header

Cochlear Implant ……… కాక్లియర్‌ ఇంప్లాంట్‌

చెవిటి, మూగ అవస్థ నుంచి విముక్తి కల్పించే అద్భుత పరిజ్ఞానం కాక్లియర్‌ ఇంప్లాంట్‌
డాక్టర్‌ యన్‌. విష్ణువర్ధన్‌, ఈ ఎన్‌ టి సర్జన్‌, కేర్‌ హాస్పటల్‌ హైదరాబాద్‌
భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్షమందికి పైగా పిల్లలు వినికిడి లోపంతో పుట్టుతున్నారు. సకాలంలో గుర్తించకపోవటం వలన వీరిలో చాలామంది చెవిటి మూగవారిగా మిగిలి పోతున్నారు.
సంవాహకలోపం (కండక్టివ్‌ డెఫ్‌నెస్‌) :.చెవి నిర్మాణంలో బాహ్య, మధ్య, అంతర చెవి నిర్మాణాలలో ఎక్కడ సమస్య వచ్చినా వినికిడిలోపం రావచ్చు. ఉదా: బయటి, మధ్య చెవిలో సమస్యలుంటే దానివల్ల శబ్ధ తరంగాలు అసలు లోపలికి వెళ్ళవు. దీంతో వినికిడి ఉండదు. ఈ రకం వినికిడి లోపాన్ని సంవాహకలోపం (కండక్టివ్‌ డెఫ్‌నెస్‌) అంటారు. ఈ సంవాహక వినికిడి లోపాన్ని చాలా వరకూ ఆపరేషన్‌లో సరిచేయవచ్చు. కొందరికి పుట్టుకతోనే బయటి చెవి లేకపోవటం, చెవి రంధ్రమార్గం ఏర్పడకపోవటం వంటి సమస్యలుంటాయి. వీటిని సర్జరీతో చక్కదిద్దవచ్చు. అలాగే కర్ణభేరి, మధ్య చెవిలోని మూడు చిన్న ఎముకల్లో లోపాలున్నా వాటిని తిరిగి ఏర్పరచవచ్చు.
సెన్సోరిన్యూరల్‌ డెఫ్‌నెస్‌ లేదా నెర్వ్‌ డెఫ్‌నెస్‌ : లోపలి చెవిలో ఉండే కాక్లియాలో లోపాలుండటం లేదా కాక్లియా నుంచి మొదడుకు వెళ్లే శ్రవణనాడి సరిగా లేకపోటం వలన అది సన్నడిపోవటం తదితర కారణాల వలన కూడా వినికిడి లోపం రావచ్చు దీన్నే సెన్సోకిన్యూరల్‌ డెఫ్‌నెస్‌ లేదా నెర్వ్‌ డెఫ్‌నెస్‌ అంటారు. ఈ లోపాలు క్లిష్టమైనవి. ఇవి చికిత్సలకు లొంగవు. లోపం ఓ మోస్తరుగా ఉంటే సాధారణ శ్రవణ యంత్రాలు పెట్టి వినబడేలా చెయ్యవచ్చు.
వినికిడి లోపం మరీ తీవ్రంగా ఉన్నవారికి సాధారణ శ్రవణ యంత్రాలతో ఫలితం లేకున్నా ఒకప్పుడు ఇటువంటి మార్గం ఉండేది కాదు. ఇప్పుడు వీరికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అద్భుతంగా పనికివస్తుంది. ఒక రకంగా దీని తీవ్రమైన వినికిడి లోపం ఉన్నవారికి గొప్ప వరంగా చెప్పవచ్చు.
