header

Fits…..మూర్ఛ....

Fits…..మూర్ఛ....
Dr.G.V. Subbaiah Chowdary, Nuerologist, Star Hospotals,
Banjara Hills, Hyderabad.... సౌజన్యంతో

మూర్ఛ, ఫిట్‌.. ఈ పేర్లు వింటేనే చాలామంది బెంబేలెత్తి పోతుంటారు. ‘నాకే ఎందుకొచ్చింది? పూర్వ జన్మలో ఏం పాపం చేశానో.. ఏమో? ఎవరి శాపమో?’ అని బాధపడేవారు కొందరైతే.. ‘మున్ముందు జీవితం ఎలా గడుస్తుందో? బయటకు తెలిస్తే ఉద్యోగం దొరుకుతుందో లేదో?’ అని అనుక్షణం మథనపడేవారు మరికొందరు. ఇలాంటి భయాలకు, ఆందోళనలకు ప్రధాన కారణం మూర్ఛ బాధితుల పట్ల మన సమాజంలో నెలకొన్న వివక్ష.
అన్ని జబ్బుల్లాగానే ఇదీ ఒక సమస్యేనని, మూర్ఛ బారినపడ్డా జీవితానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. అన్ని పనులూ చక్కగా చేసుకోవచ్చని తెలుసుకోలేకపోవటం. అందరిలా చదువుకోవచ్చు, అందరిలా ఉద్యోగాలు చేసుకోవచ్చు, అందరిలా పెళ్లిళ్లు చేసుకోవచ్చు, సంతానాన్ని కనొచ్చని గ్రహించలేకపోవటం. ఇప్పుడు వైద్య పరిశోధనా రంగం ఎంతో పురోగమించిది. మూర్ఛకు మూలం తెలుసుకోవటం దగ్గర్నుంచి.. దాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచే ఎన్నెన్నో మందులను మనకు అందించింది.
వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటే సమస్యను చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మందులు పనిచేయకపోతే సర్జరీ మార్గమూ లేకపోలేదు. కానీ విషాదమేంటంటే- మన ఆలోచనా ధోరణి మారకపోవటం. మూర్ఛ మీద నెలకొన్న అపోహలను, అనుమానాలను ఇంకా మనం పూర్తిగా తొలగించుకోలేకపోతున్నాం. మూర్ఛ మీద విజయం సాధించటంలో ఇదే పెద్ద అవరోధంగా నిలుస్తోంది. దీన్ని చేధించగలిగితే సగం విజయం సాధించినట్టే. అప్పుడు మిగతా విజయం దానంతటదే దక్కుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి మూర్ఛ, ఫిట్‌, సీజర్స్‌, ఎపిలెప్సీ.. విషయంలో సరైన అవగాహన కలిగుండటం చాలా అవసరం.
నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు
ఫిట్స్‌తో బాధపడేవారు పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం తగదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా అపోహే. ఫిట్స్‌తో బాధపడుతున్నా నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా మందులు వాడుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అందరిలా హాయిగా జీవించొచ్చు, సంతానాన్ని కనొచ్చు. అయితే చిన్నప్పట్నుంచే ఫిట్స్‌తో బాధపడుతుంటే ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేయటం మాత్రం మంచిది కాదు. మనదేశంలో.. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలామంది ఫిట్స్‌ వస్తున్న సంగతిని దాచి పెట్టి పెళ్లి చేస్తుంటారు. దీంతో మున్ముందు చిక్కులు ఎదురవ్వొచ్చు. కాబట్టి అన్ని విషయాలను ముందుగానే మాట్లాడుకోవాలి. మూర్ఛ నిపుణులతో చర్చించగలిగితే ఇంకా మంచిది. కొందరైతే మూర్ఛకు విరుగుడు పెళ్లి అనీ భావిస్తుంటారు. ఇదీ తప్పే. మూర్ఛకు మందు పెళ్లీ కాదు.. పెళ్లికి మూర్ఛ అడ్డంకీ కాదు. తల్లిదండ్రులకు ఫిట్స్‌ ఉన్నా కూడా వారి ద్వారా పిల్లలకు వచ్చే అవకాశం చాలా తక్కువేనన్న విషయాన్నీ అంతా గుర్తించాలి.
