డా.డి. నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజి, హైదరాబాద్
ఒకటే కడుపు ఉబ్బరం. తరచూ పెద్దపెద్ద త్రేన్పులు. లేదంటే అపానవాయువులు. ఆలోచనలన్నీ పొట్ట చుట్టూనే తిరుగుతూ.. నిరంతరం ఏదో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న భావన .
గ్యాస్ ప్రాబ్లం. అసిడిటి సమస్యలు వేధిస్తున్నాయంటూ వైద్యులను సంప్రదించే వారి సంఖ్య అపారం. అయితే ఈ సమస్య గురించి కాస్త వివరంగా చెప్పమంటే మాత్రం తమ బాధలను ఒక్కొక్కళ్లూ ఒక్కో రకంగా చెబుతుంటారు.. మొత్తానికి కడుపు బాగా ఉబ్బరంగా అనిపించటం, నోటి ద్వారా త్రేన్పులు, కింది నుంచి మలద్వారం గుండా గ్యాస్ పోవటం (ఆపానవాయువు) వంటి వాటిని 'గ్యాస్ సమస్యలు' అనుకోవచ్చు.
వీటికి తోడు కొందరు ఛాతీలో, కడుపులో మంట వంటి లక్షణాలూ చెబుతుంటారు. వీటన్నింటినీ కలిపి సాధారణంగా వైద్యపరిభాషలో 'డిస్పెప్షియా' అంటారు. ఈ లక్షణాలు చాలా చిత్రమైనవి. ఎందుకంటే పేగుల్లో క్యాన్సర్లు, అల్సర్ల వంటివి తీవ్ర సమస్యలు తలెత్తినా... ఇవే తరహా లక్షణాలు కనబడతాయి. (దీన్ని 'ఆర్గానిక్ డిస్పెప్సియా' అంటారు.) పేగుల్లో ప్రత్యేకించి అలాంటి వ్యాధులేమీ లేకుండా అంతా 'మామూలుగా' ఉండి కూడా ఈ లక్షణాలు వేధించవచ్చు. (దీన్నే 'ఫంక్షనల్ డిస్పెప్సియా' అంటారు). ఇప్పుడు నూటికి 70 మందిలో కనిపించే గ్యాస్ బాధలు ఈ రెండో రకానివే. ఎన్ని పరీక్షలు చేసినా జీర్ణ వ్యవస్థలో లోపాలేమీ కనబడవు. కానీ గ్యాస్ బాధలు మాత్రం వేధిస్తుంటాయి. అందుకే దీన్ని ఎదుర్కొనటం ఎలాగన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
లక్షణాలు
కడుపు ఉబ్బరం గ్యాస్ కడపులో మంట త్రేన్పులు, అపాన వాయువులు ఆకలి మందగించటం అన్నహితవు లేకపోవటం... సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి.
విటితో పాటు - కడుపు నొప్పి, బరువు తగ్గటం, జ్వరం, వాంతిలో లేదా మలంలో రక్తం పడటం వంటి లక్షణాలూ కనిపిస్తే దాన్ని 'ఆర్గానిక్ డిస్పెప్సియా'గా అనుమానించి.. లోపల అల్సర్, క్యాన్సర్ వంటి వేమైనా ఉన్నాయేమో పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటివేమీ లేవని తేలితే అప్పుడు దీన్ని స్థూలంగా - జీర్ణ వ్యవస్థ, పేగుల పనితీరులో మాత్రమే (ఫంక్షనల్) వచ్చిన తేడాగా భావించి వైద్యం ఆరంభిస్తారు. ఈ తరహా 'ఫంక్షనల్ డిస్పెప్సియా'కు చాలా వరకూ మందులు, జీవనశైలీ మార్పులతోనే చికిత్స చేస్తారు.
