం రక్తం కారుతుండే తొలి దశ (జింజివైటిస్‌)లో చికిత్స తేలిక. అవసరాన్ని బట్టి వైద్యులు స్కేలింగ్‌ వంటివి చేసి గార తొలగిస్తారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్‌ చిగుళ్ల కిందికి వెళ్లి ఎముకకు పడుతుంది. అప్పుడు రూట్ క్లీనింగ్‌, చిగుళ్లను వలిచి శుభ్రం చేసి మళ్లీ కుట్టే 'ఫ్లాప్‌ సర్జరీ', ఎముక కూడా దెబ్బతింటే 'బోన్‌ గ్రాఫ్టింగ్‌' వంటివీ చెయ్యాల్సి వస్తుంది.
పెరియోడాంటల్‌ వ్యాధి మూలంగా దంతాలు కదిలిపోతుంటే వాటిని తీసేసి కట్టుడుపళ్లు అమర్చటం మంచిది. దంతాలు సరిగా లేకపోతే ఆహారాన్ని నమిలితినటం కష్టం. దీనివల్ల మధుమేహుల్లో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.
దంతాలు తియ్యాల్సి వస్తే....
మధుమేహుల్లో పన్ను తొలగించాల్సిన పరిస్థితి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం అదుపులో ఉన్నప్పుడే పన్ను తియ్యాలి. అదీ ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్స్‌ ఇచ్చాకే పన్ను తొలగిస్తారు.
ప్రస్తుతం మధుమేహం, హైబీపీ, ఊబకాయం వంటి సమస్యలున్న వారికి నిత్యం తక్కువడోసు ఆస్పిరిన్‌ వేసుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. ఇది రక్తాన్ని పలుచగా ఉంచుతుంది. కాబట్టి వీరికి దంతాలు తొలగించాల్సి వస్తే ముందు ఆస్పిరిన్‌ ఆపించి... ఒకి రెండు రోజుల తర్వాత దంతాన్ని తొలగిస్తారు. లేకపోతే దంతాన్ని తీసిన చోటనుంచి రక్తస్రావం ఆగక చాలా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిత్యం ఎకోస్ప్రిన్‌ వంటి తక్కువడోసు ఆస్పిరిన్‌ మాత్రలు వేసుకునేవారు ఆ విషయాన్ని తప్పనిసరిగా దంత వైద్యులకు చెప్పాలి.
మధుమేహం - దంత సమస్యలు
మధుమేహానికీ, దంత సమస్యలకూ మధ్య సంబంధం విడదీయలేనిది. మధుమేహం నియంత్రణలో లేకపోతే చిగుళ్ల వ్యాధుల్లాంటి దంత సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువ. అలాగే చిగుళ్లకు ఇన్ఫెక్షన్ల వంటివి పెరిగితే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరిగిపోయి మధుమేహం నియంత్రణ తప్పే అవకాశమూ ఉందని పరిశోధనా రంగం స్పష్టంగా గుర్తించింది. అందుకే మధుమేహులంతా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు దంత సమస్యలు... ముఖ్యంగా చిగుళ్ల వ్యాధుల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి!
దంత బంధం
మధుమేహం, చిగుళ్ల వ్యాధి... వీటి మధ్య అవినాభావ సంబంధం ఉంది.
1. మధుమేహుల్లో సూక్ష్మ రక్తనాళాలు పూడుకుపోయి రక్తం ప్రసరించే మార్గం సన్నగా అవుతుంది. దీంతో రక్త ప్రసరణ తగ్గుతుంది. ముఖ్యంగా కాళ్లు, కళ్లతో పాటు చిగుళ్లలో దీని ప్రభావం ఎక్కువ. చిగుళ్లకు రక్త ప్రసరణ సరిగా జరగకపోతే వాటికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. అప్పటికే పంటి చుట్టూ చేరిన ఇన్‌ఫెక్షన్‌ మరింత వేగంగా ముదురుతుంది.
2. చిగుళ్ల వ్యాధి మూలంగా కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనాలన్నీ గుర్తిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి ఈ చిగుళ్ల వ్యాధి ముదిరిందంటే ఇక్కడి సూక్ష్మక్రిములు విడుదల చేసే విషతుల్యాలు శరీరంలో కలుస్తాయి. అవి క్లోమంలోని బీటా కణాలపై ప్రభావం చూపిస్తాయని, దాని ప్రభావం ఇన్సులిన్‌ ఉత్పత్తి మీదా ఉంటుందని, అంతిమంగా ఇది మధుమేహానికి కూడా కారణం అవుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పరిశోధకులు జరుగుతున్నాయి.
