డాక్టర్ ఎ. పూర్ణానంద్, పూర్ణా హార్ట్ ఇన్‌స్టిట్యూ¬¬¬ట్, విజయవాడ.
గుండెలో మంట తరచుగా చాలా మంది అనుభవిస్తుంటారు. గుండెలో మంట వ్యాధి లక్షణమే కానీ వ్యాధి కాదు. గుండె లేదా ఛాతీలో లేదా అన్నవాహిక వెంబడి మంట ఉన్నట్లయితే ఇసోఫాగ్నస్‌లో (అన్నవాహికలో) మంట వుండటమే కారణం. ఛాతీ ఎముక కింద అన్నవాహిక ఉంటుంది.
జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఏర్పడినప్పుడు గుండె, ఛాతీలో మంట కలుగుతుంది. ఆహారానికి సంబందించిన సమస్యగా గుండె మంటను వైద్యనిపుణులు నిర్వచిస్తారు. అజీర్తి కోసం తీసుకొనే ఔషధాలు, ఇతర చర్యలతో ఛాతీలో మంట రాకుండా ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా మనం జీవితంలో ఏదో ఒక సమయంలో గుండె లేదా ఛాతీలో మంటను అనుభవిస్తాము. ఒక్కొక్కసారి మంట గాకుండా నొప్పి కూడా అనిపించవచ్చు. పొట్టలో ఉండే పదార్థాలు అన్నవాహిక కింది భాగం వైపుకు ప్రయాణించినపుడు అసౌకర్యం లేదా నొప్పి కలుగుతుంది.
గుండె మంటకు కారణాలు : పొట్టలోని కండరాల్లో లోపం ఉండటం గుండె మంటకు దారి తీస్తుంది. పొట్టలోని పైభాగంలో వుండే ఫ్లాప్ (అటు ఇటు కదిలే భాగం) ఆహారం అన్నవాహిక నుండి తిరిగి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. కొన్ని సమయాల్లో ఫ్లాప్ సరిగా పనిచేయకపోవటం వలన పొట్టలో యాసిడ్స్ పైకి వెళ్ళిపోతాయి. అలా యాసిడ్స్ పొట్టనుండి పైకి వచ్చినపుడు గుండె లేదా ఛాతీలో మంట వస్తుంది. సోడాలు (కోలాలతో సహా) ఇతర కార్పోనేటెడ్ పానీయాలు చాక్‌లెట్స్, పుల్లటి పండ్లు, టమాటోలు, టమాటో సాస్ లు, సుగంధ ద్రవ్యాలతో చేసిన పదార్థాలు, ఎర్ర మిరియాలు (కాస్పికం) పిప్పర్‌మెంట్, స్పియర్‌మెంట్, బటానీ లాంటి ఎండు గింజలతో చేసిన పదార్థాలు, ఐస్‌క్రీమ్ లాంటి ఫ్యాటీ ఆహార పదార్థాలు కూడా గుండె మంటకు దారి తీస్తాయి.
ఒత్తిడి, అలసట లాంటివి ఎదుర్కొన్నపుడు, ఇతర మానసిక స్థితి కూడా గుండె మంటకు కారణం అవుతుంది. అలాగే పొగత్రాగడం, మితిమీరి తినడం, అధిక బరువు, ఛాతీ బిగుసుకుపోయే లాంటి వస్త్రాలు ధరించటం వలన కూడా గుండె మంటకు దారి తీస్తాయి. గుండె మంట అదుపులోకి రాకపోతే తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి.
గుండె మంట వలన కలిగే కొన్ని ఆరోగ్య ఇబ్బందులు- ఇసోఫాగ్నస్ (అన్నవాహిక వాపు), అన్నవాహికలో రక్తస్రావం, అన్నవాహికలో అల్సర్ (వ్రణం), బ్యారెట్స్ ఇసోఫాగ్నస్, అన్నవాహికకు కేన్సర్ రిస్క్ పెరగటం.
గుండె మంట లక్షణాలు : గుండె మంట వ్యాధి కాదు అది వ్యాధి లక్షణం. పొట్ట ఎటైనా తిరిగే కండరాలతో నిర్మాణమైన అవయవం. పొట్ట మనం తిన్న ఆహారాన్ని నిల్వ వుంచటమే గాక అతి సన్నని ముక్కలుగా పచనం చేసి ఆ మిశ్రమాన్ని ఫైలోరస్ అనే దిగువ వున్న వాల్వ్ ద్వారా కిందకు పంపుతుంది. పొట్టను అంటుకుని వుండే పొరలో అనేక మిలియన్ల గ్రంథులుంటాయి. వాటి నుండి అనేక రసాయనాలు ఊరి ప్రసరిస్తాయి. వీటిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సినోజిన్ అనే రెండు రసాయనాలు ప్రధానమైనవి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ గుండె మంటకు దారితీసే రసాయనాలో ప్రధానమైనది.