పేగుల్లో ప్రత్యేకించి ఏ వ్యాధీ, ఏ తేడా లేకుండా వేధించే గ్యాస్ సమస్యను 'ఫంక్షనల్' లేదా 'నాన్ అల్సర్ డిస్పెప్సియా' అంటారు. ఒక్క జీర్ణ సమస్యల్లోనే కాదు.. మొత్తం మనుషులు ఎదుర్కొనే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్లోకీ చాలా ఎక్కువగా కనబడేది ఈ సమస్యే
ఇలాంటి సమస్య జంతువుల్లో ఉందో లేదో స్పష్టంగా తెలియదుగానీ పరిణామ క్రమంలో భాగంగానే మనుషులకిది సంక్రమించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతోంది. అందుకు బాగా అభివృద్ధి చెందిన దేశాలైన ఫిన్‌లాండ్, నార్వే వంటివి తార్కారణం. ఈ దేశాల్లో డిస్పెప్సియా కేసుల్లో 90% ఈ రకానివే ఉంటున్నాయి. అల్సర్ల వంటి సమస్యల మూలంగా వచ్చే 'ఆర్గానిక్' రకం కేవలం 10% మాత్రమే కనబడుతున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తక్కువ, పట్టణీకరణతో పాటే ఇదీ పెరుగుతోంది.
మన ఆహారంలో మసాలాలు, నూనెలు, వేపుళ్ల వంటివి ఎక్కువ. ఇవన్నీ 'గ్యాస్' ఉత్పత్తి పెంచేవే. జన్యుపరంగా కూడా మనకు కొంత గ్యాస్ ఉత్పత్తి స్వభావం ఎక్కువ. వీటన్నింటి వల్లా మన దేశంలో 'ఫంక్షనల్ డిస్పెప్సియా' అధికంగా కనిపిస్తోంది.
మెదడుకూ, జీర్ణ వ్యవస్థకూ చాలా సన్నిహిత సంబంధం ఉంది. చిన్న పేగుల్లోని నాడులు చాలా చురుకుగా పనిచేస్తాయి. మెదడులో ఉన్నట్టుగానే చిన్న పేగుల్లోనూ అంతే సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి మనసు, మెదడుతో పాటు చిన్న పేగుల మీద కూడా నేరుగా ప్రభావం చూపుతాయి. (బ్రెయిన్- గ్ యాక్సిస్) దీనిలో తేడాలు వచ్చినా పేగుల కదలికలు, పనితీరు అస్తవ్యస్తం కావచ్చు. అందుకే కొన్నిసార్లు మరీ సున్నిత మనస్కుల్లోనూ, పరీక్షలకు వెళ్లబోతున్న వారిలోనూ ఈ డిస్పెప్సియా లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి.
పని ఒత్తిడితో పాటు ఆహారపుటలవాట్లు అస్తవ్యస్తంగా ఉండే సాఫ్ట్‌వేర్ షిప్టులు ఉద్యోగులు, శారీరక శ్రమ పెద్దగా లేని గృహిణులు.. వీరిలోనూ ఈ సమస్య ఎక్కువ.
చికిత్స
కడుపు ఉబ్బరం, గ్యాస్ తదితర బాధలతో రోగులు వచ్చినప్పుడు వైద్యులు ముందు - లోపల అల్సర్, క్యాన్సర్ వంటివేమైనా ఉన్నాయా? (ఆర్గానిక్ డిస్పెప్సియా) లేక పేగుల పనితీరులో వచ్చిన మార్పు వల్లే ఈ లక్షణాలు (ఫంక్షనల్ డిస్పెప్సియా) మొదలయ్యాయా? అన్నది నిర్థారించుకునేందుకు ప్రయత్నిస్తారు. 40 ఏళ్లలోపు వారిలో ఈ లక్షణాలుండి.. బరువు తగ్గటం, జ్వరం, నొప్పి, రక్తం పడటం వంటి ప్రమాదకర లక్షణాలేమీ లేకపోతే.. దాన్ని 'ఫంక్షనల్'గా భావించి, పరీక్షల అవసరం కూడా లేకుండా నేరుగా చికిత్స ఆరంభిస్తారు. నలభై ఏళ్ల పైబడిన వారిలో ఏదైనా అనుమానం వస్తే ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కాన్, కొలనోస్కోపీ, బేరియం మీల్ వంటి పరీక్షల ద్వారా లోపల ఇతరత్రా సమస్యలేమీ లేవని నిర్థారించుకుని అప్పుడు చికిత్స ప్రారంభిస్తారు.
మధుమేహం, థైరాయిడ్ సమస్యలున్న వారిలో పేగుల కదలికలు తగ్గుతాయి. దానివల్ల లోపల బ్యాక్టీరియా పెరిగి గ్యాస్ సమస్య తలెత్తుతుంది. వీరికి పేగుల కదలికలను మెరుగుపరిచేందుకు మెటాక్లోప్రమైడ్, ఇటియోప్రైడ్, మూసాప్రైడ్ విం 'ప్రోకైనెటిక్' రకం మందులు ఇస్తారు. ఇవి పేగుల కదలికలను మెరుగుపరచి.. పైనున్న గ్యాస్‌ని కిందికి పంపించేస్తాయి.
