header

Eye Precautions…..కంటి జాగ్రత్తలు

Eye Precautions…..కంటి జాగ్రత్తలు
డా. వి.రవిశంకర్‌, డా. వి.కృష్ణవేణి, మీనాక్షి కంటి ఆసుపత్రి, డోర్నకల్‌ రోడ్‌, సూర్యారావుపేట, విజయవాడ - 2. ఫోన్స్‌: 0866-2433388 సెల్‌ : 9346474461
ఆధునిక జీవనశైలిలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరిమీదా ఒత్తిడి, భారం పడుతున్నాయి. అన్నిటి ప్రభావం చివరకు కళ్ళమీదనే పడుతుంది. కంటిపై ప్రభావం చూపించడానికి నిద్రలేమి, అలసట, ఒత్తిడి, దిగులు, ఆందోళన, ఇలా కారణాలెన్నో.
నిర్లక్ష్యం కొన్నిసార్లు కంటి సమస్యలకు కారణమవుతుంది. మన ప్రతి కదలిక కంటి చూపుపై ఆధారపడి ఉంది. కళ్ళు అవి ఎంత చిన్నవైన, చెంపకు చారెడేసైనా మన జీవితానికి అవే వెలుగులు. కళ్ళులేని జీవనాన్ని ఊహించుకోలేము. మన కళ్ళు శరీరానికి అమరిన సహజ సౌందర్యాభరణాలు. ఆరోగ్యానికి ఆనవాళ్ళు. ఏ దృశ్యాన్నయినా, సన్నివేశాన్నయినా, వ్యక్తిత్వాన్నయినా సహజంగా చూపించడంలో కళ్ళు ప్రధాన భూమిక అవుతాయి.
కళ్ళకు శత్రువు సూర్యుడు : జీవకోటికి ఎంతో మేలుచేసే సూర్యుడే కళ్ళకు శత్రువు. సూర్యుడి నుంచి ప్రసరించే అతినీలలోహిత కిరణాలవలన కళ్ళు పాడవుతాయి. ఆకాశం మేఘావృతమైనా కళ్ళకు ఈ పరిస్థితి తప్పదు. బయట ఎండలో తిరిగేటప్పుడు ఆల్ట్రావయెలెట్ రేస్‌ నుంచి రక్షణనిచ్చే సన్‌గ్లాసెస్‌ పెట్టుకోవటం మంచిది. ఎండలోని అతినీలలోహిత కిరణాలనుంచి కంటికి రక్షణ కావాలి. ఇక గాలిలో ఉండే దుమ్ము, ధూళి కంటి శుక్ల పటలానికి ఇబ్బంది కలిగిస్తాయి.
దుమ్ము, ధూళి, అధిక సూర్యరశ్మి నుంచి కళ్ళను కాపాడుకోవానికి రక్షణగా కళ్ళద్దాలు ధరించాలి. ఇవి కంటికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాహన చోదకులు ప్రయాణాలలో తప్పకుండా కళ్ళద్దాలు ధరించాలి. లేకపోతే ఎదురుగాలి వలన కంట్లో తేమ ఆవిరవుతుంది. కళ్ళపై వత్తిడి పెరుగుతుంది. దాంతో కంటి చూపు మందగిస్తుంది. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారు చలవ కళ్ళద్ధాలు పెట్టుకోవడం వలన ఎండలోని ఆల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది.
చూపు తిప్పుకోలేని కళ్ళు : చూపుతిప్పుకోలేని కళ్ళు అందాలు, నయన సోయగాలు కొందరికే దక్కే సౌందర్య నిక్షేపాలు. అలసటను నివారించటమే నయనాల మెరుపుకి అసలైన కీలకం. ఆధునిక జీవనసరళిలో 'లాప్ టాప్‌' అంతర్భాగమైంది. అది లేకపోతే ఇవాళ చాలా మందికి అసలు పని ముందుకే సాగదు. అలా అని మితిమీరి పనిచేయడం కళ్ళకు విశ్రాంతి లేకుండా తదేక ధ్యాసంతో పనిచేయడం వలన కళ్ళు అలసిపోతాయి. మండుతాయి. చూపు మందగించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది ఆఫీసులో తాము చేసే పని చాలదన్నట్లు ఇంటికి వచ్చాక కూడా కంప్యూటర్‌ ముందు తిష్టవేస్తారు. గంటల తరబడి చాటింగ్ చేస్తుంటారు. కాకపోతే రిలాక్సేషన్‌ పేరుతో టివి.కి కళ్ళు అతికించేసుకుంటారు.
