మధుమేహల ప్రాణాను రక్షించే ఇన్సులిన్ ఉపయోగాలు
డాక్టర్ అశ్వినీకుమార్, ఫ్రొఫెసర్ ఆఫ్ మెడిసన్, ఆశ్రం మెడికల్ కాలేజ్, ఏలూరు.
మన శరీరం సజావుగా పనిచేయటాని కావల్సిన శక్తి గ్లూకోజ్ నుండి లభిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి రక్తంద్వారా శరీరంలోని కణాన్నిలటికి సరఫరా అవుతుంది. అప్పుడే శరీరం శక్తిని పుంజుకొని, జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. అయితే రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు చక్కగా వినియోగించుకోవాంటే ఇన్సులిన్ అనే హార్మోన్ తప్పనిసరి. దీనిని మన శరీరంలోని క్లోమ గ్రంధి (పాంక్రియాస్) ఉత్పత్తి చేస్తుంది. కాని కొందరిలో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాదు. ఉత్పత్తి అయినా శరీరం దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోదు. దీని మూలంగా రక్తంలోని గ్లూకోజ్ కణాలను చేరలేక రక్తంలోని ఉండిపోతుంది. ఇలా గ్లూకోజ్ వినియోగం కాకుండా, అధికస్ధాయిలో రక్తంలో ఉండిపోవటాన్నే మధుమేహం అంటారు. రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు సమర్థంగా వినియోగించుకోవాంటే తగినంత ఇన్సులిన్ ఉండాలి. ఒకరకంగా దీన్ని కణాలకు తాళంచెవి అనవచ్చు. ఇది వెళ్ళి కణం తలుపు తీస్తేనే అందులోకి గ్లూకోజ్ వెళుతుంది. లేకుంటే రక్తంలో స్థాయి పెరిగిపోతుంది.
తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానివారికి, మందులతో మధుమేహం నియంత్రణ కాని వారికి ఇన్సులిన్ ఇవ్వటం తప్పనిసరి. ఇన్సులిన్ అనగానే అదేదో పెద్ద భూతంలాగా భయపడిపోతుంటారు. అవసరమైనప్పుడు తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవాలి.
అపోహలు : ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్లు మొదలు పెడితే జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందని ఎంతోమంది భయపడతారు. నిజానికి ఇన్సులిన్ జీవితాంతం కాదు. జీవితం అంతం కాకుండా తీసుకోవాలి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇన్సులిన్ అనగానే మధుమేహం బాగా ముదిరిపోయిందని, మరణానికి చేరువయ్యామని మరి కొందరు భయపడుతుంటారు కాని ఇది నిజం కాదు. రెండు మూత్రపిండాలు చెడిపోతేనే ఇన్సులిన్ ఇస్తారని కొంతమంది అపోహపడుతుంటారు. ఇలాంటి అపోహలతో పాటు ఇంజెక్షన్ తీసుకోవటానికి భయపడేవారు ఇంకొందరు. ఇంట్లో ఇంజెక్షన్ ఇచ్చే వారుండరనీ ప్రతిసారీ అసుపత్రికి వెళ్లటం ఇబ్బందని భావిస్తుంటారు.
ఇన్సులిన్ ఎవరికి ఇవ్వాలి : మధుమేహంలో రెండురకాలున్నాయి. టైప్-1 మరియు టైప్-2.
టైప్-1 చిన్నపిల్లలలో ఎక్కువగా కపబడుతుంది. వీరిలో చాలామందికి ఇన్సులిన్ ఇవ్వక తప్పదు. ఎందుకంటే వీరిలో ఇన్సులిన్ తయారు కాదు. ఇక టైప్ 2 వారికి ఇన్సులిన్ కొద్దిమోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నా శరీరం దాన్ని సరిగా వినియోగించుకోదేదు అందువల్ల ఇలాంటి అత్యవసర పరిస్థితులో బయటనుండి ఇన్సులిన్ తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. ఆడవాళ్ళు గర్భం ధరించినప్పుడు వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్‌లోనూ ఇన్సులిన్ తప్పక తీసుకోవాలి.