మరోవైపు - హైపర్ థైరాయిడిజమ్, ఆందోళన, మానసిక ఒత్తిడి ఉన్న వారికి పేగుల కదలికలు ఎక్కువ అవుతాయి. మరికొందరికి పేగులు మరీ సున్నితంగా స్పందిస్తుంటాయి. ఇలా సున్నితత్వం ఎక్కువ ఉన్న వారికి 'మెబావరిన్' వంటి సున్నితత్వాన్ని తగ్గించే 'డీసెన్సిటైజర్లు' ఇస్తారు. వీటితో సమస్య సర్దుకుంటుంది.
మందులతో పాటు వ్యాయామం ఎక్కువగా చేయటం, గ్యాస్ ఉత్పత్తిని పెంచే ఆహార పదార్థాలు పాల వంటివి మానెయ్యటం.. తదితర జీవన శైలీ మార్పులు చేసుకోవాలి.
ఇన్‌ఫెక్షన్లు : హెలికోబ్యాక్టర్ పైలోరీ క్రిమి వల్ల కూడా గ్యాస్ సంబంధ బాధలతో డిస్పెప్సియా వస్తుంది. అందుకే చైనా, జపాన్ తదితర దేశాల్లో డిస్పెప్సియా అనగానే ముందు హెలికోబ్యాక్టర్ పరీక్ష చేసి దానికి మందిస్తారు. కానీ మన దేశంలో మాత్రం.... ఈ క్రిమి శరీరంలో ఉన్నా డిస్పెప్సియాకు ఇది కారణం కాదని, పైగా దాని నుంచి కొంత రక్షణ ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి దీనికోసం ప్రత్యేక చికిత్స అవసరం లేదు. మరో వైపు మన దేశంలో గిర్డియాసిస్ ఎక్కువ. ఈ 'ప్రొటోజువా' చిన్నపేగుల్లో అతుక్కుని జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మలంలో జిగురు పడుతుంది. బరువు తగ్గటం, కడుపునొప్పి, డయేరియా, గ్యాస్, అపానవాయువులు, చిన్నపిల్లల్లో ఎదుగుదల తగ్గిపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. అమీబియాసిస్‌కు ఇచ్చే 'మెటోనిడజోల్' వంటి మందులతో గిర్డియాసిస్ కూడా తగ్గిపోతుంది. అరుదుగా నులిపురుగుల వంటి వాటితోనూ డిస్పెప్సియా రావొచ్చు. ఇది చిన్నపిల్లల్లో, ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో పెరిగే వారిలో ఎక్కువ.
ఇక పేగుల్లో అల్సర్ల వంటి సమస్యలు మొదలై, వాటి కారణంగా తలెత్తే 'ఆర్గానిక్ డిస్పెప్పియా'లో - ఎండోస్కోపీ, కొలనొస్కోపీ వంటి పరీక్షల్లో కచ్చితమైన కారణం గుర్తించి.. దానికి తగు సర్జరీ, లేదా చికిత్స చేస్తే డిస్పెప్సియా లక్షణాలు తగ్గిపోతాయి.
కొన్నిసార్లు అరుదుగా పేగుల్లో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), క్రోన్స్ వ్యాధులు కూడా డిస్పెప్సియాలా కనిపించవచ్చు. వాటిని కచ్చితంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
డిస్పెప్సియా బాధితులకు తరచుగా త్రేన్పులు రావటం వల్ల క్రమేపీ అన్నవాహిక కింది భాగం తెరుచుకొని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావటం (జీఈఆర్‌డీ), ఛాతీలో మంట లక్షణాలు కనబడతాయి. ఎండోస్కోపీలో చూస్తే అక్కడంతా చర్మం పొక్కిపోయి (ఎరోజన్స్, లీనియర్ అల్సర్స్) కనబడుతుంది. వీరికి 'జీఈఆర్‌డీ'కి ఇచ్చే ఒమెప్రజోల్ తరహా 'ప్రోటీన్ పంప్ ఇన్‌హిబిర్' రకం మందులతో పాటు ప్రోకైనిక్స్ మందులూ ఇస్తారు.