గర్భం ధరించినపుడు జాగ్రత్త అవసరం
ఫిట్స్‌తో బాధపడే మహిళలు గర్భం ధరించినపుడు ఒకింత జాగ్రత్తగా ఉండటం మంచిది. గర్భం ధరించినపుడు ఒంట్లో ద్రవాల మోతాదులు పెరుగుతాయి. వేవిళ్లు, వాంతులతో నీరసం ముంచుకొస్తుంటుంది. దీంతో ఫిట్స్‌ వచ్చే అవకాశమూ పెరుగుతుంది. ఫిట్స్‌ మూలంగా చాలామంది అప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంటారు. దీనికి గర్భధారణ కూడా తోడైతే మరింత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది నిద్రలేమికి దారితీస్తుంటుంది. ఇది కూడా ఫిట్స్‌ వచ్చే అవకాశం పెరగటానికి దోహదం చేయొచ్చు. రకరకాల అపోహలతో కొందరు గర్భిణులు మందులు వేసుకోవటం మానేస్తుంటారు. ఇది సమస్య మరింత పెరిగేలా చేస్తుంది. నిజానికి కొన్నిసార్లు గర్భిణుల్లో ఫిట్స్‌ మందుల మోతాదులను పెంచాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ల సలహా తీసుకోకుండా మందులను మానెయ్యటం తగదు. ఈ విషయాన్ని ఆడపిల్లలకు చిన్నప్పట్నుంచే అర్థమయ్యేలా వివరించటం మంచిది.
మందులు వేసుకుంటే కడుపులో బిడ్డ మీద దుష్ప్రభావం పడుతుందని కొందరు గర్భిణులు భావిస్తుంటారు. నిజానికి మందులు వేసుకోవటం తలెత్తే అనర్థం కన్నా వేసుకోకపోవటం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ. గర్భధారణ సమయంలో ఫిట్స్‌ వస్తే పిండం మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. కాబట్టి సరైన మోతాదులో మందులను వేసుకోవటం చాలా కీలకం. ఇప్పుడు మరింత సురక్షితమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఒక మందు సరిపోతే మంచిదే. లేకపోతే రెండో మందు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫోలిక్‌ యాసిడ్‌ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పుట్టుకతో వచ్చే లోపాలను చాలావరకు నివారించుకోవచ్చు.
కాళ్లు చేతులు కొట్టుకోవాలనేమీ లేదు
కాళ్లూ చేతులు కొట్టుకుంటేనే ఫిట్‌ వచ్చినట్టనేది మరో అపోహ. నిజానికి మెదడులో ఎక్కడ విద్యుత్‌ ప్రచోదనాలు అస్తవ్యస్తమయ్యాయనే దాన్ని బట్టి ఫిట్‌ లక్షణాలు కనబడుతుంటాయి. మెదడు మొత్తమంతా విద్యుత్‌ సంక్షోభం తలెత్తితే కాళ్లూ చేతులు కొట్టుకుంటుంటారు. దీన్నే జనరలైజ్డ్‌ సీజర్స్‌ అంటారు. కొందరు స్పృహ తప్పిపోవటం, రెప్పలు వాల్చకుండా అలాగే చూస్తుండటం (అబ్‌సాన్స్‌ సీజర్స్‌) చేస్తుంటారు. కొందరు కాళ్లూ చేతులను ఉలిక్కిపడినట్లు కదిలిస్తుంటారు (మయోక్లోనిక్‌ సీజర్స్‌) కూడా. కొందరికి మెదడులో ఒక భాగంలోనే విద్యుత్‌ ప్రచోదనాలు అస్తవ్యస్తం కావొచ్చు. దీన్నే ఫోకల్‌ సీజర్స్‌ అంటారు. మెదడులో ఏ ప్రాంతంలో విద్యుత్‌ ప్రచోదనాలు అస్తవ్యస్తమైతే ఆ ప్రాంతం నియంత్రణలో ఉండే శరీర భాగాలు ప్రభావితమవుతాయి. మెదడులో కుడి భాగంలో విద్యుత్‌ ప్రచోదనాలు అస్తవ్యస్తమైతే ఎడమ కాలు, ఎడమ చెయ్యి కొట్టుకోవచ్చు. లేదూ కొన్నిసార్లు పెదవులు చప్పరించటం, నిస్తేజంగా నిశ్చలంగా అలాగే చూస్తూ ఉండిపోవచ్చు కూడా. ఒకోసారి చేయి మెలి తిరిగినట్టూ కావొచ్చు. కొందరికి ఫోకల్‌ సీజర్స్‌ మెదడులో ఒక భాగంలో మొదలై మెదడంతా విస్తరించొచ్చు. అప్పుడు రెండు వైపులా కాళ్లు, చేతులు కొట్టుకోవచ్చు కూడా. ముందుగానూ తెలుస్తుండొచ్చు
