header

Myopia / హ్రస్వదృష్టి

Myopia / హ్రస్వదృష్టి
Dr. B. Venkateswara Rao
Pediatric Ophthalmologist, Sreya Eye Care Center, Greenlands, Begumpet, Hyderabad
ఈ దృష్టి దోషం గలవారికి దగ్గర గల వస్తువులు కనబడతాయి.దూరంగా గల వస్తువులను చూడలేరు. దీనికి కారణం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలు రెటీనా మీద కాకుండా రెటీనా ముందు కేంద్రీకరింపబడతాయి.
భౌగోళిక, జన్యుపరమైన అంశాలే దీనికి బీజం వేస్తున్నాయి. పాశ్చాత్యదేశాల కన్నా మనలాంటి ఆసియాదేశాల పిల్లల మీదే హ్రస్వదృష్టి ఎక్కువగా దాడి చేస్తుండటమే దీనికి నిదర్శనం. తల్లిదండ్రులిద్దరూ హ్రస్వదృష్టి గలవారైతే పిల్లలకూ వచ్చే అవకాశం పెరుగుతుంది. నెలలు నిండకముందే పుట్టే పిల్లలకు, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేవారికి కూడా దీని ముప్పు పెరగొచ్చు. కంటికి మరీ దగ్గరగా వస్తువులను పెట్టుకొని చూడటం కూడా కొంతవరకు సమస్యకు దారితీయొచ్చు.
హ్రస్వదృష్టి తరచుగా చూసే సమస్యే. దీన్నే నియర్ సైట్, మయోపియా అనీ అంటారు. దీని బారినపడ్డవారికి దగ్గరి వస్తువులు బాగానే కనబడతాయి గానీ దూరంగా ఉన్నవి స్పష్టంగా కనబడవు. మనదేశంలో కంటి సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే పిల్లల్లో మూడింట రెండొంతుల మంది హ్రస్వదృష్టితో బాధపడుతున్నవారే. ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది. హ్రస్వదృష్టికి ప్రధాన కారణం- కనుగుడ్డు సైజు పెరగటం. మన కంట్లో ముందువైపు కనిపించే నల్లగుడ్డు, దాని వెనక లెన్సు ఉంటాయి. బయటి నుంచి వచ్చే కాంతి కిరణాలను ఈ లెన్సు- కనుగుడ్డు వెనకాల ఉండే రెటీనా పొర మీద సరిగ్గా కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. దీంతో ఆయా దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి. ఈ ప్రక్రియలో కనుగుడ్డు, రెటీనా పొర మధ్య ఉండే దూరం (ఆక్సియల్ లెంగ్త్) చాలా కీలకం. సాధారణంగా పుట్టినపుడు సుమారు 17 మిల్లీమీటర్లుండే ఈ దూరం పెద్దయ్యాక దాదాపు 24 మిల్లీమీటర్ల వరకు చేరుకుంటుంది. ఇది తగ్గినా, పెరిగినా చూపు మీద గణనీయమైన ప్రభావం పడుతుంది.
ఒక మిల్లీమీటరు దూరం పెరిగినా చూపు పవర్ (డయాప్టర్) మైనస్ 3 అవుతుంది. అదే మిల్లీమీటరు దూరం తగ్గితే పవర్ ప్లస్ 3 అవుతుంది. నిజానికి చాలామందికి పుట్టుకతోనే ప్లస్ 3 పవర్ ఉంటుంది. అసలు చిక్కేంటంటే- వయసు పెరుగుతున్నకొద్దీ కంటి పొడవు, ఆకారం మారుతూ వస్తుండటం. కనుగుడ్డు పొడవు పెరుగుతున్నకొద్దీ నల్లగుడ్డుకూ రెటీనా పొరకు మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. దీంతో ప్లస్ పవర్ నెమ్మదిగా తగ్గుతూ.. సున్నాకు చేరుకుంటుంది. దీన్నే ఇమెట్రోపైజేషన్ అంటారు. కనుగుడ్డు సైజు ఇంకా పెరుగుతూ వస్తే మైనస్ పవర్ మొదలవుతుంది. ఇదే హ్రస్వదృష్టికి మూలం. కనుగుడ్డు, రెటీనా పొర మధ్య దూరం పెరిగినపుడు కాంతి కిరణాలు రెటీనా మీద పడకుండా.. కాస్త ముందుభాగంలోనే ఆగిపోతాయి. దీంతో దూరం వస్తువులు సరిగా కనబడవు. అంతా మసక మసకగా అనిపిస్తుంది. దగ్గరివి మాత్రం బాగానే కనబడతాయి.