ఇదో కక్కలేని... మింగలేని... చెప్పుకోలేని బాధ! మన పేగుల్లో గ్యాస్ ఎక్కువగా చేరటం వల్ల కడుపుబ్బరం వస్తుంది. ఆ గ్యాస్- త్రేన్పులు, అపానవాయువుల రూపంలో బయటికి వెలువుడుతుంటుంది. ఇదెందుకు జరుగుతుందో చూద్దాం.
సహజంగా మన పేగుల్లో 100 ఎంఎల్ వరకూ గ్యాస్ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఈ గ్యాస్ ఉత్పత్తి మరింత పెరిగి ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇది మూడు రకాలుగా తయారవుతుంది.
1) జీర్ణ సమయంలో : మనం తిన్న ఆహారం పేగుల్లోని జీర్ణ రసాయనాలతో కలిసి... జీర్ణమయ్యే ప్రక్రియలో భాగంగా సహజంగానే కొంత గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా పేగుల్లోని బ్యాక్టీరియా - పీచు పదార్థాలను జీర్ణించుకునే క్రమంలో ఎక్కువ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2) రక్తం నుంచి : మన రక్తంలో కార్బన్‌డైఆక్సైడ్ వంటి వాయువులుంటాయి. పేగులకూ, రక్తంలోని ఈ వాయువులకూ మధ్య చర్యల వల్ల కూడా పేగుల్లో గ్యాస్ పెరుగుతుంది. పేగుల్లో ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ వంటివి త్వరగా రక్తంలో కలిసిపోతాయి. అయితే మీథేన్ వంటివి మాత్రం రక్తంలో కలవకుండా ఉండిపోయి, ఉబ్బరంగా తయారై... చివరికి మలద్వారం గుండా అపానవాయువుల రూపంలో బయటకు వెళతాయి.
3) గాలి మింగటం : మాట్లాడుతున్నప్పుడు, వేగంగా ఆహారం తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే గాలిని కూడా మింగుతుంటాం. పొట్టలో గ్యాస్ పెరగానికి, త్రేన్పులకు - ఇలా గాలి ఎక్కువగా మింగుతుండటం ఓ ముఖ్య కారణం! మానసిక ఒత్తిడికి లోనయ్యే పరీక్షలు, ఇంటర్వ్యూల వంటి సందర్భాల్లో - మనకు తెలియకుండా అప్రయత్నంగా గాలి ఎక్కువ మింగుతున్నట్లు అధ్యయనాల్లో గుర్తించారు.
పైనుంచి మింగిన గాలి ఎక్కువగా త్రేన్పుల రూపంలో బయటకు వస్తే... బ్యాక్టీరియా కారణంగా పేగుల్లో తయారయ్యే గ్యాస్ ఎక్కువగా అపానవాయువుల రూపంలో బయటకు వెలువడుతుంది.
ఒకవేళ బీన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి తినటం వల్ల గ్యాస్ సమస్య వస్తోందని గుర్తిస్తే వాటిని మానేస్తే ఉబ్బరం కూడా తగ్గిపోతుంది.
కొందరికి పాలు పడవు, మరికొందరికి గోధుమ పదార్థాలు పడవు. అవి తింటే గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. ఇలాంటి వారు పాలు, పాలతో చేసిన స్వీట్లు, గోధుమ పదార్థాల వంటివి మానెయ్యటం మంచిది. సాధారణంగా పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు, కందిపప్పు గ్యాస్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వీటిని తగ్గించాలి.
స్ట్రాలతో కూల్ డ్రింకులు తాగేటప్పుడు, ఆహారం వేగంగా తింటున్నప్పుడు గాలిని మింగుతుంటారు. అందుకే వీరు ఆహారం వేగంగా తినకూడదు. కూల్‌డ్రింకులు మానేస్తే మేలు. స్ట్రాలతో మాత్రం ఏదీ తాగకుండా ఉండటం ఉత్తమం.
మన పేగులు అసంఖ్యాకమైన, రకరకాల బ్యాక్టీరియాకు నిలయాలు. ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో ఈ బ్యాక్టీరియా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఈ గ్యాస్ ఎక్కువగా చిన్న పేగులు, పెద్దపేగుల్లో తయారవుతుంది. అది అపానవాయువుల రూపంలో కింది నుంచి వెళ్లిపోతుంటుంది.
