header

Typhoid……….టైఫాయడ్‌ జ్వరం

Dr. M.V. Rao, Yesoda Hospital..Somajiguda, Hyderabada సౌజన్యంతో...
టైఫాయిడ్‌ జ్వరం మన దేశంలో చాలా సాధారణం. ఇది సల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఇప్పటికే ఇది ఉన్న వ్యక్తి మలంతో కలుషితమైన నీరు, ఆహారం తీసుకొనటం ద్వారా, టైఫాయిడ్‌ ఒకరి నుండి మరొకరికి వస్తుంది. కొందరిలో జ్వరం ఉండదు గానీ, ఈ బ్యాక్టీరియా వాళ్ళ పొట్టలో ఉండి వారి మలంలో కలుషితమైనపుడు ఇతరులకు వ్యాపిస్తూ ఉంటుంది. సరైన పారిశుధ్యం లేకపోవటం మల విసర్జనకు వెళ్ళిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవకపోవటం వంటివన్నీ దీని వ్యాప్తికి ముఖ్య కారణం.
హోటళ్ళలో పనిచేసే వారు, అన్నం వండేవాళ్ళు, వడ్డించే వారు వీరంతా శుభ్రంగా ఉండటం పారిశుధ్యంలో భాగమే.
aక్షణాలు : జ్వరం సాధారణంగా తక్కువ స్థాయిలో ప్రారంభమై, క్రమేపీ రోజు రోజుకూ పెరుగుతుంది. అన్న హితవు లేకపోవటం, వాంతులు వంటివి వేధిస్తుంటాయి. రోగిని చూడగానే బాగా జబ్బు పడినట్లుంటారు. బాగా నీరసపడి పోతారు. సరైన చికిత్స ఇవ్వకపోతే వారాలు గడుస్తున్నా జ్వరం తగ్గదు. రెండు వారాల తర్వాత కొందరికి విరేచనాలు కావచ్చు. రెండు వారాల పాటు సరైన చికిత్స ఇవ్వకపోతే జ్వరం బాగా ముదిరి పేగులకు రంధ్రం పడి లోలోపలే రక్తస్రావం కావచ్చు. బి పి పడిపోవటం, నాడి పడిపోవటం, వంటి లక్షణాతో షాక్‌లోకి వెళ్ళవచ్చు. టైఫాయిడ్‌ ను సకాలంలో గుర్తించక పోతే, ఇన్‌ఫెక్షన్‌ రోగి రక్తంలో చేరి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మన దేశంలో జ్వరం రాగానే చాలా మంది వైడాల్‌ పరీక్ష చేయించి ఇందులో పాజిటివ్‌ వస్తే టైఫాయిడ్‌ అనుకుంటారు.కానీ ఇది పూర్తిగా నమ్మదగ్గ పరీక్ష కాదు. జ్వరం ఆరంభమైన 3వ వారానికి దీంతో కొంత ఉపయోగం ఉండొచ్చు గానీ అప్పటి వరకూ చికిత్స ఇవ్వకుండా ఉంటే ప్రమాదం.
టైఫాయిడ్‌కు మొదటి వారంలో రక్తం కల్చర్‌ పరీక్ష చేస్తే చాలావరకూ తెలుస్తుంది. ఇందులో కూడా 40-80 శాతం పాజిటివ్‌ కాకపోవచ్చు కాబట్టి లక్షణాను బట్టి చికిత్స ఆరంభిస్తారు. వారం తర్వాత స్మానెల్లా ఐ జి యం యాంటీబోడీ పరీక్ష చేస్తే 70 శాతం వరకూ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక 2,3 వారాల్లో మాత్రం,మలం కల్చర్‌ పరీక్ష చేస్తే అందులో ఖచ్చితంగా తెలుస్తుంది. మొత్తానికి లక్షణాల ఆధారంగా ముందు మందులు మొదలు పెట్టటం ప్రధానం.
జ్వరం బాగా ఉన్నప్పుడు కొందరికి పలవరింతలు రావచ్చు. చాలామందికి తెల్ల రక్తకణాల సంఖ్య పెరగక పోవచ్చు. పైగా తగ్గే అవకాశం ఉంది. ప్లేట్‌లెట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది గానీ డెంగీ జ్వరంలో అంత ఎక్కువగా అంటే లక్ష కంటే తగ్గటం అరుదు. టైఫాయిడ్‌ జ్వరంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ద్రవాహారం ఎక్కువగా ఇవ్వాలి. రెండు మూడు వారాలు మొత్తగా ఇవ్వాలి. జ్వరం తీవ్రత తగ్గడానికి ప్యారాసెట్‌మల్‌ బిళ్ళలతో పాటు ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ (మనదేశంలో సెఫ్ట్రియాక్సోన్‌ వంటి మూడోతరం సెఫలోస్ఫోరిన్లు) ఇస్తారు. వీటిని పూర్తి కోర్సు వాడాలి.వీటితో జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. టైఫాయిడ్‌ రాకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. టీకాలు తీసుకోవచ్చు.