నేత్రదానం అంటే ఒకవ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తి కళ్లను సేకరించి అందులోని కార్నియాను (కంటిమీద ఉండే పారదర్శకమైన పొర) సేకరించి అవసరమైన వారికి ఒక కంటికి మాత్రమే అమరుస్తారు. కనుక ఒక వ్యక్తి నేత్రదానం చేస్తే దానివల్ల ఇద్దరికి చూపు వస్తుంది. కార్నియా దెబ్బతిన్నవారికి మాత్రమే ఇవి అమరుస్తారు.
దీనినే కార్నియా రీప్లేస్ మెంట్ లేదా కెరటోప్లాస్టీ, కార్నియా గ్రాఫ్టింగ్ అంటారు. ఈ సర్జరీకి బ్లడ్ గ్రూపులతో అవసరం లేదు.
కార్నియా పారదర్శకంగా ఉంటూ బయటి దృశ్యాలను కంటిలోపలకి చేరవేస్తుంది. కార్నియాలోని పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు. దీనినే కార్నియల్ బ్లైండ్ నెస్ అంటారు.
దాతనుండి సేకరించిన కార్నియాను వైద్యనిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇన్నర్ లేయర్ శక్తిని పరీక్షిస్తారు. అది సరిగ్గా ఉండా సర్జరీ ద్వారా అవసరమైనవారికి అమరుస్తారు.
మరణానంతరం ఆరు గంటలలోపు కళ్లను సేకరించాలి. అంతవరకు మృతుని కనురెప్పలను మూసి కళ్లమీద తడిగుడ్డ లేదా దూదిని లేదా ఐస్ ముక్కలను ఉంచాలి. తల ఎత్తులో ఉండేటట్లు చూడాలి. తలకింద రెండు తలగడలు ఉంచాలి. మృతదేహం ఉన్న గదిలో ఫ్యాన్ వేయకూడు. దీనివల్ల కార్నియా పొడిగా మారి చెడిపోయే అవకాశం ఉంటుంది. గదిని వీలైనంత చల్లగా ఉంచాలి.
ఆధునాతన పరికరాలు అందుబాటులో ఉన్న ఈ కాలంలో కంటి నల్లగుడ్డుమీద ఉండే కార్నియాను మాత్రమే సేకరిస్తారు. ఇదివరకటిలాగా కనుగుడ్డు మొత్తం సేకరించరు కనుక కను గుడ్డు ఆకారంలో ఏ మాత్రం తేడా కనిపించదు.ఆధునాతన పరికరాలు అందుబాటులో లేకపోతే పాత పద్ధతిలో కంటిని మొత్తంగా తీసినట్లయితే ఆ స్థానంలో కృత్రిమ కంటిని అమరుస్తారు. కార్నియాను సేకరించిన తరువాత దానిని కార్నియా ట్యాంక్ లో ఉంచి అవసరమైనవారికి అమరుస్తారు.
సూడోపేకిక్ బుల్లస్ కెరటోపతి, కెరటోకోనస్, కార్నియాకు గాయాలు, కార్నియల్ డీ జనరేషన్, కార్నియల్ అల్సర్స్, ఎండోధీలియల్ డీ- కంపెన్సేషియన్, పుట్టుకతోనే తెల్లటి కార్నియా ఉంటడం, రసాయనాలవల్ల కార్నియా దెబ్బతినటం జరిగిన వారికి అవసరం
నేత్రదానం చేయదలచుకున్నవారు సంబంధిత సంస్థలను సంప్రదించి ప్రతిజ్ఙ చేయాలి. మరణించిన వారి కళ్లను ప్రతిజ్ఙ చేయకపోయినా వారి వారసులు దానం ఇవ్వవచ్చు.
నేత్రదానానికి వయసుతో నిమిత్తం లేదు. వార్ధక్యం అడ్డురాదు.
కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నవారు, కళ్లజోడు ధరించేవారు, బిపీ, షుగర్ ఉన్నవారు, ఉబ్బసం, టీబీ వంటి వ్యాధులున్నవారు కూడా కార్నియా ఆరోగ్యంగా ఉంటే దానం చేయవచ్చు.
ఎయిడ్స్, హెపటైటిస్, రుబెల్లా, మలేరియా, సిఫిలిస్ వంటి అంటు వ్యాధులన్నవారు, క్రెజ్డ్ ఫోల్డ్ జాకబ్ వ్యాధి, అల్జీమర్స్, మల్టిపుల్ స్ల్కెరోసిస్, బ్లడ్ క్యాన్సర్, ట్యూమర్లు ఉన్నవారు, మత్తు పదార్ధాలు వాడేవారు నేత్రదానానికి అనర్హులు.
విషప్రభావంతో మరణించిన వారి కళ్లు పనిరావు. వాటిని సేకరించటానికి ప్రయత్నం కూడా జరగదు.
అపోహ : కళ్లను దానం చేసి కళ్లు లేని దేహాన్ని ఖననం లేదా దహనం చేస్తే మరుసటి జన్మలో కళ్లులేకుండా పుడతారని, అందుకు మతాలు ఒప్పుకోవనిది ఒక అపోహ.
నిజం : ఇది కేవలం నిరాధారమైన అపోహ మాత్రమే. నిజానికి ఏ మతమైనా దాతృత్వాన్ని ప్రభోదిస్తుంది.
అపోహ : క్యాటరాక్ట్ చేయించుకున్న వాళ్ల కళ్లు నేత్రదానానికి పనికి రావంటారు
నిజం : క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా సరే....కళ్లను నిరభ్యంతరంగా దానం చేయవచ్చు.
అపోహ : ముసలివాళ్ల కళ్లు దానానికి పనికి రావు. వయసులో ఉన్నవారి కళ్లు మాత్రమే పనికి వస్తాయి.
నిజం : ఏడాది నిండిన పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా సరే అందరూ నేత్రదానం చేయవచ్చు.
అపోహ : బతికి ఉన్న వాళ్లు కూడా జీవించి ఉండగానే కళ్లు దానం చేయవచ్చా?
నిజం : కేవలం చనిపోయిన వారి నుంచి మాత్రమే కళ్లను స్వీకరిస్తారు. చూపు పోయి బతికి ఉన్నవాళ్లయినా సరే కళ్లను స్వీకరించరు.