ఫట్స్‌ ఉన్నఫళంగా వస్తాయని, ముందుగా ఏమీ తెలియదని అనుకుంటుంటారు. నిజానికి ఫోకల్‌ రకం సీజర్స్‌ అయితే ముందుగానే ఆ విషయం తెలుస్తుంటుంది కూడా. మెదడులో టెంపోరల్‌ లంబికలో విద్యుత్‌ స్పందనలు అస్తవ్యస్తమైతే ఫిట్‌ రావటానికి ముందు కడుపులో తిప్పుతున్నట్టుగా, వికారంగా అనిపిస్తుంది. పెరైటల్‌ లంబికలో సమస్య మొదలైతే తిమ్మిర్లు.. ఫ్రాంటల్‌ లంబికలో సమస్య మొదలైతే ఉలిక్కిపడినట్టుగా కాళ్లు, చేతులు కదలొచ్చు. ఆక్సిపిటల్‌ లంబికలో విద్యుత్‌ ప్రచోదనాలు అస్తవ్యస్తమైతే కళ్ల ముందు ఏవేవో దృశ్యాలు, మెరుపులు కనబడుతుండొచ్చు. అనంతరం కాళ్లూ చేతులు కొట్టుకోవటం, స్పృహ తప్పటం వంటివి జరగొచ్చు. అయితే కొందరికి తొలి దశ లక్షణాలతోనే ఫిట్‌ ఆగిపోవచ్చు కూడా. అంటే కడుపులో తిప్పటం, కళ్ల ముందు మెరుపులు, తలనొప్పి వంటి వాటికే పరిమితం కావొచ్చన్నమాట. శాపం కాదు.. పాపం కాదు!
ఫిట్స్‌ ప్రస్తావన రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే కనబడుతోంది. ఏదో పాపం చేయటం వల్లనో, దేవుడు శపించటం వల్లనో, గాలి-దయ్యం సోకటం వల్లనో మూర్ఛ వస్తుందని అప్పట్లో అనుకునేవారు. అలనాటి భావాలు, అభిప్రాయాలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తుండటం విచారకరం. నిజానికి ఫిట్స్‌కు మూలం మెదడులో హఠాత్తుగా, అసహజంగా విద్యుత్‌ ప్రచోదనాలు పెరిగిపోవటం. దీన్ని హిపోక్రేట్స్‌ 5వ శతాబ్దంలోనే అనుమానించారు. అయితే 17వ శతాబ్దం వరకూ ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మన మెదడులోని నాడీ కణాలు నిరంతరం ఒకదాంతో మరోటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. ఇది విద్యుత్‌ ప్రచోదనాల రూపంలోనే ప్రసారమవుతుంటుంది. ఇవి ఒక కణం నుంచి మరో కణానికి క్రమంగా, ఒక పద్ధతి ప్రకారం ప్రవహిస్తూ.. సమాచారాన్ని చేరవేస్తుంటాయి. మెదడులో ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ విద్యుత్‌ ప్రచోదనాలు ఉన్నట్టుండి పెరిగిపోతే ఆ భాగమంతా అస్తవ్యస్తమవుతుంది. దీంతో ఆయా భాగాల నియంత్రణలో ఉండే అవయవాలు విపరీతంగా స్పందిస్తాయి. కాళ్లూ చేతులు వేగంగా కొట్టుకోవటం, స్పృహ తప్పిపోవటం వంటివి సంభవిస్తాయి. ఇదే ఫిట్‌. జన్యుపరంగా పుట్టుకతో మెదడు నిర్మాణంలో లోపాలు, కాన్పు సమయంలో బిడ్డ మెదడు దెబ్బతినటం, మెదడులో కణితులు, ప్రమాదాల్లో మెదడు దెబ్బతినటం, పక్షవాతం వంటి కారణాలెన్నో దీనికి దోహదం చేస్తాయి. అయితే 60-70% మందిలో ఎలాంటి కారణం లేకుండానూ ఫిట్స్‌ రావొచ్చు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాలనేమీ లేదు
తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఫిట్స్‌ ఉంటే పిల్లలకు కచ్చితంగా వస్తుందని అనుకోవటం కూడా పొరపాటే. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే ఇలా జరగొచ్చు. అదీ కొన్నిరకాల ఫిట్స్‌లోనే జరగొచ్చు. ప్రమాదాలు, పక్షవాతం మూలంగా మెదడు దెబ్బతినటం వల్ల తలెత్తే ఫిట్స్‌ పిల్లలకు వచ్చే అవకాశమే లేదు. జన్యుపరమైన కారణాలతో మొదలయ్యే ఫిట్స్‌ పిల్లలకు రావొచ్చు గానీ అదీ అంత ఎక్కువేమీ కాదు. జన్యుపరమైన కారణాలకు పర్యావరణ అంశాలు తోడైనప్పుడే సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. చదువులకు, ఉద్యోగాలకు అడ్డంకి కాదు
