డెంగ్యూ అనేది ఎయిడెస్ ఈజిఫ్లై అనే జాతి దోమ కాటువల్ల మానవ శరీరంలో ప్రవేశించే వైరస్ వలన వచ్చే జ్వరం. తీవ్ర జ్వరం వలన కొన్ని సందర్భాలలో రక్తస్రావం, షాక్, రక్తపోటు పడిపోవటం వంటి క్షణాలతో మరణం సంభవించవచ్చు.
ఎప్పుడు వస్తుంది : సంవత్సరంలో ఏ సమయంలో అయినా డెంగ్యూ జ్వరం రావచ్చు. కాని వర్షాకాలంలో (ఆగష్టు-అక్టోబర్) అధికంగా కనిపిస్తుంది. వర్షాలు వెనుక పడిన తర్వాత కాలమైన సెప్టెంబర్-అక్టోబర్‌లలో రక్తస్రావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.
ఎలా వస్తుంది : ఎయిడెస్ ఈజిఫ్లై అనే దోమకాటు వలన ఒకరినుండి మరొకరికి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ జాతి దోమ మీద ఉండే నలుపు, తెలుపు చారవల్ల దీనిని టైగర్ దోమ అనికూడా పిలుస్తారు.
ఎయిడెస్ దోమ గురించి : ఈ జాతి దోమ మన ఇంటి పరిసరాలోనే నివసిస్తుందని తెలుసుకోండి. పూల కుండీలు, ఎయిర్‌కూలర్స్, పాత టైర్లు, పాత ఖాళీ డబ్బాలు వంటి వాటిలో చేరే నీరు ఈ దోమలకు అనుకూలం. మన పరిసరాలు అపరిశుభ్రంగాపెట్టుకుని డెంగ్యూకి అవసరమైన పరిస్థితులు మనమే కల్పిస్తాం.
గమనించాల్సిన మరో విషయం ఈ జాతి దోమలు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో తిరుగుతాయి. కాని మిగిలిన దోమలలా రాత్రిపూట కాదు. కాబట్టి ఆ సమయాలో మనల్ని మనం దోమకాటు నుండి రక్షించుకోవాలి.
డెంగ్యూ ఎవరికి వస్తుంది ? పసిపిల్ల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారికి డెంగ్యూ వస్తుంది. అడవులలో ఉండే గిరిజనుల నుండి మహానగరాలోని నాగరికుల వరకు అందరికీ వస్తుంది. బహిరంగ ప్రదేశాలో పనిచేసేవారికి ఇది వచ్చే అవకాశం మరింత ఎక్కువ. జీవితకాలంలో మొత్తం నాలుగు సార్లు డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశముంది. నాలుగు రకాల సెరో తరహా వైరస్ లు ఉండటమే దీనికి కారణం. మొదటిసారి కన్నా ఆ తర్వాత వచ్చే ప్రతి సారీ జ్వరతీవ్రత మరింతగా పెరుతుంటుంది. ఉష్ణ ప్రకృతి ఉన్నవారిలో ఈ రోగ తీవ్రత, సమస్యు అధికంగా కనిపిస్తాయి.
జ్వర క్షణాలేమిటి ? 101 నుండి 105 డిగ్రీల జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్ర తలనొప్పి, నడుము కిందిభాగంలో తీవ్రనొప్పి, కళ్ళు మండటం వంటి క్షణాలు వస్తాయి. ఈ జ్వరం వచ్చినవారు తీవ్రవమైన ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదరభాగం వైపున నొప్పి వస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినపుడు రోగికి తీవ్రంగా నీరసం, కూర్చుంటున్నా నిలుచుంటున్నా తల తిరుగుడు, ముక్కు నుండి రక్తం రావటం, నల్లని మలం వస్తాయి. దోమ కుడితే ఏర్పడేటటువంటి ఎర్రని చుక్కవంటివి ఏర్పడుతాయి. (రక్తం చర్మం లోపకి రక్తబిందువు కనిపిస్తాయి.)
డెంగ్యూ అని ఎలా తెలుస్తుంది ? డెంగ్యూ జ్వరం ప్రత్యేక లక్షణాతో ఆ జ్వరమని అనుమానించగా రక్తపరీక్షలో తక్కువ సంఖ్యలో తెల్ల రక్తకణాలు, తక్కువ స్థాయిలో ప్లేట్‌లెట్స్, బ్లడ్ స్మియర్ మీద ఎటిపికల్ సెల్స్‌తో ధృవీకరించబడుతుంది. ఎన్. ఎస్ యాంటిజన్ మరియు యాంటీ డెంగ్యూ యాంటీ బాడీస్ IGM తో రోగ నిర్థారణ చేయవచ్చు
డెంగ్యూ ప్రాణాంతకమా ? అవును, డెంగ్యూతో పాటు రక్తస్రావం (డెంగ్యూ హెమరేజ్ ఫివర్ డి.హెచ్.ఎఫ్) లేదా రక్తపోటు అతి తక్కువకు పడిపోవడం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (డి.హెచ్.ఎస్.ఎస్ లు) కనిపిస్తే ప్రాణాంతకమే. అయితే అంత తీవ్రస్థాలో డెంగ్యూ వచ్చేవారు 5 శాతానికి అటు ఇటుగా ఉంటారు 95 శాతం మందికి ప్రాణాంతకం కాదు.
