header

Dog Bite…..కుక్క కరిస్తే వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Dog Bite…..కుక్క కరిస్తే వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డా.యన్‌. పాపారావు, సీనియర్‌ ఫిజీషియన్‌. యశోదా హాస్పిటల్‌, హైదరాబాద్‌.
కుక్క కాటుకంటే దాని పట్ల నిర్లక్షమే ఎక్కువ ప్రమాదకరమైనది. తప్పుడు సలహాలు విని ఇలా చేస్తే సరిపోతుందని అనుకోవద్దు. డాక్టర్ల మాట వినండి. చెప్పుడు మాటల జోలికి మాత్రం పోవద్దు.
ప్రపంచంలో ఏటా లక్షలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. దాంతో 60 నుంచి70 వేల మంది వరకు రేబిస్‌ కారణంగా మృతి చెందుతున్నారు. మృతుల సంఖ్యలో సగానికి పైగా భారత్‌లోనే. ప్రతి కుక్కలోనూ రేబిస్‌ వైరస్‌ ఉండదు. కానీ అది ఉన్న కుక్క ఏదో తెలియదు.కాబట్టి ప్రతి కుక్క కాటునూ సీరియస్‌ గానే పరిగణించాలి.
శరీరంలో వ్యాధికారక క్రిములు చేరాక వ్యాధి బయటపడే వ్యవధి సాధారణంగా నాలుగు నుంచి ఐదు రోజులు ఉండవచ్చు. అయతే కుక్క ఎక్కడ కరిచింది, గాయం ఎంత లోతుగా అయ్యింది, శరీరంలో ఏ ప్రాంతంలో కరిచింది, దుస్తులపై నుంచి కరిచిందా లేక నేరుగా కరిచిందా కరిచినపుడు ఏ మేరకు వైరస్‌ శరీరంలో ప్రవేశించింది లాంటి అనేక అంశాలుపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంది. కాటు తర్వాత వైరస్‌ శరీరంలోని కండరాల్లోకి వెళ్ళి, అక్కడ అభివృద్ధి చెంది నరాల్లోకి ప్రవేశిస్తుంది. నరాల్లోంచి మొదడుకు పాకుతుంది. అక్కడి నుంచి కణాల సముదాయంలోకి, కండరాల్లోకి, ఎముకల్లోకి, గ్రంథుల్లోకి వెళ్ళి లాలాజలంలో ప్రవేశిస్తుంది.
నిర్థారణ ప్రక్రియ : కుక్క కరిచిన విషయం తెలుస్తుంది కాబట్టి దీనికి ప్రత్యేక పరీక్షలు అక్కర్లేదు. అయితే స్కిన్‌ బయాప్సీ లేదా లాలాజలం సేకరించి ఈ వైరస్‌ను నిర్థారణ చేయవచ్చు.
నివారణ : రేబిస్‌కు స్పష్టమైన చికిత్సలేదు. అయితే కుక్క కాటుకు గురైన సందర్భాల్లో రేబిస్‌ నివారణకు ఇచ్చే వ్యాక్సిన్‌ వల్ల ప్రాణం తప్పక నిలబడుతుంది. కాబట్టి ఈ వ్యాధి నివారణలో వ్యాక్సిన్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా కుక్క కాటు తర్వాత పదిరోజుల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. కరచిన పది రోజుల్లోపుగా కుక్క చనిపోతే దానికి వైరస్‌ ఉందని భావించి తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఒకవేళ కుక్క కరచినా కుక్క లేదా వీధి కుక్కను అలా గమనించే వీల్లేకపోతే రేబిస్‌ నివారణకోసం వ్యాక్సిన్‌ తీసుకోవాలి. తీవ్రతను బట్టి గాయాలను మూడుగా వర్గీకరించవచ్చు.
కేటగిరి 1 : పుండ్లు, గాయం, లేని చోట కుక్క నాకడం లేదా రక్తం రాకుండా గీరడం వల్ల రేబిస్‌ అవకాశాలు చాలా తక్కువ.
కేటగిరి 2: ఒకవేళ గాయం లేదా పుండు ఉన్నచోట కుక్క నాకితే లేదా రక్తం వచ్చేలా కుక్క గాయపరిస్తే, కాళ్ళ మీద కుక్క గీరితే దాని కేటగిరి రెండు అనుకోవచ్చు. దీనిలో రేబిస్‌ వ్యాధి వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ.
కేటగిరి 3 : మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ళ మీద కుక్క కరిచినా, దానివల్ల పెద్ద గాయం అయినా లేదా ఒకేచోట ఐదు కంటే ఎక్కువ గాయాలైనా మూడో కేటగిరిగా పరిగణించాలి. ఇందులో రేబిస్‌ వ్యాధి అవకాశాలు చాలా ఎక్కువ.
వ్యాక్సిన్‌తో వ్యాధి నివారణను కూడా అనేక రకాలుగా వర్గీకరించవచ్చు : అడవుల్లో సంచరించే వారు, అడవి జంతువులు కరవడానికి అవకాశం ఉన్నవారు ముందుగానే వ్యాక్సిన్‌ తీసుకుంటే దాన్ని ఫ్రీ ఎక్స్‌పోజర్‌ ప్రొఫిలాక్సిస్‌ అంటారు. ఇక జంతువు కరిచాక తీసుకునే వ్యాక్సిన్‌ను పోస్ట్‌ ఎక్స్‌పోజర్‌ వ్యాక్సిన్‌గా పరిగణించవచ్చు.
