header

Heart Attack ….గుండెపోటు

Heart Attack ….గుండెపోటు
శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండెకూ తగినంత రక్తం అందాలి. ఇందుకోసమే ప్రత్యేకంగా మూడు రక్తనాళాలు పనిచేస్తుంటాయి. ఎప్పుడైనా గుండెకు తగినంత రక్తం అందకపోయినా.. లేదూ పూర్తిగా నిలిచిపోయినా గుండెపోటుకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్‌, ఇతర పదార్థాలు పోగుపడి పూడికలు ఏర్పడటం. ఈ పూడికలు కొన్నిసార్లు రక్తనాళం నుంచి విడిపోయి, రక్తనాళం చిట్లి రక్తం గడ్డకట్టొచ్చు కూడా. కొందరికి గుండెపోటు హఠాత్తుగా, చాలా తీవ్రంగానూ దాడిచేయొచ్చు. ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. మంచి విషయం ఏంటంటే- చాలామందిలో గుండెపోటు సంకేతాలు కొన్ని గంటలు, రోజుల ముందు నుంచే కనబడుతుంటాయి.
గుండెపోటు సూచనలు...
ఛాతీ బిగపట్టినట్టు, లోపల ఏదో నొక్కేస్తున్నట్టు అనిపించటం. నొప్పి వస్తుండటం. ఇవి కొన్ని నిమిషాల సేపు అలాగే ఉండిపోవచ్చు. లేదూ వస్తూ పోతుండొచ్చు.చేతుల్లో.. ముఖ్యంగా ఎడమ చేయి, భుజంలో నొప్పి రావటం. మెడ, దవడ, వీపు, కడుపులో కూడా నొప్పిగా, ఇబ్బందిగా అనిపించొచ్చు.శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది. ఆయాసం వస్తుండటం. తల తేలిపోతున్నట్టు, వికారంగా అనిపించటం. వాంతి కూడా కావొచ్చు.చెమట్లు పట్టటం. నిస్సత్తువ.
అయితే అందరికీ ఈ అన్ని లక్షణాలూ కనబడాలనేమీ లేదు. తీవ్రత కూడా ఒకేలా ఉండాలనేమీ లేదు. కొందరికి నొప్పి ఒక మాదిరిగా ఉంటే మరికొందరికి ఎక్కువగా ఉండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు కనబడకుండానే ఉన్నట్టుండీ గుండెపోటు రావొచ్చు.