డెంగ్యూకి చికిత్స ఖర్చుతో కూడినదా ? అధిక కేసుల్లో అది ఖర్చుతో కూడిన చికిత్స కాదు కాని బ్లడ్ ప్లేట్‌లెట్స్ 10,000 స్థాయికి పడిపోయినా (సాధారణంగా 1.5 నుండి 4.5 లక్షలుంటాయి) లేక తీవ్ర రక్తస్రావం వున్నా ఇచ్చే సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్ (ఎస్.డి.పి) లేదా యాంటీ ఆర్.హెచ్.డి ఇంజక్షన్స్ మాత్రమే ఖరీదైనవి. 95 శాతం మంది రోగులకు రక్తపోటును గమనించటం, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వటం చేస్తారు కాబట్టి అంత ఖరీదుతో కూడినవి కావు.
చికిత్సా విధానం : డెంగ్యూ జ్వర చికిత్సకంటూ ప్రత్యేకంగా మందులు లేనందున చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో
ఉంటుంది. రోగుకు నోటిద్వారా లేదా రక్తనాళాల ద్వారా ద్రవాలను ఎక్కిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్‌లేట్స్ ఎక్కిస్తారు. (ప్లేట్‌లెట్స్ సంఖ్య 10,000 కన్నా పడిపోయినా లేదా తీవ్ర రక్తస్రావం వున్నా) లేదా రక్తం లేదా ఇంట్రావీనస్ కొల్లాయిడ్స్ ఎక్కిస్తారు. జ్వరం మరింత తీవ్రమైనపుడు సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్‌ని, యాంటీ ఆర్.హెచ్.డి ఇంజక్షన్ ఇస్తారు. స్టీరాయిడ్ ఇంజక్షన్ వల్ల ఎటువంటి లాభం వుందని నిరూపణ కాలేదు. పైగా అవి ప్రమాదకరం. అవసరం లేకున్నా ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించడం పి.ఆర్.పి కూడా రోగికి చెరుపు చేస్తాయి.
రోగిని ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి ? డెంగ్యూ జ్వరపీడితులకు రక్తపోటు బాగా పడిపోయినా, తీవ్రంగా వాంతులు చేసుకుంటూ నోటి ద్వారా ద్రవాలు తీసుకోవంట కష్టంగా వున్నా లేదా ప్లేట్‌లెట్స్ సంఖ్య 50,000 కన్నా తక్కువస్థాయికి పడిపోయినా ఆసుపత్రిలో చేర్చాల్సి వుంటుంది.
ఇంటెన్సివ్ కేర్ (ఐ సి యూ) అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది ? ప్లేట్‌లెట్స్ కౌంట్ 30,000 కన్నా తగ్గినా, తీవ్రరక్తస్రావం అవుతున్నా, ఏదైనా ఒక అంగం సక్రమంగా పనిచేయక పోతున్నా రోగిని ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చాల్సి వస్తుంది.
రోగి ఆసుపత్రిలో ఎంతకాలం ఉండాలి ? రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య క్రమంగా పెరిగే వరకు రోగి ఆస్పత్రిలో వుండాలి. జ్వరం తగ్గిన తర్వాత 48 నుండి 72 గంటలు రోగిని పరిశీలనలో వుంచి, ప్లేట్‌లెట్స్ సంఖ్య 50 వేలు, ఆపైన చేరిన తర్వాత డిశ్చార్జి చేస్తారు.
డెంగ్యూ రాకుండా నిరోధించ వచ్చా? మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవటం ద్వారా, దోమకాటుకు గురి కాకుండా చూసుకోవటం ద్వారా నిరోధించవచ్చు. ఈ జ్వరానికి టీకా మందు లేదు.
జాగ్రత్తలు : డెంగ్యూ జ్వర లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్య పరీక్ష చేయించుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. పళ్ళరసాలు లేదా కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ కలుపుకుని తీసుకోవాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రాత్రిపూట బాగా నిద్రపోవాలి. దోమతెరలను, దోమలను పారద్రోలే రసాయనాలను వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని నిలువనీరు లేకుండా చూసుకోవాలి