header

Foot Problems / పాదాల సమస్యలు

Foot Problems / పాదాల సమస్యలు
డాక్టర్ కె.సుధీర్రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్

ఆధారం : ఈనాడు సుఖీభవ

పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే...
పాదరక్షల ఎంపికలో మొదట రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోడునే ఇవ్వమని చెప్పాలి. మనం తొడుక్కునే షూస్ పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. అలా ఖాళీ ఉందో లేదో నొక్కి చూసుకోవాలి. పాదంలో వెడల్పులగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా షూ ఉండాలి. ఈమధ్య చాలామంది పొట్టిగా ఉండే ‘షార్ట్ సాక్స్’ తొడుగుతున్నారు. అవి కాలిని బాగా బిగుతుగా మడిచినట్లుగా చేసే టైట్ షూ అంత ప్రమాదకరం. సాక్స్ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది.
డయాబెటిస్ ఉన్నవారు పాదాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
మిగతావారితో పోలిస్తే డయాబెటిస్తో బాధపడేవారు పాదాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. అందునా ఐదు నుంచి పదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నవారు తమ కాళ్లను ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. వారు పాదాల పరిరక్షణ కోసం పాటించాల్సిన సూచనలివి...
తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండాలి. పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్ని కూడా నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. అది భవిష్యత్తులో కాలిని తొలగించేంత ప్రమాదకరంగా కూడా మారేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పొక్కు చిన్నగా ఉన్నప్పుడే పూర్తిగా మానిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి.
కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి.
వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్తో కాళ్లకు కాపడం పెట్టుకోక పోవడమే మంచిది.
పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి.
కాళ్లమీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా అవసరం.
కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరుమూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో ప్రమాదం.
ఇంట్లోకూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.
ఏడాదికోసారి డాక్టర్కు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ పాదాల సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు.
చివరగా... పాదాలు మన ప్రతి కదలికనూ నిర్ణయిస్తాయి... నియంత్రిస్తాయి. ప్రగతి పథాన ఉంచుతాయి. అందుకే పాదాల ఆరోగ్య పరిరక్షణే అందరి ప్రథమ ప్రాధాన్యం కావాలి.