header

Dialysis…..డయాలిసిస్‌

Dialysis…..డయాలిసిస్‌

Dr.K.V. Dakshina Murthy
Nefralagist, Sriramachandra Centenary Memorial Hospital, Vijay Nagar Colony, Hyderabad
డయాలిసిస్‌ కిడ్నీలు విఫలమైనవారి పాలిట సంజీవని!!
కిడ్నీలు మహా గట్టి పిండాలు. చూడటానికి పిడికెడంతే ఉంటాయి గానీ ఇవి చేసే పనులు ఎన్నెన్నో. మూత్రపిండాలు నిర్వర్తించే అతి ముఖ్యమైన పని రక్తాన్ని శుద్ధిచేసి.. అందులోని వ్యర్థాలను, విషతుల్యాలను వేరు చేసి.. మూత్రం రూపంలో బయటకు పంపించటం. ఇదొక్కటే కాదు.. విటమిన్‌ డిని ప్రేరేపితం చేస్తూ ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికీ, ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్‌, రక్తకణాలు తయారుకావటానికీ కిడ్నీలు తోడ్పడతాయి. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు స్థిరంగా ఉండటానికీ దోహదం చేస్తాయి.
మన కిడ్నీలు రోజుకు సుమారు 400 సార్లు రక్తాన్ని వడపోస్తాయి! ఒకో మూత్రపిండంలో ఉండే దాదాపు 10 లక్షల వడపోత విభాగాలు (నెఫ్రాన్లు) నిరంతరం ఈ పనిలోనే మునిగి ఉంటాయి. ఇవి రోజుకి సుమారు 150 లీటర్ల రక్తాన్ని జల్లెడ పడుతూ సుమారు 2 లీటర్ల మూత్రాన్ని తయారుచేస్తాయి. పోషకాలను కణాలు వినియోగించుకున్న తర్వాత వెలువడే వ్యర్థాలు, విషతుల్యాలన్నీ ఇలా తయారైన మూత్రం ద్వారానే బయటకు వెళ్లిపోతాయి. అందుకే కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. వాటి వడపోత ప్రక్రియ దెబ్బతిని ఒళ్లంతా వ్యర్థాలు, ద్రవాలు పేరుకుపోవటం ఆరంభిస్తాయి. కిడ్నీ వైఫల్యంతో తలెత్తే పెద్ద ముప్పు ఇదే. పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరికి ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుంది. కిడ్నీ వైఫల్యానికి మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాల కిడ్నీజబ్బు, కిడ్నీలో రాళ్ల మూలంగా తరచుగా ఇన్‌ఫెక్షన్లు రావటం, పుట్టుకతోనే కిడ్నీల్లో నీటితిత్తుల వంటివన్నీ దారితీయొచ్చు. కిడ్నీలు విఫలమైనప్పుడు డయాలిసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. కిడ్నీ మార్పిడికి వెంటనే దాతలు దొరక్కపోవచ్చు. ఒకవేళ దొరికినా కొందరికి మార్పిడి చేయటం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే డయాలసిస్‌ వరదాయినిలా ఆదుకుంటోంది.
డయాలిసిస్‌ ఎవరికి?
కిడ్నీలు రెండూ చెడిపోయి.. అవి ప్రాణాలను నిలబెట్టలేని స్థితికి చేరుకున్నప్పుడు డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. కిడ్నీలు విఫలమైనవారిలో ఆకలి మందగించటం, వికారం, వాంతులు, కాళ్లవాపు, ఆయాసం, ఒళ్లంతా దురదల వంటి లక్షణాలు కనబడతాయి. కొందరికి మగత, ఫిట్స్ వంటివీ ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వేధిస్తున్నాయంటే డయాలిసిస్‌ అవసరముందనే అర్థం. కిడ్నీ వడపోత సామర్థ్యాన్ని సూచించే జీఎఫ్‌ఆర్‌ (గ్లోమరులో ఫిల్టరేషన్‌ రేట్‌) 15 కన్నా తక్కువుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే అప్రమత్తం కాకపోతే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. డయాలిసిస్‌లో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి.