మరలా ఇందులో రెండురకాలు. మామూలుగా వ్యాధి నిరోధకతను కల్పించే సీరమ్‌ ఇంజక్షన్‌ తీసుకోవడాన్ని ప్యాసివ్‌ ఇమ్యునైజేషన్‌గా పేర్కొంటారు. సీరమ్‌ ఇంజక్షన్స్‌ కాకుండా సాధారణ వ్యాక్సిన్‌లను తీసుకోవడాన్ని యాక్టివ్‌ ఇమ్యునైజేషన్‌గా చెబుతారు.
ఈ వ్యాక్సిన్‌లో మళ్ళీ అనేక రకాలు ఉంటాయి. నెర్వస్‌ టిష్యూ వ్యాక్సిన్‌, బాతు లేదా కోడి ఎంబ్రియో నుంచి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌, సెల్‌కల్చర్‌ వ్యాక్సిన్‌. గతంలో నర్వస్‌ టిష్యూ వ్వాక్సిన్‌ను బొడ్డు చుట్టూ ఇచ్చేవారు. దీనివల్ల కాంప్లికేషన్స్‌ ఎక్కువగా ఉండేవి. ఇటీవవల అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ వల్ల కాంప్లికేషన్స్‌ తక్కువ.
రేబిస్‌ లక్షణాలు : తలనొప్పి, ఒళ్ళు నొప్పులు,గొంతునొప్పి, సాధారణ జ్వరంతోనే లక్షణాలు మొదలవుతాయి. కుక్క కరచిన చోట నొప్పి పెరుగుతుంది. ఈ మామూలు లక్షణాలు తర్వాత వైరస్‌ మొదడును తీవ్రమైన ఉద్వేగాలకు లోనయ్యేలా చేస్తుంది. దాంతో రోగులు గాలికీ భయపడతారు. దీన్ని ఏరోఫోబియా అంటారు, నీళ్లను చూసినా వణికిపోతారు. ఈ కండిషన్‌ను హైడ్రోఫోబియా అంటారు. గొంతులోని కండరాలు బిగుసుకు పోతాయి.
రేబిస్‌ వైరస్‌ సోకిన జంతువులన్నింటికీ ఈ వ్యాధి వచ్చినా హైడ్రోఫోబియా అనే కండిషన్‌ మాత్రం కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుంది.
రేబిస్‌కు చికిత్స : ఒకసారి రేబిస్‌ సోకిన తర్వాత మందులేమీ ఉండవు. అయితే రోగిని ప్రశాంతంగా ఉంచానికి ఎక్కువ వెలుతురు, గాలి తగిలినా, శబ్ధాలు వినిపించినా రోగికి ఫిట్స్ వచ్చే అవకాశాలతో బాటు, తీవ్రమైన వత్తిడికి లోనవుతాడు కాబ్టి అలాంటి సందర్భాలలో మార్పిన్‌ వంటి మందులు ఇస్తారు. కండరాలు కుంచించుకు పోతుంటే మజిల్‌ రిలాక్స్‌ వంటివి ఇచ్చి కృత్రిమ శ్వాస కల్పిస్తారు.
కుక్కకాటు గాయానికి : కుక్కకాటువలన అయ్యే గాయానికి చికిత్స చేసే విషయంలోనూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. సాధారణంగా గాయమైన చోట అవసరాన్ని బట్టి కుట్లు వేయడం మామూలే. అయితే కుక్కకాటు వల్ల అయిన గాయానికి కుట్లు వేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ముందుగా అక్కడ యాంటీ రేబిస్‌ సీరమ్‌ ఇచ్చాక మాత్రమే కుట్లు వేయాల్సి ఉంటుంది.
కుక్క కాటుకి గురైతే ఆందోళన పడకుండా మొదటగా గాయాన్ని శుభ్రంగా ధారగా పడే నీటీతో (రన్నింగ్‌ వాటర్‌తో) కడగాలి. ఎంత ఎక్కువగా కడిగితే అంతగా వ్యాధిని నివారించవచ్చు. తరువాత అయోడిన్‌ వంటి ద్రావణం (సొల్యూషన్‌)తో కడగాలి దాంతో రోగకారక వైరస్‌ నాశనం అవుతుంది. అయితే కేటగిరీని బట్టి చికిత్స తీసుకోవాలి.
మొదటి కేటగిరి : ఎలాంటి చికిత్స అవసరం లేదు. కరచిన కుక్క పదిరోజుల పాటు ఆరోగ్యంగా ఉంటే కాటుకు గురైన వాళ్లకు ఏ ప్రమాదం జరగక పోవచ్చు. కాని డాక్టర్‌కు చూపించడం మంచిది.
రెండో కేటగిరి : మొదట గాయాన్ని ధారగా పడే నీటితో కడగాలి. టి.టి ఇంజక్షన్‌ చేయించాలి. గాయానికి తగిన చికిత్స చేయాలి. ఐదు డోసుల యాంటీ రేబిస్‌ షెడ్యూలు పాటించాలి.
మూడో కేటగిరి : ధారగా పడే నీటితో కడిగి, అయోడిన్‌ సొల్యూషన్‌తో శుభ్రం చేసిన తరువాత యాంటీ రేబీస్‌ షెడ్యూల్‌ను ఇవ్యాలి. దాంతోపాటు ఇమ్యునో గ్లోబ్యులిన్‌ అనే సీరమ్‌ను మూడింట రెండువంతుల డోస్‌లో గాయం ఉన్నచోట, మూడింట ఒక వంతు కండరాల్లోకి ఇవ్వాలి. సీరమ్‌తో చేయాల్సిన చికిత్సను కుక్క కాటుకు గురైన ఏడు రోజుల లోపే ఇవ్వాలి. ఒకవేళ అంతకంటే ఆలస్యం అయితే ఆ సీరమ్‌తో ఎలాంటి ఉపయోగం ఉండదు.