ఫిట్స్‌ బాధితులు ఉద్యోగాలకు పనికిరారని, సరిగా పనిచేయలేరని అనుకోవటం పెద్ద అపోహ. ఫిట్స్‌తో బాధపడుతున్నా కూడా ఎంతోమంది ఉద్యోగాల్లో, పనుల్లో రాణించటం చూస్తూనే ఉన్నాం. చరిత్ర కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. జూలియస్‌ సీజర్‌, అలెగ్జాండర్‌, నెపోలియన్‌, న్యూటన్‌ వంటి ప్రముఖులూ ఫిట్స్‌తో బాధపడ్డవారే కావటం గమనార్హం. వృత్తి నైపుణ్యాలకు ఫిట్స్‌ అడ్డం కాదనే విషయాన్ని వీరి విజయాలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే పుట్టుకతోనే మెదడు నిర్మాణంలో లోపాలు, ప్రమాదాల్లో గాయపడటం వల్ల మెదడు బాగా దెబ్బతినిపోవటం వంటి కారణాలతో ఫిట్స్‌ వచ్చేవారు మాత్రం కొన్ని పనులు సరిగా చేయకపోవచ్చు. మిగతా వాళ్లంతా అన్ని పనులు బాగానే చేసుకుంటారు. కాకపోతే కొందరు పిల్లలకు ఫిట్స్‌ మందులతో ఒకింత మగతగా అనిపించొచ్చు. దీంతో చదువులపై అంతగా దృష్టి పెట్టకపోవచ్చు. చేతిలో తాళాలు పెట్టొద్దు
ఫిట్స్‌ వచ్చినపుడు చేతుల్లో తాళాల వంటివి పెట్టటం వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు. అలాగే కాళ్లూ చేతులు కొట్టుకుంటుంటే ఆపటానికి గట్టిగా పట్టుకోవటమూ తగదు. దీంతో గాయాలు కావొచ్చు. భుజం, తుంటి కీళ్లు జారిపోయే ప్రమాదమూ ఉంది. నోట్లో నీళ్లు పోయటం అసలే చేయకూడదు. నీళ్లు గొంతులోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ప్రాణాలకే ముప్పు రావొచ్చు. కాల్చటం, వాతలు పెట్టటంతో ఎలాంటి ప్రయోజనం లేదు. ఎవరికైనా ఫిట్‌ వచ్చినపుడు ముందుగా ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. చుట్టుపక్కల పదునైన వస్తువుల వంటివేవీ లేకుండా చూసుకోవాలి. గాలి బాగా ఆడేలా చూడాలి. మెడ వద్ద బిగుసుకుపోకుండా గుండీలు, టై వదులు చేయాలి. కాళ్లు చేతులు కొట్టుకోవటం ఐదు నిమిషాలైనా తగ్గకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఒకసారి ఫిట్‌ వచ్చి తగ్గిపోయి.. స్పృహలోకి రాకుండానే మళ్లీ ఫిట్‌ వచ్చినా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. మందులతో మంచి ఫలితం
మందులు వేసుకున్నా ఫిట్స్‌ తగ్గవనుకోవటం పెద్ద అపోహ. సుమారు 70% మందికి మందులతో ఫిట్స్‌ నియంత్రణలోకి వస్తాయి. కొందరికి రెండు మందులు కూడా అవసరపడొచ్చు. అయినా కూడా కొందరికి ఫిట్స్‌ వస్తుండొచ్చు. అందుకేనేమో మందులు పనిచేయవని పొరపడుతుంటారు. ఇలా మందులు పనిచేయకపోవటానికి కారణం అసలు అది ఫిట్‌ కాకపోవచ్చు. లేదూ ఒకరకం ఫిట్‌ మందులను మరో రకం ఫిట్‌కు వాడటం కావొచ్చు. స్పృహ తప్పి పడిపోయినంత మాత్రాన దాన్ని ఫిట్‌ అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకోసారి మెదడుకు తగినంత రక్తసరఫరా అందక పోవటం వల్ల తలెత్తే సింకోప్‌ వంటి సమస్యల్లోనూ ఇలా జరగొచ్చు. ఇక ఫోకల్‌ సీజర్స్‌లో వాడుకోవాల్సిన మందులను జనరలైజ్డ్‌ సీజర్స్‌లో వాడితే ఫిట్స్‌ తగ్గకపోగా మరింత పెరగొచ్చు కూడా. మందులను తగినంత మోతాదులో వేసుకోకపోయినా ఫిట్స్‌ వస్తుండొచ్చు. ఇతరత్రా సమస్యలకు వేసుకునే మందులు కూడా ఫిట్స్‌ మందుల సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చు. ఫలితంగా ఫిట్స్‌ నియంత్రణలోకి రాకపోవచ్చు.