1. పెరిటోనియల్‌ డయాలిసిస్‌. ఇది పొట్ట కుహరంలోకి నేరుగా ద్రవాన్ని పంపించి రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. పొట్ట కుహరంలోని కేశనాళికల్లో ప్రవహించే రక్తంలోని వ్యర్థాలన్నీ బయటి నుంచి పంపించిన ద్రవంలోకి చేరుకుంటాయి. తర్వాత ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. దీంతో రక్తంలోని వ్యర్థాలు తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది.
2. హిమో డయాలిసిస్‌. రక్తాన్ని బయటకు తీసి.. యంత్రం ద్వారా శుద్ధి చేసి.. తిరిగి ఒంట్లోకి పంపించటం దీని ప్రత్యేకత. డయాలసిస్‌ యంత్రంలోని వడపోత విభాగం(డయలైజర్‌)లో వెంట్రుకంత సన్నటి గొట్టాలుంటాయి. రక్తనాళం నుంచి బయటకు వచ్చిన రక్తం ప్రవహించేది వీటిల్లోంచే. అతి పలుచటి పొరతో కూడిన ఈ గొట్టాల చుట్టూరా నీటితో పాటు నిర్ణీత ప్రమాణాల్లో క్యాల్షియం, సోడియం, పొటాషియం, బైకార్బొనేట్‌ వంటి లవణాలను కలిపిన ప్రత్యేకమైన ద్రవం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో రక్తంలోని వ్యర్థాలన్నీ ద్రవంలోకి చేరుకుంటాయి. వ్యర్థాలతో కూడిన ఈ ద్రవం బయటకు వస్తుంటే.. కొత్త ద్రవం లోపలికి వెళ్తుంది. తర్వాత శుద్ధి అయిన రక్తం తిరిగి ఒంట్లోకి చేరుకుంటుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తుంటుంది.
ముందు నుంచే సన్నద్ధత ముఖ్యం
కిడ్నీ వైఫల్యం బారినపడ్డవారిని నిరంతరం ఒక కంట కనిపెట్టటం చాలా కీలకం. ఎందుకంటే వడపోత సామర్థ్యం తగ్గుతూ వస్తుంటే ముందు నుంచే డయాలిసిస్‌కు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. డయాలసిస్‌ పరికరంలోని పంప్‌ నిమిషానికి సుమారు 300-400 మిల్లీలీటర్ల రక్తాన్ని ఒంట్లోంచి బయటకు తీసుకొచ్చి, తిరిగి లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఈ వేగాన్ని మామూలు సిర తట్టుకోలేదు. కాబట్టి దాన్ని ముందుగానే బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చిన్నపాటి సర్జరీతో సిరను సమీపంలోని ధమనికి కలుపుతారు (ఆర్టీరియోవీనస్‌ ఫిస్ట్యులా). దీంతో ధమనిలోని ఒత్తిడికి సిర పెద్దగా, మందంగా తయారవుతుంది. క్రమంగా రక్తప్రవాహాన్ని తట్టుకునే స్థాయికి చేరుకుంటుంది. ఇందుకు 3-6 నెలల సమయం పడుతుంది. కాబట్టి డయాలసిస్‌ ఆరంభించటానికి ముందే సిరను సన్నద్ధం చేసి పెట్టుకోవటం మంచిది. అప్పుడే మెరుగైన ఫలితం కనబడుతుంది. ఎవరికైనా అత్యవసరంగా డయాలసిస్‌ చేయాల్సి వస్తే మెడలో లేదా కాళ్లలోని ప్రధాన సిరలోకి గొట్టాన్ని పంపించి.. దాని ద్వారా రక్తశుద్ధి చేస్తారు. ఆర్టీరియోవీనస్‌ ఫిస్ట్యులా సిద్ధం అయ్యేంతవరకూ తాత్కాలికంగా వీటినే ఉపయోగించుకుంటారు. గమనించాల్సి విషయం ఏంటంటే- నేరుగా డయాలసిస్‌కు వెళ్లినవారితో పోలిస్తే 6 నెలల ముందు నుంచే నెఫ్రాలజిస్టు పర్యవేక్షణలో ఉన్నవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. తాత్కాలిక డయాలిసిస్‌ ఏర్పాట్ల కంటే కూడా ఆర్టీరియోవీనస్‌ ఫిస్ట్యులాతోనే మెరుగైన ఫలితం కనబడుతోంది. ఇన్‌ఫెక్షన్ల ముప్పూ తగ్గుతోంది. అంతేకాదు.. హిమోగ్లోబిన్‌ మోతాదులు తక్కువగా ఉన్నవారితో పోలిస్తే దీన్ని తగు మోతాదులో (11-13 మధ్యలో) ఉంచుకున్నవారు మరింత ఎక్కువ కాలం జీవిస్తున్నారు కూడా. అందువల్ల పరిస్థితి పూర్తిగా దిగజారకముందే.. అంటే జీఎఫ్‌ఆర్‌ రేటు 15-30 మధ్యలో ఉన్నప్పుడే జాగ్రత్త పడటం ఎంతో మంచిది.