3. మధుమేహుల్లో చిగుళ్ల వ్యాధి మూలంగా రక్తంలో గ్లూకోజు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. వీరికి చిగుళ్ల వ్యాధి తగ్గేలా చికిత్స చేస్తే... గ్లూకోజు స్థాయిలు తగ్గి మధుమేహం తిరిగి అదుపులోకి తేవచ్చు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉన్న వారిలో చికిత్స ద్వారా నోటి శుభ్రతను మెరుగుపరిస్తే.. 30 శాతం వరకు గ్లూకోజు స్థాయులు తగ్గుతున్నట్టు రుజువైంది. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
4. మధుమేహుల్లో మ్యూకొరనైటిస్ వంటి ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. దీని మూలంగా దవడ ఎముక పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. దీంతో దాన్ని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి మధుమేహాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవటం చాలా చాలా అవసరం.
చిగుళ్లు.. గుండె.. మధుమేహం
చిగుళ్ల వ్యాధులకూ, గుండె జబ్బులకూ మధ్య ప్రత్యేక సంబంధం ఉందని వైద్య పరిశోధనా రంగం ఇప్పుడు స్పష్టంగా గుర్తించింది. 'ఇన్ఫెక్టివ్‌ ఎండోకార్డిస్‌' వంటి సమస్యలు ఇలా వచ్చేవే. అలాగే చిగుళ్ల వ్యాధులకూ... మధుమేహానికీ, మరి కొన్ని రకాల రక్త సమస్యలకూ కూడా సంబంధం ఉందన్న వాస్తవం ఇప్పుడిప్పుడే అవగాహనలోకి వస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు, లేని వారు కూడా సాధ్యమైనంత వరకూ చిగుళ్ల వ్యాధులు రాకుండా చూసుకోవటం, వస్తే వెంటనే చికిత్స చేయించుకోవటం తప్పనిసరి.
ఏం చెయ్యాలి ? మధుమేహం ఉన్నట్టు బయటపడినా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నిపుణులతో దంతాలను శుభ్రం చేయించుకోవటం తప్పనిసరి. మధుమేహులైతే ఆర్నెల్లకు ఓసారి శుభ్రం చేయించుకోవాలి.
పళ్లపై గార ఏర్పడి అది గట్టిగా, పేళ్లుపేళ్లుగా (కాలిక్యులస్‌) అవుతుంది. చిగుళ్ల వ్యాధికి మూలం ఇది. ఈ స్థితి రాకుండా ఎప్పటి కప్పుడు దంతాలను శుభ్రం చేసుకుంటే ఈ వ్యాధులు దరి జేరవు.
రోజుకి రెండుసార్లు.. ముఖ్యంగా రాత్రిపూట కూడా బ్రష్‌తో పళ్లు తోముకోవటం, నాలుక అంగిలి కూడా శుభ్రం చేసుకోవటం తప్పనిసరి.
వయసు పెరుగుతున్నకొద్దీ పళ్ల మధ్య సందులు ఏర్పడుతుంటాయి. వీటిల్లో ఆహార పదార్థాలు పేరుకుపోకుండా, పాచి పట్టకుండా చూసేందుకు 'ఇంటర్‌ డెంటల్‌ బ్రష్‌'లు వాడుకోవటం ఉత్తమం.
నిత్యం పండ్లు తోముకోగానే ఒక్కసారి వేలితో చిగుళ్లను మర్దన చేసుకోవాలి.
చక్కని ఆహారపుటలవాట్లు ముఖ్యం. ఆహారం తీసుకోగానే నీటితో నోరు శుభ్రం చేసుకోవటం, పండ్లు, పీచు, ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది.
మద్యం, పొగ, పాన్‌లు, గుట్కాలు నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
మధుమేహం, హైబీపీ, మూర్ఛ వంటి సమస్యలకు వాడే కొన్ని మందులు కూడా చిగుళ్ల వాపు వంటి సమస్యలకు కారణమవుతాయి కాబట్టి అనుమానం వస్తే వాటి గురించి వైద్యులతో చర్చించాలి.