మానసిక సమస్య కానే కాదు
కొందరు మూర్ఛను మానసిక సమస్యగా భావిస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. మెదడులో విద్యుత్‌ ప్రచోదనాలు అస్తవ్యస్తం కావటం మూర్ఛకు దారితీస్తుంది. కాకపోతే వీరికి ఇతరత్రా మానసిక సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఫిట్స్‌ బాధితులు సహజంగానే మానసికంగా ఒత్తిడిలో ఉంటుంటారు. ‘నాకే ఫిట్స్‌ ఎందుకు వస్తున్నాయి? భవిష్యత్తు ఎలా? పెళ్లి అవుతుందా.. లేదా? ఒకవేళ పెళ్లయ్యాక బయటపడితే? ఆఫీసులో పై అధికారులకు తెలిస్తే ఏమవుతుంది?’ ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఇది కుంగుబాటు, ఆందోళన, చేసిందే మళ్లీ చేయటం వంటి సమస్యల ముప్పు పెరగటానికి దారితీస్తుంది. ఏ వయసులోనైనా రావొచ్చు
ఫిట్స్‌ చిన్నవయసులోనే వస్తాయనుకోవటం పెద్ద పొరపాటు. ఇది ఏ వయసులోనైనా రావొచ్చు. ఎవరికైనా రావొచ్చు. ఎప్పుడైనా రావొచ్చు. ప్రపంచంలో అతి ఎక్కువగా కనబడే నాడీ సమస్యల్లో మూర్ఛదే రెండో స్థానం. ప్రతి వెయ్యిమందిలో 5-9 మందికి ఫిట్స్‌ వచ్చే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 కోట్ల మంది ఫిట్స్‌తో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 80% మంది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే కావటం గమనార్హం. మనదేశంలో 1.2 కోట్ల మంది మూర్ఛ బాధితులు ఉన్నారని అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లల్లో మెదడులో లోపాలు, పెద్దవారిలో పక్షవాతం వంటి సమస్యలు ఫిట్స్‌కు కారణమవుతుంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మెదడులో ఇన్‌ఫెక్షన్లు, ప్రమాదాలు దీనికి ఎక్కువగా దోహదం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువ. మొండి మూర్ఛకు సర్జరీ మార్గం
సరైన మందులను, సరైన మోతాదులో వేసుకుంటున్నా సుమారు 30% మందికి ఫిట్స్‌ తగ్గకుండా వేధిస్తుంటాయి. ఇలాంటివారికి సర్జరీతో సమస్య చాలావరకు కుదురుకుంటుంది. ఇందులో ఫిట్‌ ఎక్కడ మొదలవుతుందో గుర్తించి ఆ భాగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. చాలాకాలంగా ఫిట్స్‌తో బాధపడేవారిలో ఆ భాగం చేసే పనులను వేరే భాగాలు చేపడతాయి. అందువల్ల మెదడులో కొంత భాగాన్ని తొలగించినా ఇబ్బందేమీ ఉండదు. వాహనాలు నడపటంలో జాగ్రత్త
మూర్ఛ బాధితుల్లో కొందరు ‘ఫిట్‌ ఇప్పుడొస్తుందా ఏం?’ అనుకుంటూ వాహనాలు నడిపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఫిట్స్‌ అదుపులో లేనివారు వాహనాల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. అలాగే మందుల మోతాదు తగ్గించే సమయంలో, మందులను మార్చే సమయంలోనూ వాహనాలు నడపకూడదు. మందులతో సమస్య అదుపులోకి వచ్చి.. ఏడాది దాటినా తిరిగి ఫిట్స్‌ రానివాళ్లు మాత్రం డాక్టర్ల సలహా మేరకు వాహనాలు నడపొచ్చు. కొంతకాలం మందులు వాడితే సరిపోతుందని, జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అవసరం లేదన్నది మరికొందరి అపోహ. ఇది సరికాదు. ఫిట్స్‌కు రకరకాల కారణాలు దీనికి దోహదం చేస్తుంటాయి. కాబట్టి ఎంతకాలం మందులు వాడుకోవాలనేది ఫిట్స్‌ రకాలను బట్టి ఆధారపడి ఉంటుంది.