వారానికి కనీసం మూడు సార్లు డయాలిసిస్‌ ఎంత ముఖ్యమో.. అవసరమైనంత మేరకు చేయటమూ అంతే ముఖ్యం. వారానికి 3 సార్లు డయాలసిస్‌ చేయటం ఉత్తమం. ఒకోసారి కనీసం 4-5 గంటల చొప్పున డయాలిసిస్‌ చేయాలి. ఇలా శరీర ఆకారాన్ని బట్టి వారం మొత్తమ్మీద దాదాపు 12-15 గంటల సేపు రక్తాన్ని శుద్ధి చేస్తేనే మంచి ఫలితం కనబడుతుంది. అంతకన్నా తక్కువసేపు డయాలిసిస్‌ చేస్తే మోతాదు సరిపోదు. రక్తశుద్ధి సరిగా జరగదు. కొందరు డయాలసిస్‌ త్వరగా ముగించాలని అడుగుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అలా చేస్తే మనకు మనం హాని కోరి తెచ్చుకుంటున్నట్టే. ఎందుకంటే అవసరమైనంత మేరకు రక్తం శుద్ధి కాకపోతే సమస్యలు ఎక్కువయ్యే అవకాశముంది. రక్తంలో యూరియా మోతాదు పెరుగుతుంది. ఆకలి మందగిస్తుంది. సరిగా తినకపోవటం వల్ల శరీరం శక్తి కోసం కండరాలను వినియోగించుకుంటుంది. ఇది కండర క్షీణతకు దారితీస్తుంది.
కిడ్నీ వైఫల్యం గలవారికి సహజంగానే గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. డయాలిసిస్‌ సరిగా చేయకపోతే వీటి ముప్పు మరింతగా పెరుగుతుంది. పోషణలోపం మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ మొదలై రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, గుండెజబ్బులు, పక్షవాతం వంటివి ముంచుకురావొచ్చు. ఫలితంగా మరణం ముప్పూ పెరుగుతుంది. కాబట్టి అవసరమైనంత మేరకు డయాలిసిస్‌ చేయటం తప్పనిసరనే సంగతిని గుర్తించాలి.
తగినంత డయాలిసిస్‌ చేయించుకుంటున్నా.. అంటే వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నా కూడా కిడ్నీలు చేసే పనిలో పదో వంతు మాత్రమే ఇది నిర్వర్తిస్తుంది. దాన్ని కూడా సరిగా చేయించుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని గుర్తించటం అవసరం. నెఫ్రాలజిస్టుల పర్యవేక్షణలోనే..