తీవ్రమైన వినికిడి లోపం అంటే : మన వినికిడి సామర్ధ్యాన్ని డెసిబెల్స్‌ లో లెక్కిస్తారు. ప్యూర్‌ టోన్‌ ఆడియో మెట్రీ పరీక్షలో వినికిడి సామర్థ్యం 20 డెసిబెల్స్‌ గానీ, అంతకన్నా తక్కువగానీ ఉంటే వినికిడి మామూలుగా ఉన్న్టా 25-30 మధ్య ఉన్నదా పెద్దగా వినికిడి సమస్యలుండవు. 30 డెసిబెల్స్‌ మించి పోతే మాత్రం దాన్ని పట్టించుకోక తప్పదు. 30-40 మధ్య ఉంటే దాన్ని ఓ మోస్తరు వినికిడి లోపంగా,50-60 మధ్య ఉంటే మధ్యస్ధ వినికిడి లోపంగా, 70-80 మధ్య ఉంటే తీవ్రమైన లోపంగా, 90కి పైగా ఉంటే మరింత తీవ్రమైన లోపంగా (ప్రొఫౌండ్‌ హియరింగ్‌ లాస్‌) గా వర్గీకరిస్తారు. 30 డెసిబెల్స్‌ నుండి 70-75 డెసిబెల్స్‌ వరకూ ఉంటే తీవ్రతను బట్టి సర్జరీగానీ, వినికిడి సాధనాలు గానీ అవసరమవుతాయి. 70-75 డెసిబెల్స్‌ వరకూ కూడా శ్రవణ యంత్రాలు పనికొస్తాయి. అంతకు మించితే మాత్రం పిల్లలకైనా, పెద్దలకైనా కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ ఒక్కటే మార్గం.
పరీక్షలు: నాలుగేళ్లు దాటిని పిల్లలకు పెద్దలకు ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ పరీక్షద్వారా వినికిడి ఏ స్థాయిలో ఉన్నదీ నిర్ధారిస్తారు. దీంతో పాటు మధ్య చెవి లోపలి పరిస్థితి తెలుసుకునేందుకు ఇంపిడియన్స్‌ అగిమెట్రో, కాక్లియా ఎలా ఉందో తెలుసుకోవటానికి ఆటో అకూస్టిక్‌ ఎమిషన్‌ పరీక్షలు చేస్తారు. బ్రెయిన్‌ స్టెమ్‌ ఎవోక్‌డ్‌ రెస్సాన్స్‌ ఆడియో మెట్రీ (బెరా) అనే మరో పరీక్ష ద్వారా వినికిడి లోపం ఏ స్ధాయిలో ఉంది? రెండు చెవుల్లో ఉందా అనేవి తెలుస్తాయి.
ఆడిటరీ స్టడీ స్టేట్‌ రెస్పాన్స్‌ (ఏ ఎస్‌ ఎస్‌ ఆర్‌) పరీక్ష కూడా చేస్తారు. చెవి ఎముక తీరుతెన్నును గుర్తించటానికి, మొదడులో ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటానికి సిటీస్కాన్‌, ఎం ఆర్‌ ఐ పరీక్షలు చేయవలసి వస్తుంది.
ఎదుగుదల ఆలస్యం కావటం, సెరిబ్రల్‌ పాల్సీ, ఆటిజమ్‌ వంటి సమస్యు గల పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందువల్ల చిన్నపిల్లలకు ఇంప్లాంట్‌ అమర్చే ముందు వారి మానసిక స్ధితిని కూడా అంచనా వేస్తారు.
సర్జరీ విధానం: కాక్లియర్‌ ఇంప్లాంట్‌లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సర్జరీ ద్వారా చెవి వెనకా ఎముకలో అమర్చే భాగం. రెండోది చెవి వెనకా పైనుంచి చర్మంపైనే పెట్టుకునే భాగం. సర్జరీ సమయంలో చెవి వెనుకా చిన్నకోతపెట్టి, ఎముకలో కొద్దిగా ఖాళీచేసి, రిసీవర్‌/స్టిమ్యులేటర్‌ భాగాన్ని అమరుస్తారు. దీనికి కొన్ని ఎలక్ర్రోడ్‌ తీగలుంటాయి. ఈ తీగను లోపలినుంచే కర్ణభేరి కిందుగా పోనిచ్చి, అంతర్‌ చెవిలో ఉండే కాక్లియాలోకి ప్రవేశపెడతారు. ఈ భాగం మొత్తం శాశ్వతంగా లోపలే ఉండిపోతుంది. ఈ సమయంలో ఆడియాలజిస్టు ఎలక్ట్రోడు సరిగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకొంటారు. దీంతో సర్జరీ పూర్తవుతుంది. సర్జరీకి 2 నుండి 4 గంటల సమయం పట్టవచ్చు. సాధారణంగా పెద్ద మత్తు ఇచ్చి చేస్తారు. పెద్దల్లో ఆ ప్రాంతంలోనే (లోకల్‌) మత్తు ఇచ్చి కూడా చెయ్యవచ్చు. ఈ సర్జరీతో సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకటి రెండు రోజుల్లోనే ఇంటికి పంపేస్తారు. గాయం మానిన తర్వాత అప్పుడు బయటి యూనిట్‌కు పంపుతారు.