పొట్టవలనే ప్రధానంగా గుండె మంట వుండదు. కొంత మేరకు పొట్టలో వుండే వాల్వ్ సక్రమంగా స్పందించక పోవటం కూడా కారణం కావచ్చు. ఈ విలక్షణమైన వాల్వ్‌ను లోయర్ ఇసోఫాగ్నల్ స్పింక్టర్ అంటారు. ఈ వాల్వ్ స్పందించకపోయినా లేదా బలవంతంగా తెరచుకున్నా పొట్టలో వున్న యాసిడ్ వేగంగా అన్నవాహిక వైపు వస్తుంది. దీనివలన సున్నితమైన అన్నవాహిక పొరకు గాయమవుతుంది. నోటి నుండి ఆహారం పొట్టలోకి చేరడానికి కొన్ని సెకన్లు పడుతుంది అందువల్ల పొట్టలోని యాసిడ్స్ అన్నవాహికలో ఉండవలసిన పనిలేదు. అన్నవాహిక మెత్తని కండరాలతో నిర్మాణమైన అవయవం. ఇది ఆహారాన్ని పానీయాలను కిందకు పంపుతుంది. ప్రతిరోజూ అనేక రకాల ఆహార పదార్థాలను తింటూ వుంటాము. అపుడు ఈ అప్పర్ వాల్వ్ స్పందిస్తుందా లేదా అనే విషయం కూడా మనం గుర్తించలేము. మనం రోజూ ఎదుర్కొనే ఒత్తిడి సైతం ఈ వాల్వ్ పైన ప్రభావం చూపవచ్చు.
అనేకసార్లు గుండె మంట అనిపించే లక్షణాలు కనిపించవచ్చు. వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. వీటిలో కొన్నింటి కారణంగా గుండెలో మంట తీవ్రం కావచ్చు.
గుండె మంట లక్షణాలను చూడండి
పొట్టలోని యాసిడ్ తిరిగి పైకి ప్రయాణించి, గొంతులోకి లేదా నోటిలోకి వచ్చినప్పుడు అది మనం భరించలేనట్టుగా వుంటుంది. పైకి కనిపించే కారణం లేకపోయినా పొట్టలోని అనవసరమైన గాలి బయటకు వస్తుంది. గుండెలో మంట వేడిగా, చురుకుమన్నట్లుగా, మంద్రంగా ఛాతీ ఎముక వెనుక అనిపిస్తుంది. అది గొంతు వరకు పాకుతుంది. నోటిలో ఎక్కువ నీళ్ళలాగా లేదా ద్రవం లేదా లాలాజం రూపంలో వస్తుంది. గొంతులో లేదా అన్నవాహికలో ఏదైనా అడ్డుపడి మింగడానికి ఇబ్బందిగా వున్నట్టుగానే నోటిలోకి వచ్చే ద్రవం మింగటానికి ఇబ్బందిగా వుంటుంది. కనిపించే కారణం లేకుండానే రాత్రిపూట దగ్గు వస్తుంది. ఆస్త్మాకు లేదా పలుమార్లు బ్రోంఖైటిస్‌కు దారితీయవచ్చు. ధారాళంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోలేకపోవడం జరుగుతుంది.
ఫ్యాట్స్, సుగంధ ద్రవ్యాలు, ముద్దలాంటి మొత్తని పదార్థాలు, కాఫీ, చాక్లెట్స్, టొమేటో ఉత్పత్తులు గుండెలో మంట వున్నట్లు అనుమానిస్తున్న వారు తీసుకోకుండా వుండటం మంచిది. తీసుకునే ఆహారంలో వాటిని మినహాయించటం ప్రారంభిస్తే సహజసిద్ధంగా గుండె మంటకు దారితీసే వాటిని తొలగించినట్లవుతుంది. తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా గమనించుకోవటంతో పాటు సహజసిద్ధమైన చికిత్స చేసుకోవచ్చు.దీనికి అల్లం చాలా మంచిది. అల్లం పొడిని కొని నిల్వ చేసుకోవచ్చు. అల్లం క్యాప్సూల్స్ రూపంలో కూడా లభిస్తుంది. జీర్ణవ్యవస్థపైన అల్లం టానిక్‌లాగా పనిచేస్తేంది. ఇది సహజసిద్ధమైన గుండె మంట చికిత్స
చేయకూడనవి : పొగ తాగవద్దు, పొగతాగటం వలన గుండెలో మంట పెరుగుతుంది. బరువు తగ్గాలి: బరువు ఎక్కువగా వున్నపుడు పొట్టపైన అదనపు ఒత్తిడి కలుగుతుంది. బిగుతుగా వుండే బట్టలు ప్రత్యేకించి భోజనం తరువాత ధరించరాదు. ఆర్థరైటిస్‌కు వాడే కొన్ని రకాల వాపు నివారణ మందులు గుండె మంటను పెంచవచ్చు. అందువల్ల డాక్టరును సంప్రదించి మందులు వాడాలి.
పడుకునేటప్పుడు పొట్టకంటే తల కొంచెం ఎత్తుగా వుండేలా చూసుకోవాలి. వీలైనంతగా ఒత్తిడి తగ్గించుకోవాలి. యాసిడ్స్ పొట్టలో నుండి పైకి వచ్చేవారికి అన్నవాహికలో వ్రణంలాంటి కణితి ఏర్పడే అవకాశం వుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి తగిన చికిత్స చేయించుకోవటానికి క్రమం తప్పకుండా ఎండోస్కోపి చేయుంచుకోవాలి.