ఇవన్నీ ఇవాల్టి జీవనశైలిలో భాగమే కావచ్చు కాని వెలుగునిచ్చే కళ్ళును నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు. యాంటీగ్లేర్‌ గ్లాస్‌లు పోలరైజ్డ్‌ సన్‌గ్లాస్‌లు ధరించడం వలన కంప్యూటర్‌, సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాల నుంచి కళ్ళకు కొంతమేరకు రక్షణ వుంటుంది. కంటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. కళ్ళకు విశ్రాంతి చాలా ముఖ్యం. ఏ పని చేస్తున్నా మధ్యమధ్యలో ప్రతి పదినిమిషాలకొకసారి కళ్ళను ఓ నిమిషంపాటు మూసుకొని ఉంచాలి.
కంప్యూటర్‌ ముందు పనిచేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : కంప్యూటర్‌ దగ్గర గంటలతరబడి పని చేసే కళ్ళకు రక్షణ అవసరమే. కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేసేవారు క్రమం తప్పకుండా కళ్ళ రెప్పలను ఆడిస్తూ ఉండాలి. కళ్ళపై మరీ ఎక్కువ కాంతి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. పరిసరాలలో తగినంతగా కాంతి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే కళ్ళు అధిక శ్రమకు ఒత్తిడికి లోనై కంటి చూపు మందగించే ప్రమాదం కూడా ఉంది. కంటి సమస్యలున్న వాళ్ళలో కొందరికి కళ్ళద్దాలు తప్పనిసరి.
విశ్రాంతి అవసరం : మధ్య మధ్యలో కనురెప్పలను ఆడించకుండా తదేక ధ్యాసతో కంపూటర్స్‌పై పనిచేస్తే కళ్ళ పొడిబారుతాయి. కళ్ళుమూసి, తెరుస్తూ రెప్పలను ఆడించడం వలన కళ్ళలో నీళ్ళు చేరుతాయి. కళ్ళు తేమగా వుంటాయి.
కళ్ళు మూసుకున్నపుడు సహజమైన తేమను కలిగి వుంటాయి. అందువల్ల కళ్ళు శుభ్రపడతాయి. కాబట్టి తరచుగా కనురెప్పలను ఆడిస్తూ ఉండాలి. ఆందోళన, అలసట, నిద్రలేమి, దిగులు, ఒత్తిడి... కారణం ఏదైనా కావచ్చు, చాలామందికి కళ్ళ కింద నల్ల వలయాలు ఏర్పడతాయి. ఇవి ముఖంమీద ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటాయి.
సూర్యరశ్మి ప్రభావం వలన ముఖంమీద చర్మం దెబ్బతింటుంది. ఎక్కువగా ఎండలో తిరగడంవలన సూర్యరశ్మి ప్రభావానికి అధికంగా గురికావటం వలన కంటి కింద వున్న పలుచని చర్మం మరింత పలుచన అవుతుంది. మడతలు పడుతుంది. కంటి కింద నరాలు ఉబ్బుతాయి. కొన్ని సందర్భాలలో ఎలర్జీలు కూడా కళ్ళకింద నల్ల వలయాలు రావానికి కళ్ళు ఉబ్బటానికి కారణమవుతుంటాయి. నాసికా రంధ్రాలలోని ఏవైనా అడ్డంకులూ కారణం కావచ్చు, సైనసైటిస్‌ వున్నా, జలుబు భారం ఉన్నా అవి కళ్ళకింద వాపులకు దారి తీస్తాయి.
ధూమపానం చేసే హాని : మీరు పొగ తాగకపోవచ్చు, ధూమపానం చేసే అలవాటు లేకపోవచ్చు కాని ధూమపానం చేసేవారి పక్కన నుంచున్నా సిగరెట్ పొగకు అతిసమీపంలో ఉన్నా అది కంటి చూపుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ పొగబారిన పడ్డవారిలో కళ్ళు ఎర్రబడటమో, నీరు కారడమో లేక కళ్ళు ఉబ్బడమో జరుగుతాయి. రాత్రిపూట నిద్రపోయే ముందు తల ఎత్తులో ఉండేందుకు తలకింద రెండు దిండ్లు పెట్టుకుని పడుకుంటే కళ్ళకింద నీరు చేరదు, వాపు కూడా ఏర్పడదు. రాత్రికి రాత్రే కళ్ళలోని ద్రవాలు ఆరిపోతాయి.
