header

Common Cold….. జలుబు

Common Cold….. జలుబు

Dr. M.V. Rao, Yesoda Hospital..Somajiguda, Hyderabada సౌజన్యంతో...
సర్వసాధారణ సమస్య జలుబు. దీనిని కామన్‌ కోల్డ్‌ అనికూడా అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలలో సంవత్సరానికి 6 నుండి 12 సార్లు వస్తుంటుంది. వయసు పెరిగిన కొద్ది తరచుదనం తగ్గుతుంది. పెద్దవాళ్ళకు కూడా 3,4 సార్లు రావచ్చు. జలుబు తెచ్చిపెట్టే వైరస్ లు దాదాపు 200 వరకూ ఉన్నాయి గానీ ఎక్కువగా కనబడేది రైనో వైరస్‌.
ఇంకా ఎడినో వైరస్‌, ఆర్‌ ఎస్‌వి, కరోనా వైరస్‌ వంటివి చాలా ఉన్నాయి. దేనీతో వచ్చిందన్నది చెప్పటం కష్టం. అంత అవసరం కూడా కాదు. జలుబు చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. దీనివన ఇతరత్రా సమస్యలు ముదరటం అరుదు.
లక్షణాలు : తుమ్ములు, ముక్కు, కారటం, ముక్కు పట్టేయటం, తలనొప్పి, కొద్దిగా జ్వరం ఇవన్నీ ఉండొచ్చు. కొందరిలో జ్వరం ఉండకపోవచ్చు కూడా. మొదట్లో1,2 రోజూ ముక్కు నుండి స్వచ్ఛమైన నీరులాంటి ద్రవం వస్తుంది. కొద్దిమందిలో దగ్గు, గొంతు నొప్పి కూడా రావచ్చు. మరీ తీవ్రమైన జ్వరం ఉండదు. ఒళ్ళు నొప్పులు అంతగా ఉండవు. ఈ సమస్య సాధారణంగా 2-5 రోజుల్లో తగ్గిపోతుంది.
ఈ బాధలు వేధిస్తుంటే యాంటీ హిస్టామిన్‌, డీకంజెస్టెంట్‌ మందులు వాడితే మంచి ఉపశమనం ఉంటుంది. ఇవి ముక్కునుండి స్రావాలను తగ్గిస్తాయి. ఇక జలుబు కంటూ ప్రత్యేకంగా యాంటీవైరల్‌ మందు లేదు. కొంచెం ఒళ్లు నొప్పులు ఉంటే పారాసెట్‌మెల్‌ బిళ్ళలు వేసుకోవచ్చు. సాధారణ జలుబు మందుల్లో (డీకోల్డ్‌ వంటివి) ఇవన్నీ కలిసే ఉంటాయి. వీటితోనే జలుబు తగ్గిపోతుంది. చిన్న పిల్లలు ముక్కు బిగిసిపోయి ఏడుస్తుంటే వారికి నేసోక్లియర్‌ వంటి చుక్కల మందు ముక్కులో వేస్తే రంధ్రాలు తెరుచుకుని హాయిగా గాలి పీల్చుకుంటారు.
జలుబు సమయంలో తీసుకోవాల్సి ఆహారం ప్రత్యేకంగా ఉండదు కానీ కొంతమంది మిరియాల కషాయం, చికెన్‌ పులుసు, మషాలా సూపు వంటివి తీసుకుంటారు. వీటితో ముక్కు తెరుచుకున్నట్లయి హాయిగా ఉంటుంది. ఈ సమయంలో ద్రవాహారం, విశ్రాంతి ఈ రెండూ ముఖ్యం. ఇలా చేస్తే నాలుగైదు రోజులో జలుబు పూర్తిగా తగ్గిపోతుంది.
ఇక చాలా మందిలో జలుబు ముదిరి పైనుసైటిస్‌, చిన్నప్లిల్లలలో చెవిపోటు వంటి సమస్యలు రావచ్చు. ప్రారంభ దశలో అవసరం లేకపోయినా రెండు మూడు రోజుల తర్వాత ముక్కు స్రావాలు పసుపు లేదా ఆకుపచ్చగా వస్తుండటం తలభారం ఉంటే వైద్యుల సలహా మేరకు అమోక్సిలిన్‌, అజిత్రోమైసిన్‌, సెఫలెక్సిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ వాడితే తగ్గిపోతుంది. చాలామంది జలుబు రాగానే యాంటీ బయాటిక్స్‌ మొదలు పెడతారు. అది అవసరంలేదు. ముక్కు నుంచి నీరులాంటి స్రావం కారుతున్న తొలిదశలో యాంటీబయాటిక్స్‌ అవసరం అసలుండదు. స్రావాలు రంగు మారితే అప్పుడు వైద్యుల పర్వవేక్షణలో యాంటీబయాటిక్స్‌ వాడటం మంచిది.
చాలా మందిలో జలుబు తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తుంది. ద్రవాలు పచ్చరంగులోకి మారి, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటివి రావచ్చు. వీరికి వైద్యుల సలహా మేరకు యాంటి బయాటిక్స్‌ వాడవలసి ఉంటుంది.
ప్రతి సీజన్లోనూ ఈ వైరస్‌ లక్షణాలు మారిపోతుంటాయి కాబట్టి ఇది రాకుండా చూసే టీకాలేం లేవు.