సర్జరీ తరువాత : 3 వారాలకు చర్మం పైనుంచి స్పీచ్‌ ప్రాసెసర్‌ను అనుసంధానం చేసి, కంప్యూటర్‌ సహాయంతో వివిధ శబ్ధస్థాయిను శ్రుతిచేస్తారు. దీన్ని మ్యాపింగ్‌ అంటారు. ఇందులో శబ్ధాల తీవ్రత మరీ అధికంగా గానీ తక్కువగానీ లేకుండా క్రమేపీ వినికిడి అలవాటు పడేలా సామర్ధ్యం మెరుగయ్యేలా చేస్తారు. నిజానికి ఇంప్లాంట్‌ సాయంతో మనం వినికిడి పునరుద్దరించవచ్చు గానీ మాట్లాడే ప్రక్రియను మాత్రం ప్రత్యేకంగా నేర్పించాల్సిందే. దీనిని ఆడిటరీ వెర్బల్‌ థెరపీ అంటారు. ఇప్పటికే మాట్లాడటం వచ్చిన వారికి 2-3 నెలలకు శిక్షణ సరిపోతుంది. ఇంకా మాటలు రాని పిల్లలకు మాత్రం 2-3 ఏళ్ళు పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వినబడిన మాటను గ్రహించి తిరిగి మాట్లాడేలా చెయ్యటం, ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యం. దీనికోసం ఆడిటరీ వెర్బల్‌ ధెరపిస్టు కృషిచేస్తారు. పసిపిల్లలకు ఈ సర్జరీని ఎంత త్వరగా చెయ్యగలిగితే ఫలితాలు అంత బాగుంటాయి. శిక్షణకు తల్లి దండ్రుల భాగస్వామ్యం కూడా తోడవటం ముఖ్యం. దానివల్ల ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
కాక్లియా లేనివారికి : కాక్లియా సరిగా ఏర్పడనివారికి నాడులు లేనివారికి ఈ ఇంప్లాంట్‌ పనికిరాదు. ఇలాంటి వారికి ఆడిటరీ బ్రెయిన్‌ స్టెమ్‌ ఇంప్లాంట్‌ అమర్చటం మినహా మరోమార్గం లేదు. ఇందులో ఎలక్ట్రోడును నేరుగా మెదడు కింది భాగంలోనే అమరుస్తారు. ఇది చాలా కష్టమైన శస్త్రచికిత్స.
ఎవరికి ఇంప్లాంట్స్‌ :
తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన బిడ్డకు ఏడాదిలోపే ఈ సర్జరీ చేస్తే ఇంప్లాంట్‌ అమర్చటం ఉత్తమం. మూడేళ్ల లోపు అమర్చే బిడ్డతో పోలిస్తే ఏడాదిలోనే అమర్చిన బిడ్డకు మాటు వచ్చే ప్రక్రియ మెరుగ్గా ఉంటునట్లు గుర్తించారు.
మాట వచ్చిన తర్వాత పిల్లలు గానీ, పెద్దలు గానీ ఏ కారణంతో తీవ్రస్థాయి వినికి లోపం బారిన పడినా వారికి ఇంప్లాంట్‌తో ఎంతో ప్రయోజనం ఉంటుంది.
తీవ్రస్ధాయి చెవుడుతో బాధపడుతూ, శ్రవణ యంత్రాలతో ఎటువంటి ఉపయోగం లేని వృద్ధులకు కూడా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఎంతో ప్రయోజనం.