కంటికి రక్షణ కావాలి : ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న రోగాల సరసన నేటి కంప్యూటర్‌ యుగం కనిపించని కంటి సమస్యలను తెచ్చిపెడుతోంది. ఒత్తిడి, ఊబకాయం, కంటి చూపు సమస్యలు ఈ జీవనశైలి పుణ్యమే. ఈ ఆధునిక జీవన పద్ధతి పిల్లలలో కంటి జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఆరుబయట ఆడుకునే సమయం తగ్గిపోవటం, ఎక్కువ సమయం తరగతి గదుల్లోనే, ఇండోర్లోనే అధికసమయం పుస్తకాలు, కంప్యూటర్లు, టీవీల ముందు దగ్గర దగ్గర వస్తువులను తదేకంగా చూడడానికి అలవాటుపడటంతో ఈ తరం పిల్లలలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి.
కనుగుడ్లు ముందు భాగంలో లెన్స్‌ పారదర్శకత కోల్పోయి, మందంగా తయారవటం వలన దీనిగుండా కాంతికిరణాలు ప్రసరించలేవు. ఫలితంగా కంటి చూపు తగ్గిపోయి కళ్ళలో శుక్లాలు ఏర్పడవచ్చు.
శుక్లాలు : సర్వసాధారణంగా శుక్లాలు అనేవి వయస్సుతో వచ్చే సమస్య. మధుమేహం, ధూమపానం,, మద్యపానం ఎక్కువకాలం ఎండలో గడపడం వంటి వాటి వలన ఈ ముప్పు ముందే ముంచుకొస్తుంది. నేత్రవైద్య నిపుణులచే తరచుగా కళ్ళపరీక్ష చేయించుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉండానికి దోహదం చేస్తాయి. తరచుగా తలనొప్పి వస్తుంటే నేత్రవైద్యుణ్ణి సంప్రదించాలి, ఒత్తిడి, కంటి చూపులో తేదాలు, మైగ్రేన్‌, నరాల సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో తలనొప్పికి కారణమవుతాయి. కంటి కండరాలు బలహీనమైతే చూపు త్వరగా మందగిస్తుంది. డాక్టర్‌ సిఫార్సు చేసిన అద్దాలను ధరించిడంవల్ల కళ్ళకు బలం చేకూరుతుంది.
ఏమేం తినాలి : కనుపాపపై ఒత్తిడి తగ్గాలంటే వ్యాయాయం అవసరం. తేలికపాటి వ్యాయామాలు చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిపై ఒత్తిడి తీవ్రమైతే గ్లకోమా సమస్య వస్తుంది. కాబట్టి వ్యాయామం తప్పనిసరి. కళ్ళను పైకి, కిందకు కుడి, ఎడమలకు గుండ్రంగా తిప్పుతూ వ్యాయామం చేస్తే కళ్ళ అలసట దూరమవుతుంది.
నీళ్ళు ఎక్కువగా తాగకపోతే శరీరంతో తేమ తగ్గుతుంది. ఆ ప్రభావం కళ్ళమీద పడుతుంది. కళ్ళుకాంతి హీనమవుతాయి. కళ్ళు బాగా అలసిపోతే విశ్రాంతిగా కనుగుడ్లు కదలిస్తూ వ్యాయామం చేయాలి. కళ్ళు, కళ్ళు చుట్టూ ఉన్న కండరాలకు చాలినంత విశ్రాంతి ఇవ్వాటానికి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. తర్వాత కళ్ళు తెరచి దూరంగా చూడాలి. ఇలా రోజూ నాలుగైదుసార్లు చేస్తే కంటికి మంచిది. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో బీటారోటిన్‌ కీలక భూమిక వహిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సంతులిత ఆహారం తీసుకొవాలి. ఆహారంలో క్యారెట్స్, బొప్పాయి, మామిడి, పాలకూర, క్యాలీఫ్లవర్‌, క్యాబేజి, బ్రొకోలి, బీన్స్‌, దోసకాయ, వీటితో పాటు మీగద, పాలు,ఛీజ్‌ తీసుకోవాలి, A విటమిన్‌ సమృద్ధిగా ఉన్న ఆహారం కంటి కెంతో మంచిది.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం కాని మారుతున్న జీవనశైలి ప్రభావమో.. వయస్సు ప్రభావమో...పోషకాహార లోపమో.. ఒత్తిడి పుణ్యమో..కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కళ్ళు తమ సహజసిద్ధమైన మెరుపును, చురుకును కోల్పోతున్నాయి. ఇంద్రియాలలో కెల్లా ప్రధాన ఇంద్రియమైన కళ్ళగురించి, కంటి ఆరోగ్యం గురించి తప్పక శ్రద్ధ వహించాలి.