ఇప్పుడు మనదగ్గర డయాలిసిస్‌ కేంద్రాలు చాలానే ఉన్నాయి. కానీ వీటిల్లో చాలా చోట్ల నెఫ్రాలజిస్టులు అందుబాటులో ఉండటం లేదు. వైద్యపరిజ్ఞానం అంతగా లేని టెక్నీషియన్స్‌తోనే నడిపించేస్తున్నారు. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే డయాలిసిస్‌ చేయించుకునేవారిని నిరంతరం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. కిడ్నీలు ఎంతవరకు పనిచేస్తున్నాయి? డయలైజర్‌ నుంచి రక్తం ఎంత వేగంతో వెళ్తోంది? ఎంత సమయం పడుతోంది? ఒంట్లో నీటి పరిమాణం ఎంతుంది? డయాలసిస్‌ ముగిశాక ఎంత యూరియా తగ్గుతోంది? డయాలిసిస్‌కు డయాలిసిస్‌కు మధ్యలో శరీరంలో ఎంత నీరు పోగుపడింది? ఎంత బరువు పెరిగారు? అనే దాన్ని బట్టి ఎవరికి ఎంతసేపు డయాలిసిస్‌ అవసరమన్నది చూడాల్సి ఉంటుంది. దీన్ని ప్రతి నెలా చూసుకుంటూ డయాలిసిస్‌ ఎంతసేపు అవసరమన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి కిడ్నీలు పనిచేయవు కాబట్టి ఐరన్‌ తగ్గిపోయి రక్తహీనత వస్తుంది. రక్తం ఉత్పత్తి కూడా పడిపోతుంది. రక్తపోటు అదుపులో ఉండదు. మూత్రంలో సుద్ద (ప్రోటీన్‌) పోతుంటుంది. పోషణ లోపం తలెత్తుతుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌ జీవక్రియల్లో లోపాలు తలెత్తటం వల్ల ఎముకలు బలహీనపడి ఒళ్లునొప్పులు, కాళ్లనొప్పులు రావొచ్చు. అందువల్ల రక్తంలో యూరియా, క్రియాటినైన్‌, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, కొవ్వుల మోతాదులతో పాటు కాలేయ సామర్థ్యాన్ని కూడా క్రమం తప్పకుండా పరీక్షించాల్సి ఉంటుంది. రక్తంలో అల్బుమిన్‌ స్థాయులు కనీసం 4 గ్రాముల కన్నా ఎక్కువుండేలా చూసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాల్సిన అవసరముంది కాబట్టి డయాలిసిస్‌ కేంద్రాలను నెఫ్రాలజిస్టుల పర్యవేక్షణలోనే నిర్వహించటం తప్పనిసరి.
- డయాలిసిస్‌ ద్రవంలో వాడే నీటి నాణ్యత సరిగా లేకపోయినా సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి డయాలిసిస్‌ పరికరానికి నీటిని సరఫరా చేసే వాటర్‌ ఫిల్టర్‌ ప్రక్రియ సరిగా జరుగుతుందా? లేదా? డయాలసిస్‌ పరికరం సమర్థంగా పనిచేస్తుందా? లేదా? అనేది ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అప్పుడే సరైన చికిత్స అందుతుంది.
అనుక్షణం అప్రమత్తం
డయాలిసిస్‌ను ఒకరకంగా ‘కృత్రిమ కిడ్నీ’ అని అనుకోవచ్చు. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. అందువల్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండటం అవసరం. డయాలిసిస్‌ చేయించుకునే సమయంలో ఆహారం, నీరు దగ్గర్నుంచి.. శారీరక శ్రమ వరకూ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సమతులాహారం: డయాలిసిస్‌ చేయించుకునేవారు ఆహారం విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా కిడ్నీ వైఫల్యం గలవారు ప్రోటీన్‌ తక్కువగా తీసుకోవాలి. కానీ డయాలసిస్‌ మొదలయ్యాక మాత్రం ప్రోటీన్‌ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. డయాలసిస్‌ చేసే సమయంలో ఆకలి మెరుగవుతుంది. కండరాలు తిరిగి పుంజుకోవటం మొదలవుతుంది. అంతేకాదు.. డయాలసిస్‌ ప్రక్రియలోనూ కొంత ప్రోటీన్‌ పోతుంటుంది. కాబట్టి ప్రోటీన్‌ ఇంకాస్త తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పప్పులు, సోయాబీన్స్‌, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారులైతే మాంసం, చికెన్‌, చేపలు, గుడ్లు తినొచ్చు. అయితే మాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది కాబట్టి కాస్త పరిమితంగానే తీసుకోవటం మంచిది. ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి ఉప్పు విషయంలో పరిమితి పాటించాలి.