పేగుల్లోని చెడ్డ బ్యాక్టీరియా (అనరోబిక్) తయారు చేసే గ్యాస్‌లో - మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉండటం వల్ల దుర్వాసన కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు డయేరియా వంటి ఇనెఫెక్షన్లు రావానికి ముందు, వచ్చి తగ్గిన తర్వాత కూడా ఇలా గ్యాస్ ఉత్పత్తి ఎక్కువయ్యే అవకాశం ఉంది. మామూలు బ్యాక్టీరియా కారణంగా తయారయ్యే గ్యాస్‌లో కార్బన్‌డైఆక్సైడ్, హైడ్రోజన్ వంటివే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాసన అంతగా ఉండదు.
కొందరిలో కొన్ని జన్యు కారణాల రీత్యా వంశపారంపర్యంగా పేగుల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది 'మా ఇంట్లో అందరం గ్యాస్ ట్రబుల్ బాధితులమే' అని చెబుతుంటారు. ఇలా అపాన వాయువులతో అధికంగా బాధపడుతున్న వారికి 'హైడ్రోజన్ బ్రెత్ పరీక్ష' అనేది చేస్తారు.. ఇందులో ముందు నోటి ద్వారా 'లాక్టులోజ్' ఇస్తారు. అది చిన్న పేగుల్లోకి చేరుకొని అక్కడ బ్యాక్టీరియాతో చర్య జరుపుతుంది. ఇచ్చిన దగ్గరి నుంచీ ప్రతి అరగంటకు ఒకసారి నోటి ద్వారా వచ్చే గాలిని పరీక్షించి అందులో హైడ్రోజన్, కార్బన్‌డైఆక్సైడ్ ఎంత మోతాదులో ఉన్నాయో అంచనా వేస్తారు. బ్యాక్టీరియా అధికంగా ఉంటే కార్బన్‌డైఆక్సైడ్ పెద్ద మొత్తంలో, చాలా వేగంగా పెరిగి, బయటకు వచ్చేస్తుంది. దీన్నిబట్టి గ్యాస్ సమస్యకు పేగుల్లో బ్యాక్టీరియానే ఎక్కువగా కారణమవుతోందని గ్రహించవచ్చు.
గ్యాస్ ఉత్పత్తికి బ్యాక్టీరియా కారణమవుతోందని 'బ్రెత్' పరీక్షలో తేలితే 'రిఫాక్సిమిన్' వంటి ప్రత్యేకమైన యాంటీ బయోటిక్ మందులతో బ్యాక్టీరియాను నిర్మూలిస్తారు. అయితే అది ఏ కొద్ది మొత్తంలో లోపల మిగిలిపోయినా తిరిగి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత కూడా మాత్రల రూపంలో 'ప్రోబయాటిక్స్' ఇస్తారు. దీంతో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది గ్యాస్ సమస్య తగ్గుతుంది.
పేగుల కదలిక వేగంగా జరిగితే బ్యాక్టీరియా త్వరగా బయటకు వెళ్లిపోతుంటుంది. కానీ కొన్ని రకాల వ్యాధుల్లో ముఖ్యంగా మధుమేహుల్లో పేగుల కదలికలు తగ్గుతాయి. దీంతో తిన్న ఆహారం ఎక్కువసేపు పేగుల్లో నిల్వ ఉండి, దానిలో బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. కాబట్ట మధుమేహుల్లో కడుపు ఉబ్బరం అధికంగా కనిపిస్తుంది.
మొత్తమ్మీద గ్యాస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందుకు గల కారణాలను మాత్రం తెలుసుకోవటం మంచిది.
పీచు ఎక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిదే. కానీ పీచు అధికంగా తీసుకున్న వారిలో చెడ్డ బ్యాక్టీరియా ఉంటే గ్యాస్ పెరగొచ్చు. అదే మంచి బ్యాక్టీరియా ఉంటే ఎలాటి సమస్యా ఉండదు. శాకాహారంలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉన్నట్టుండి మాంసాహారం నుంచి శాకాహారానికి మారితే గ్యాస్ బాధ పెరుగుతుంది. అయితే కొంత కాలానికి శరీరం పీచును జీర్ణం చేసుకోవానికి అలవాటుపడుతుంది కాబట్టి శాకాహారం మానకపోవటమే మంచిది.