తీవ్రస్ధాయి లోపం ఒక చెవిలో ఉన్నవారికి కూడా దీనితో ఫలితం ఉంటుంది.
చెవుడుతో పాటు చెవిలో నిరంతరాయంగా గుయ్యిమనే ధ్వనితో తీవ్రంగా బాధపడుతున్న బాధలకు కూడా కాక్లియర్‌ ఇంప్లాంట్‌తో ప్రయోజనం ఉంటునట్లు గుర్తించారు.
వినికిడి లోపాలు ఎందుకు వస్తాయి :
పిల్లలలో : పిల్లలకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉండటం ఒకరకం. దీని ప్రీ లింగ్వల్‌ డెఫ్‌నెస్‌ అంటారు. కొందరికి మాటు వచ్చిన తర్వాత మొదడు పొరల్లో వాపు (మెనింజైటిస్‌) వంటి సమస్య మూలంగా చెవుడు రావొచ్చు. దీన్ని పోస్ట్‌ లింగ్వల్‌ డెఫ్‌నెస్‌ అంటారు. పెద్దవారిలో కనబడేది ఈ లోపమే
చెవి నిర్మాణంలో అత్యంత కీలకమైనది కాక్లియా. దీనికి సంబంధించిన లోపాలు సాధారణంగా శిశువు గర్భంలో ఏర్పడుతున్నప్పుడే వస్తాయి. గర్భిణికి రూబెల్లా, సైటో మోగాలే వంటి వైరస్‌ ఇఫెక్షన్లు సోకితే పిండంపై ఇటువంటి ప్రభావాలు చూపుతాయి. రుబెల్లా ఇన్‌ఫెక్షన్‌ వలన తల్లికి చర్మంపై దద్దు, జ్వరం వంటివే వస్తాయి గానీ పుట్టబోయే ప్లిల్లలలో చెవుడు వంటి తీవ్ర సమస్యకు దారితీయవచ్చు.
గర్భిణలు కొన్ని రకాల యాంటిబయోటిక్స్‌ తీసుకుంటే పిల్లలలో వినికిడి లోపం రావచ్చు.
నెలల నిండక ముందే పుట్టే పిల్లలకూ వినికిడి లోపం ఉండవచ్చు.
పుట్టిన తరువాత 48 గంటల కన్నా ఎక్కువ కాలం ఐ సి యూలో ఉంచిన పిల్లలకు వినికిడి లోపం తలెత్తవచ్చు ఈ సమయంలో యాంటీబయోటిక్స్‌ మందులు ఎక్కువ మోతాదుల్లో వాడటం, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉండటం వంటివి దీనికి కారణమవుతాయి.
పుట్టిన తొలినాళ్ళలో తీవ్రమైన కామెర్లు (కర్నిక్టరస్‌) వచ్చిన వారికీ వినికిడి లోపం రావొచ్చు.
ఆటలమ్మ (చికెన్‌ఫాక్స్‌, మీజిల్స్‌) ఇసుక అమ్మేవారు, గవదబిళ్ళు(మంప్స్‌) మెదడు పొరవాపు (మెనింజైటిస్‌) వంటి సమస్యలు పిల్లలలో వినికిడి లోపానికి ప్రధాన కారణంగా వినిపిస్తున్నాయి. మెదడు పొరల్లో వాపు మూలంగా కాక్లియాలో క్యాల్షియం పేరుకుని గట్టిపడి (అసిఫికేషన్‌) పెద్ద అవరోధంగా తయారవుతుంది. ఇలా ఒకటి లేదా రెండు చెవుల్లోనూ జరగవచ్చు. (ఇటువంటి వారికి వీలైనంత త్వరగా, కనీసం 3 నెలలలోపే ఇంప్లాంట్‌ సర్జరీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత క్యాల్షియం గట్టిపడిపోయి ఎలక్ట్రోడ్‌ తీగను చెవిలోపకి ప్రవేశపెట్టడం కూడా సాధ్యంకాదు)
జన్యుపరమైన లోపాలు కారణంగా కుటుంబంలో ఎవరికైనా చెవుడున్నా పిల్లలకు వచ్చే అవకాశముంటుంది.
