header

Retina diseases

కంటి జబ్బులు --రెటీనా చికిత్స Dr.k.viswanath, Chairman, Pushpagiri eye institute, Secunderabad.
retina రెటీనా మీద వాపు, రక్తనాళాల నుంచి లీకేజీ వంటి మార్పులేం లేకపోతే.. కేవలం మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రించుకుంటే చాలు. వీరికి ప్రత్యేకించి కంటి చికిత్సలేం అవసరముండదు. కానీ కేశనాళాలు ఉబ్బి, వాటి నుంచి రెటీనా మీదికి లీకేజీలు, వాపు ఉంటే.. ప్రత్యేక చికిత్సలు తప్పవు.
--లేజర్‌ చికిత్స: రక్తకేశనాళాలు అక్కడక్కడ ఉబ్బి, వాటి నుంచి ద్రవాలు రెటీనా పొర మీదకు లీకవుతూ, వాపు వస్తుంటే- ఈ స్థితిలో చూపు బాగానే అనిపించొచ్చు. అయినా దాన్ని వదిలెయ్యకూడదు. లేజర్‌తో వాటిని మాడ్చేసి, ఆ లీకేజీలను మూసెయ్యటం అవసరం. దీన్నే మ్యాక్యులర్‌ ఫొటోకొయాగ్యులేషన్‌’ అంటారు. ఇలా రెటీనా మధ్యభాగంలో ఉబ్బిన కేశ నాళికలన్నింటినీ లేజర్‌ చికిత్సతో మూసేస్తారు. ఈ చికిత్స చెయ్యకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
--మొత్తానికి లేజర్‌: రెటీనా పొర మీది రక్తకేశనాళాలు ఎక్కడన్నా మూసుకుపోతున్నట్టు గుర్తిస్తే- ఈ స్థితిలో కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా చూడటం, వాటిని అడ్డుకోవటం చాలా అవసరం. అంటే రెటీనా పొరకు ఆక్సిజన్‌ అవసరాన్ని బాగా తగ్గించాలి. లేకపోతే అది కొత్త రక్తనాళాలను పుట్టించే పని మొదలుపెట్టేస్తుంది. అందుకని.. రెటీనా పొర మీద ఎక్కడ రక్తసరఫరా బాగా తగ్గిందో గుర్తించి.. ఆ భాగాన్ని లేజర్‌తో కొద్దిగా మాడ్చేస్తారు. దీంతో అక్కడ ఆక్సిజన్‌ అవసరం తగ్గుతుంది, కొత్త రక్తనాళాలు పుట్టుకొచ్చి, కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్నే ప్యాన్‌ రెటీనల్‌ కొయాగ్యులేషన్‌’ చికిత్స అంటారు. దీంతో పోయిన చూపు రాకున్నా.. మున్ముందు చూపు మరింత తగ్గకుండా చూసుకోవచ్చు. ఈ చికిత్స తీసుకున్నవాళ్లు చీకట్లో కాస్త ఇబ్బంది పడతారు. చుట్టూ చూపు కూడా కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి సొంతగా వాహనాలు నడపకుండా డ్రైవర్‌ను పెట్టుకోవటం, బస్సుల్లో ప్రయాణించటం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
retina --యాంటీ-వీఈజీఎఫ్‌ ఇంజెక్షన్లు: రెటీనా పొర మీద అక్కడక్కడ రక్తసరఫరా తగ్గినప్పుడు, కొత్త రక్తనాళాలు పుట్టుకురాకుండా ఆపటానికి కొత్తగా యాంటీ-వేజఫ్‌ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇస్తే కొత్త రక్తనాళాలు పుట్టవు. వాపు కూడా కొంత తగ్గుతుంది. ఆ తర్వాత అవసరాన్నిబట్టి లేజర్‌ చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.
--విట్రెక్టమీ: రెటీనా పొర నుంచి రక్తస్రావమై, అది కనుగుడ్డులోని ద్రవంలో గూడు కడితే- శస్త్రచికిత్స చేసి ఆ ద్రవాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెటీనా పొర ఊ¬డి రాకుండా ఉండేందుకు అవసరాన్ని బట్టి సిలికాన్‌ ఆయిల్‌, లేదా గ్యాస్‌ నింపుతారు. అవి రెటీనాను నొక్కి పట్టి ఉంచుతాయి. క్రమంగా అక్కడ ద్రవం భర్తీ అవుతుంది, అప్పుడు ఆయిల్‌ను తీసేస్తారు. ఈ శస్త్రచికిత్స సమయంలో కూడా- రెటీనా పొరకు లేజర్‌ ఇవ్వచ్చు. దాంతో మళ్లీ రక్తస్రావమయ్యే ముప్పు తగ్గుతుంది.
కంటిలో పరిస్థితిని బట్టి ఇలా రకరకాల చికిత్సలు చెయ్యాల్సి ఉంటుంది. లేజర్‌తో పూర్తిగా తగ్గినట్టు కాదు!
చాలామంది కంటికి లేజర్‌ చికిత్స చేయించుకున్నాం.. చూపు మళ్లీ బ్రహ్మాండంగా వచ్చేస్తుందని భావిస్తుంటారుగానీ అది ఏమాత్రం నిజం కాదు. రెటీనోపతీకి చేసే చికిత్సలన్నీ కూడా సమస్య మరింతగా ముదరకుండా చూసేవేగానీ తగ్గిన చూపును పూర్తిగా తెచ్చిపెట్టేవి కాదు.పైగా ఈ చికిత్సలతో సమస్య పూర్తిగా తొలగిపోయినట్లూ కాదు. మధుమేహం కారణంగా మరోచోట.. అంటే చికిత్స చేసిన చోట కాకుండా వేరే చోట సమస్యలు బయల్దేరుతుండొచ్చు. ఈసారి వచ్చే సమస్య ఇంకాస్త ఉద్ధృతంగానూ ఉండొచ్చు. కాబట్టి చికిత్సతో అంతా అయిపోయిందనుకోకుండా.. మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. వైద్యులు చెప్పినట్లుగా తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ.. లోపల పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటుండాలి. జీవితాంతం కంటి మీద ఈ శ్రద్ధ తప్పదు. లేదంటే చూపుకు ఎప్పుడైనా ఎసరు ముంచుకురావచ్చు.