నిర్ధరణ
హ్రస్వదృష్టిని చాలావరకు లక్షణాల ఆధారంగానే అనుమానించొచ్చు. అయితే కంటిని పూర్తిగా పరీక్షించి సమస్యను నిర్ధరించటం చాలా అవసరం. అందుకే డాక్టర్లు ముందుగా కంటిని నిశితంగా పరిశీలించి మెల్లకన్ను ఏమైనా ఉందా? కంటి వెనకభాగం ఎలా ఉంది? అనేవి చూస్తారు. హ్రస్వదృష్టి విషయంలో కంట్లో సైక్లోపెంటలేట్ చుక్కల మందు వేసి పరీక్షించటం చాలా కీలకం. ఈ మందుతో తాత్కాలికంగా కంటిపాప పెద్దదవుతుంది. సీలియరీ కండరాలు వదులవుతాయి. అనంతరం రెటీనోస్కోపీతో పరీక్ష చేస్తే దృష్టి దోషం కచ్చితంగా తెలుస్తుంది. కంటి వెనకాల భాగం ఎలా ఉందో కూడా చూస్తారు. మిగతావన్నీ బాగానే ఉండి దృష్టి దోషం మైనస్ పవర్లో ఉంటే హ్రస్వదృష్టిగా నిర్ధరిస్తారు. సమస్య ఒక్క కంట్లోనే ఉందా? రెండు కళ్లలో ఉందా? సమస్య తీవ్రత ఎలా ఉంది? అనేవి కూడా ఇందులో బయటపడుతుంది.
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
హ్రస్వదృష్టి ఉన్నా కూడా దాన్ని గుర్తించకుండా ఉండిపోయే పిల్లలూ కనబడుతుంటారు. ముఖ్యంగా ఒక కంట్లోనే దోషం ఉన్నప్పుడు.. మరో కన్ను బాగానే ఉంటుంది. దీంతో చూపులో పెద్ద తేడా కనబడదు. ఎప్పుడైనా అనుకోకుండా కంటికి ఏదైనా అడ్డు పడ్డప్పుడు మసక మసకగా అనిపించి సమస్య బయటపడొచ్చు. అప్పటికే సమస్య ముదిరిపోయి ఉండొచ్చు కూడా. పవర్ ఎక్కువగా ఉన్నవారికి.. ఒక కంట్లో పవర్ ఉండి, మరో కంట్లో ఎలాంటి పవర్ లేనివారికి సమస్యను సకాలంలో గుర్తించకపోతే చివరికి దృష్టిమాంద్యానికి దారితీయొచ్చు. దోషం ఉన్న కన్ను క్రమేపీ కనిపించకుండా పోతూ.. ఆఖరికి దృష్టిమాంద్యంలోకి (ఆంబ్లియోపియా) వెళ్లిపోవచ్చు. అప్పుడు అద్దాలు ఇచ్చినా చూపు తిరిగి మెరుగుపడదు. దృష్టిదోషాలు గల పిల్లల్లో సుమారు 5 శాతం మందికి ఆంబ్లియోపియా వచ్చే అవకాశముంది. ఏడాదికోసారి కంటి పరీక్ష చేయటం ద్వారా ఈ స్థితి రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా బడిలో చేర్పించే సమయంలోనే పిల్లలకు సంపూర్ణ కంటిపరీక్ష చేయించటం ముఖ్యమనే సంగతిని అంతా గుర్తించాలి.
ప్రధాన చికిత్స అద్దాలే
హ్రస్వదృష్టి గలవారికి ఆయా పవర్కు అనుగుణమైన అద్దాలు వాడితే చూపు బాగా మెరుగవుతుంది. తొలిసారి అద్దాలు వాడటం మొదలెట్టిన తర్వాత మూడు, నాలుగు నెలలకు మరోసారి పరీక్ష చేసి చూస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకపోతే అద్దాలను అలాగే కొనసాగించొచ్చు. ఏదైనా తేడా కనబడితే పవర్ మార్చాల్సి ఉంటుంది. తర్వాత ఆర్నెల్లకోసారి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అద్దాలు ఇష్టం లేకపోతే, నాట్యం వంటివి చేసేవారికి, ఆటలాడేవారికి కాంటాక్ట్ లెన్సులు ఇవ్వొచ్చు. అయితే పిల్లలు కాంటాక్ట్ లెన్సులు ధరించటం కష్టం. రోజూ తీసి పెట్టటం వల్ల ఇన్ఫెక్షన్ల వంటివి తలెత్తొచ్చు. అందువల్ల చాలావరకు అద్దాలకే ప్రాధాన్యం ఇస్తారు. దృష్టిదోషం స్థిరపడిన తర్వాత హ్రస్వదృష్టిని పూర్తిగా నయం చేయటానికి లేసిక్ శస్త్రచికిత్స బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 18 ఏళ్ల తర్వాతే.. అదీ ఏడాది వరకు పవర్ మారకుండా ఉంటేనే చేస్తారు. నిజానికి ఒకసారి కంటి సైజు పెరిగితే దాన్ని తగ్గించటమనేది అసాధ్యం. అందుకే లేసిక్ సర్జరీలో కార్నియా మందాన్ని, వంపును తగ్గించటం ద్వారా మాత్రమే చూపును సరిచేస్తారు. అయితే ఇది అందరికీ పనికిరాదు. కార్నియా మందం పలుచగా ఉన్నవారికి దీన్ని చేయటం కుదరదు.