పెద్దవారికి ఎప్పుడు అవసరం అవుతుంది? మాత్రలతో గ్లూకోజు అదుపులోకి రానప్పుడు, మాత్రలు సరిపడక పోయినప్పుడు, కిడ్నీ, లివర్ జబ్బు గలవారికి ఏవైనా ఆపరేషన్లు చేయుంచుకోవాల్సినపుడు, రక్తంలో గ్లూకోజు మోతాదు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆహార నియమాలతో, వ్యాయామంతో, మందులతో కూడా గ్లూకోజు మోతాదు తగ్గనపుడు.
ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి : ప్రస్తుతం ఇన్సులిన్ పెన్స్ మరియు చిన్న సూదులు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎవరికి వారు తామే సొంతంగా ఇన్సులిన్ తీసుకోవచ్చు. పొట్టమీద బొడ్డుకు అంగుళం దూరంలో ఇంజక్షన్ తీసుకోవాలి. అలాగే తొడ వెలుపలి, మధ్య భాగాల్లోనూ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇన్సులిన్ ఎప్పుడూ ఇంజెక్షన్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. సూది ఎప్పుడూ నిలువుగా 90 డిగ్రీ కోణంలో ఉండాలి. ముందు చర్మం కిందికి మాత్రమే (టిష్యూ సబ్‌క్యుటేనియస్) వెళ్ళాలి. లోతుగా చేసుకోకూడదు. అందువల్ల ఇంజెక్షన్ చేసే భాగాన్ని బొటనవేలు, చూపుడు వేళ్లతో పట్టుకొని కాస్త పైకిలాగి ఇంజెక్షన్ చేయాలి. ఇన్సులిన్ సీసాను మూత తీసి వాడటం మోదలు పెట్టాక 28రోజుల పాటు అదే మందు పనిచేస్తుంది. దీన్ని ఎండతగల కుండా, వెలుతురు పడని ప్రదేశాలలో జాగ్రత్తచేయాలి. ఫ్రిజ్ ఉంటే లోపల పెట్టవచ్చు. అంతేకాని ఫ్రిజ్ తప్పని సరికాదు.
ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది : ఇన్సులిన్ మన శరీరంలోని ప్రతి జీవకణంలోకి గ్లూకోజ్ వెళ్లేలా చేస్తుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. రక్తంలోని కొంత గ్లూకోజ్ ను గ్లైకోజన్ రూపంలో మార్చి నిల్వ చేస్తుంది. అవసరమైన సమయాల్లో జ్వరం వచ్చి లంఖణాలు చేసినపుడు, ఉపవాసం చేసినపుడు ఈ గ్లైకోజిన్ తిరిగి గ్లూకోజ్ గా మారి శరీరానికి ఉపయోగపడుతుంది. కొవ్వు, ప్రోటీన్లను మన శరీరం సరిగా వినియోగించుకునేలా చేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఇన్సులిన్ మోతాదు ఎక్కువైనా, ఆహారం తక్కువగా తీసుకున్నా ఇన్సులిన్ తీసుకొని ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువగా వ్యాయామం చేసినా రక్తంలో గ్లూకోజ్ స్థాయి వేగంగా తగ్గిపోవటం (హైపోగ్లెసీమియా) వస్తుంది.
హైపో గ్లెసిమీయా లక్షణాలు : చమటలు ఎక్కువగా పట్టటం., గుండె దడగా ఉండటం, చూపు తగ్గినట్లు బూజర బూజరగా ఉండటం, మనసులో ఆందోళన, కంగారు కలగటం శరీరం నిస్సత్తువగా ఉండటం, ఒకోసారి చేయి, కాలు చచ్చుబడిపోవటం. ఇలాంటి లక్షణాలు కనపడితే వెంటనే రెండు చెంచాల గ్లూకోజు గానీ పంచదార కానీ తినిపించాలి. మరీ అవసరమైతే డాక్టరుగారు సెలైన్ ద్వారా గ్లూకోజు ఇస్తారు. అత్యవసరంగా గ్లూకోగాన్ 1 ఎం.జి ఇంజెక్షన్ కూడా ఇస్తారు.