ముఖ్యంగా మేనరిక వివాహాలు వినికిడి లోపాలకు కారణమవుతున్నాయి. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అవసరమవుతున్న ప్రతి పదిమంది పిల్లలలో 8-9 మంది మేనరికం దంపతులకు పుట్టినవారే కావటం తీవ్రతను తెలుపుతుంది.
పెద్దలలో వినికిడి లోపాలకు కారణాలు :
పెద్దలలో వయసుతో పాటు వచ్చే వినికిడి లోపం మరీ అంత తీవ్రతగా ఉండదు. వీరికి మంద్రస్వరాలు (లోటోన్స్‌) వినికిడి బాగానే ఉంటుంది. గానీ ఉచ్ఛస్వరాల్లో (హైటోన్స్‌) లోపం కనబడుతుంది.
పెద్దల్లో వినికిడి లోపానికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, తలకు దెబ్బతగటం, మధుమేహం వంటివి ప్రధానకారణాలు, మధుమేహంలో హఠాత్తుగా నాడీ సంబంధ వినికిడి లోపం తలెత్తవచ్చు కొందరికి సమస్య తీవ్రంగానే ఉండకపోవచ్చు.
క్యానోమైసిన్‌, అమికాసిన్‌ వంటి అమైనోగ్లైకోజ్డ్‌ రకం యాంటీబయోటిక్‌ మందులను 10 రోజుకు మించి వాడితే వినికిడి లోపం రావచ్చు. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులను (డైయూరిటిక్స్‌) దీర్ఘకాలం వాడితే చెవుడుకు దారితీయవచ్చు. ఇలాంటి వారిలో వినికిడిలోపం తీవ్రంగా, అతి తీవ్రంగా ఉండి మామూలు శ్రవణ యంత్రాలు ఉపయోగం లేకపోతే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చాల్సి ఉంటుంది.
సహజమైన వినికిడి : మనం వినటమన్నది చాలా అప్రయత్నంగా జరిగిపోతుంది గానీ, వాస్తవానికి దీనికోసం మన చెవిలో పెద్ద యంత్రాంగం ఉంటుంది. ఇది మెరుపు వేగంతో పనిచేస్తుంటుంది. స్థూలంగా మన చెవిలో మూడు భాగాలుంటాయి.
1. బయటి చెవి. ఇది మనకు కనిపించే చెవి భాగం, శబ్ధ తంరగాలు దీని గుండానే చెవిలో ప్రవేశిస్తాయి.
2. మధ్య చెవి. దీనిలో బయటి నుంచి వచ్చే శబ్దాలకు స్పందించే కర్ణభేరి, దానికి అనుసంధానంగా మూడు గొలుసు ఎముకలు ఉంటాయి. శబ్దాలకు తగ్గట్టుగా కర్ణభేరి ప్రకంపించగానే ఈ మూడు ఎముకలు కూడా కంపిస్తాయి.
3. అంతర్‌ చెవి. మధ్య చెవిలోని గొలుసు ఎముకలలో చివరిది వచ్చి ఒక నత్తలాంటి వర్తులాకారపు గొట్టం ఆకృతికి అనుసంధానమవుతుంది. ఈ నత్తలాంటి నిర్మాణమే కాక్లియా మన వినికిడికి అత్యంత కీలకమైనది, సున్నితమైన భాగం ఇది. దీనిలోని ద్రవం ఆ ద్రవంలో లేలియాడుతూ సున్నితమైన వెంట్రుకలాంటి రోమకణాలు ఉంటాయి. శబ్దానికి కర్ణభేరి, గొలుసు ఎముకలు కదిలినప్పుడు ఆ కదలికకు కాక్లియాలోని ద్రవంలో సున్నితమైన అలలు వస్తాయి. ఈ అలలకు అందులోని రోమకణాలు అటుఇటూ ఊగుతాయి. వీటినుంచి విద్యుత్‌ ప్రచోదనాలు ఉత్పత్తి అయ్యి, అవి శ్రవణ నాడి ద్వారా ప్రయాణించి మెదడుకు చేరతాయి. అప్పుడు మనకు శబ్ధాన్ని విన్న అనుభూతి కలుగుతుంది.