కార్నియా మందం పలుచగా గలవారికి కంటి లోపలే లెన్సును అమర్చే ఐసీఎల్ ప్రక్రియతో హ్రస్వదృష్టిని శాశ్వతంగా నయం చేయొచ్చు. సమస్య చాలా తీవ్రంగా గలవారికి.. అంటే మైనస్ పవర్ 9 దాటినవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే నల్లగుడ్డుకు, కంటిపాపకు మధ్య దూరం తక్కువగా గలవారికి దీన్ని చేయటం కుదరదు.
ప్రధానంగా 3 రకాలు
తీవ్రతను బట్టి హ్రస్వదృష్టిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. మైనస్ పవర్ 2 వరకు ఉంటే మామూలు (మైల్డ్), మైనస్ 2-5 వరకు ఒక మాదిరి (మోడరేట్), మైనస్ 5 కన్నా ఎక్కువుంటే తీవ్ర (హై) హ్రస్వదృష్టిగా పరిగణిస్తారు. చాలామంది మైనస్ పవర్ పెరుగుతోంటే లోపల కన్ను దెబ్బతింటుందేమోనని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. అద్దాలతో ఎలాంటి హ్రస్వదృష్టినైనా సరిదిద్దుకోవచ్చు. కానీ సరైన అద్దాలు వాడకపోతేనే ఇబ్బంది.
అనుమానించేదెలా?
హ్రస్వదృష్టి పిల్లలకు స్కూలులో బోర్డు మీద రాసినవి సరిగా కనిపించవు. దీంతో బోర్డు దగ్గరికి వెళ్లి రాసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. టీవీకి దగ్గరగా కూచొని చూస్తుంటారు. పుస్తకం కంటికి దగ్గరగా పెట్టుకొని చదువుతుంటారు.
దూరంగా ఉన్నవాటిని చూడాలంటే కళ్లు చిట్లించి, తదేకంగా చూస్తుంటారు.
- ఇలాంటివి గమనిస్తే డాక్టర్ను సంప్రదించటం మంచిది.
ఆర్నెల్లకోసారి కంటి పరీక్ష
శరీర ఎదుగుదల ఆయా వయసుల్లో కాస్త ఉద్ధృతంగా సాగుతుంటుంది. ఈ క్రమంలో కన్ను సైజు కూడా వేగంగా పెరుగుతూ వస్తుంది. పిల్లలకు 13 ఏళ్లు వచ్చేసరికి కనుగుడ్డు చాలావరకు ఎదుగుతుంది. ఆ తర్వాతా పెరగొచ్చు గానీ అంత ఎక్కువగా ఉండదు. మొత్తమ్మీద 18-20 ఏళ్లు వచ్చేసరికి కన్ను సైజుతో పాటు దృష్టి కూడా స్థిరపడిపోతుంది. అందుకే హ్రస్వదృష్టి చాలావరకు చిన్నవయసులో.. 13 ఏళ్లలోపే బయటపడుతుంటుంది. అయితే కొందరికి ఒక కంట్లోనే సమస్య ఉండొచ్చు. ఇంకొందరికి ఒక కంట్లో ప్లస్ పవర్, మరో కంట్లో మైనస్ పవర్ ఉండొచ్చు (అనైసోమెట్రోపియా). దీంతో సమస్యను పోల్చుకోవటం కష్టమవుతోంది. అందువల్ల పుట్టిన తొలి సంవత్సరంలోనే పిల్లల కంటి డాక్టర్తో ఒకసారి విధిగా పరీక్ష చేయించటం మంచిది. అంతేకాదు, దృష్టిదోష లక్షణాలేవీ లేకపోయినా కూడా పిల్లలకు 13-14 ఏళ్లు వచ్చేవరకూ.. అంటే దృష్టి స్థిరపడేవరకూ ఏటా కంటి పరీక్ష చేయించటం తప్పనిసరి. ఒకసారి మెదడులో దృష్టి వ్యవస్థ స్థిరపడిపోతే దాన్ని సరిదిద్దటం అసాధ్యం. కాబట్టి పిల్లలకు క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయిస్తే సమస్య ఏదైనా ఉంటే వెంటనే పట్టుకోవచ్చు. దృష్టిదోషం గల పిల్లలకైతే.. ముఖ్యంగా హ్రస్వదృష్టి గలవారికి ఆర్నెల్లకోసారి విధిగా కంటి పరీక్ష చేయించాలి. ఎందుకంటే కన్ను సైజు పెరుగుతుంటే దానికి అనుగుణంగా అద్దాల పవర్ కూడా మార్చాల్సి ఉంటుంది. లేకపోతే అద్దాలు ధరిస్తున్నా కూడా సరిగా కనబడక పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా 18 ఏళ్ల వరకూ క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించాలి.
