వయసుతోపాటు సహజంగా వచ్చే కంటి సమస్య క్యాటరాక్ట్. ప్రపంచంలో 60 శాతం మందిలో క్యాటరాక్ట్ వలన అంధత్వం వస్తుంది. ఇది చాలా సాధారణ శస్త్రచికిత్సతో సరిచేయగలిగిన సమస్య.
మన కంట్లో సహజమైన/పారదర్శకమైన లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ ద్యారానే కాంతి ప్రయాణం చేసి రెటీనా అనే తెరపై పడుతుంది. ఈ రెటీనా అనే తెరపై ఏర్పడే ప్రతిబింబం ద్వారానే మనం చూడగలుగుతుంటాం. స్వాభావికంగా మన కంట్లో ఉన్న ఈ లెన్స్ ఒక అద్భుతమైన అవయవం. ఈ లెన్స్ క్రమంగా మందం అయిపోవటం దాని పారదర్శకతను కోల్పోవటం జరుగుతుంది. ఫలితంగా కాంతి దానిగుండా ప్రయాణం చేయడం సాధ్యం కాదు. దీనితో క్రమంగా చూపు మసకబారుతుంది. దీనినే క్యాటరాక్ట్ అంటారు. ఇది వయసుతో పాటు సహజంగా వస్తుంది.
చికిత్స : గతంలో ఈ లెన్స్‌ను తొలగించి కార్నియాపై కుట్లు వేసేవారు. ఆ కుట్లు కార్నియాపై 13-14 ఎం.ఎం. మేరకు ఉండేవి. తరువాత ఆక్రిలిక్ టెక్నాలజీలో వచ్చిన మార్పులతో కృత్రిమ లెన్స్ తయారుచేశారు. పాత స్వాభావిక లెన్స్ స్ధానంలో వీటిని అమర్చటం చేస్తారు. దీంతో ఆపరేషన్ తరువాత కనుచూపు మెరుగవ్వటం జరిగేది. ఈ విధానంలో కూడా 10-12 ఎం.ఎం. కుట్లు వేయాల్సి వుంది.
ఫ్యాకో ఎమల్సిఫికేషన్ (పిఈ) : క్యాటరాక్ట్ చికిత్సలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ ఒక ఆధునిక ప్రక్రియ. కంప్యూటర్ సహాయంతో నిర్వహిస్తారు. అయితే ఇది కాస్తంత ఖరీదైనది. క్యాటరాక్ట్‌కు ఫ్యాకో ఎమల్సిఫికేషన్ ద్వారా చికిత్స అందిస్తున్న దక్షిణాసియా దేశాల్లో భారతదేశం మొట్టమొదటి దేశం. ఈ ప్రక్రియలో క్యాటరాక్ట్‌ను ఫ్యాకో ఎమల్సిఫికేషన్ ప్రోబ్ సహాయంతో చిన్న చిన్నముక్కలుగా చేసి వాటన్నింటిని సక్షన్ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఆ స్థానంలో కొత్త లెన్స్ అమరుస్తారు. చాలా తక్కువ వ్యవధిలో దీనిని చేస్తారు. ఇందుకోసం కార్నియాపై 3 ఎం ఎం గాటు మాత్రమే పెడతారు. గాటు చిన్నది కావటం, కుట్లు వేయాల్సిన అవసరం లేక పోవటంతో గాయం త్వరగా మానుతుంది. దీనిలో రిస్క్ కూడా తక్కువ. పేషంట్లు చాలా త్వరగా తమ వృత్తి, ఉద్యోగాలకు వెళ్లవచ్చు.
IOL : ఇంట్రా ఆక్యులర్ లెన్స్ మరింత ఆధునికమైనవి (ఐఓయల్) మడత పెట్టగలిగేవి, ఎలాస్టిక్ లెన్స్‌లు, ఇంజెక్టబుల్ లెన్స్ రూపొందిస్తున్నారు. గతంలో లాగా క్యాటరాక్ట్ చికిత్సకు పూర్తిగా మత్తు ఇవ్వవలసిన అవసరం లేదు కూడా. కేవలం లోకల్ అనస్థీషియా ఇస్తారు. నొప్పి కూడా తక్కువ. ఆపరేషన్ చేయించుకున్న తరువాత హాస్పటల్ లో ఉండనవసరం లేదు. వెంటనే వెళ్లిపోయి తిరిగి డాక్టర్ సలహా ప్రకారం పరీక్షలకు రావలిసి ఉంటుంది.