నీరు మితంగా: డయాలిసిస్‌కూ డయాలిసిస్‌కూ మధ్యలో ఒంట్లో నీరు పోగుపడుతుంటుంది. నీరు ఎక్కువగా పోగుపడితే గుండె మీద భారం పడుతుంది. ఆయాసం వస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుంటుంది. కాబట్టి నీరు మితంగానే తాగాలి. అనవసరంగా తాగటం తగదు. నీరు ఎక్కువగా తాగితే డయాలసిస్‌ చేసేటప్పుడు ఒంట్లోంచి మరింత ఎక్కువ నీరు తీయాల్సిన అవసరమూ ఉంటుంది. నీటితో పాటు ఎలక్ట్రోలైట్లూ పోతాయి కాబట్టి పిక్కలు, కండరాలు పట్టేయటం వంటి ఇబ్బందులూ తలెత్తుతాయి. అందువల్ల నీటి విషయంలో జాగ్రత్త అవసరం.
తగు వ్యాయామం: డయాలిసిస్‌ చేయించుకుంటున్నాం కదా అని చాలామంది అలాగే పడుకుంటుంటారు, కూచుండిపోతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వీరికి శారీరక శ్రమ ఎంతో అవసరం. రోజూ నడవాలి, వ్యాయామాలు చేయాలి, వాళ్ల పనులు వాళ్లు చేసుకోవాలి. బరువులు ఎత్తాల్సిన అవసరం లేని ఏరోబిక్‌ రకం వ్యాయామాలు చేసుకోవచ్చు. ఉద్యోగాలు, పనులు చేసుకోవటం ఉత్తమం. నిజానికి డయాలసిస్‌ ఉద్దేశం కూడా హాయిగా జీవిస్తూ.. ఎవరి పనులు వాళ్లు చేసుకునేలా, ఎవరి చదువులు వాళ్లు చదువుకునేలా చూడటమే.
ప్రయాణాల్లో జాగ్రత్త: డయాలిసిస్‌ చేయించుకుంటున్నా కూడా అందరిలా ప్రయాణాలు చేయొచ్చు. అయితే సమయానికి డయాలిసిస్‌ చేయించుకోవటం మరవరాదు. దూరప్రాంతాలకు వెళ్లినపుడు డయాలిసిస్‌ కేంద్రాల సమాచారాన్ని తెలుసుకోవాలి. ముందుగానే అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి.
టీకాలు, మందులు: కిడ్నీలు పనిచేయకపోవటం వల్ల రోగనిరోధశక్తి తగ్గి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. కాబట్టి ముందుగానే ఫ్లూ, న్యుమోనియా, హెపటైటిస్‌ బి టీకాలు తీసుకోవాలి. దీంతో జబ్బుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. హైబీపీ, మధుమేహం వంటి సమస్యలు గలవారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. రక్తపోటు, గ్లూకోజు కచ్చితంగా అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఏవైనా ఇన్‌ఫెక్షన్లు వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. అప్పుడు కూడా డయాలసిస్‌ చేయించుకోవటం మానరాదు.
- కిడ్నీలు చేసే అన్ని పనులనూ డయాలసిస్‌ చేయలేదు. ఇది చేయలేని పనులను మందుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. విటమిన్‌ డి, క్యాల్షియం, ఐరన్‌తో పాటు ఫాస్పేట్‌ నియంత్రణలో ఉండటానికి మందులు.. ఎరిత్రోపాయిటిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవాలి.
- డయాలిసిస్‌ చేయించుకునేవారికి గుండెజబ్బుల ముప్పు ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు గుండె వైద్యులనూ సంప్రతించాలి. వీరిలో మరణాలకు గుండెజబ్బులు కూడా కారణమవుతుండటం గమనార్హం.