ముదరకుండా జాగ్రత్తలు
హ్రస్వదృష్టికి అద్దాలు వాడుతున్నా సమస్య ముదరకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. సాధారణంగా ఇలాంటి పిల్లలకు కంటికి మరీ దగ్గరగా పుస్తకాలు పెట్టుకొని చదవటం వంటివి అలవాటై ఉంటాయి. దీంతో అద్దాలు పెట్టుకున్నా అలాగే చేస్తుంటారు. ఇలాంటి అలవాటు నుంచి పిల్లలను మాన్పించాలి. అలాగే మరీ ముందుకు వంగి రాయటం, చదవటం చేయకూడదు. పుస్తకం మీద వెలుతురు సరిగా పడేలా చూసుకోవాలి. టీవీలు, కంప్యూటర్ల వంటివి కొంతసేపు చూడటంలో తప్పులేదు. కాకపోతే తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఇటీవలి కాలంలో పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్స్ వాడకానికి అలవాటు పడుతుండటం పెద్ద సమస్యగా మారింది. వీటిని అదేపనిగా ముఖానికి దగ్గరగా పెట్టుకొని వీడీయోగేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం మంచిది కాదు. దీంతో కంట్లోని కండరాలు ఆయా దూరాలకు అలవాటుపడి, కనుగుడ్డు పెరగటం ప్రేరేపితమై మైనస్ పవర్ ఎక్కువయ్యే అవకాశముంది. ఎప్పుడూ ఇంట్లో, నీడపట్టున ఉండేవారితో పోలిస్తే ఆరుబయట గడిపే పిల్లలకు హ్రస్వదృష్టి పెరగటం తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల పిల్లలను కనీసం రోజుకు 2, 3 గంటలైనా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి.
కొత్తగా ఆర్థోకెరటాలజీ వంటి కొత్త విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రాత్రంతా నల్లగుడ్డు మీద కాంటాక్ట్ లెన్సులను పెట్టి, తెల్లారాక తీసేస్తారు. దీంతో అద్దాలు లేకుండానే చదవటం వంటి పనులు చేయటానికి వీలవుతుంది. కాంటాక్ట్ లెన్సు పెట్టటం వల్ల కార్నియా వంపు మారి చూపు మెరుగవుతుంది. అయితే దీని ప్రభావం ఒక రోజే ఉంటుంది. అందువల్ల వీటిని ప్రతి రాత్రి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా అధ్యయనాలు సాగుతున్నాయి. మనదగ్గర ఇదింకా అందుబాటులోకి రాలేదు.
అట్రోపిన్ చుక్కల మందుతో హ్రస్వదృష్టి మరింత ముదరకుండా చూడటంపైనా ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ చుక్కల మందు వేసినపుడు కంట్లోని సీలియరీ కండరాల సంకోచ వ్యాకోచాలు ఆగిపోతాయి. దీంతో దూరంగా ఉన్నవి బాగానే కనబడతాయి గానీ దగ్గరివి మసక మసకగా కనబడతాయి. అప్పుడు బైఫోకల్ అద్దాలు ఇవ్వటం ద్వారా హ్రస్వదృష్టి ముదరకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు. అట్రోపిన్ మోతాదును తగ్గించటం ద్వారా దగ్గరి వస్తువులు కనబడకపోవటం వంటి దుష్ప్రభావాల బారినపడకుండా చూసుకోవటం మీదా అధ్యయనాలు సాగుతున్నాయి.