header

HIV / AIDS / హెచ్ఐవీ/ఎయిడ్స్ - Dr. Narasimha Rao Neta, Hyderabad

HIV / AIDS / హెచ్ఐవీ/ఎయిడ్స్ - Dr. Narasimha Rao Neta, Hyderabad

లైంగిక సంపర్కం, రక్తం, వీర్యం, లాలాజలం, జననాంగ స్రావాల వంటి వాటితో హెచ్ఐవీ వ్యాపిస్తుంది కాబట్టి భర్త/భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలితే భాగస్వామికి కూడా పరీక్ష చేయాల్సి ఉంటుంది.
భాగస్వామికి వైరస్ అంటుకోకపోతే లైంగికంగా కలవకుండా, నోట్లో లాలాజలం కలిసిపోయేలా గాఢంగా ముద్దు పెట్టుకోకుండా చూసుకోవాలి. కండోమ్ వాడితే సరిపోతుందని కొందరు భావిస్తుంటారు గానీ ఇది అన్నిసార్లూ సురక్షితం కాదు. కండోమ్ చిరిగిపోయి వైరస్ వ్యాపించొచ్చు. పక్కన కూచోవటం, తాకటం, కబుర్లు చెప్పుకోవటం, భోజనం వంటివన్నీ మామూలుగానే చేసుకోవచ్చు గానీ శృంగారం విషయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. అలాగే హెచ్ఐవీ బాధితులు వాడిన బ్లేడ్లు, టూత్బ్రష్ల వంటివీ ఉపయోగించొద్దు. పుండ్లు, గాయాల వంటివేవైనా ఉంటే తాకకుండానూ చూసుకోవాలి. హెచ్ఐవీ/ఎయిడ్స్కు చికిత్స తీసుకునేవారిలో కొందరు ‘మందులు వేసుకుంటున్నాం కదా, ఏం కాదులే’ అని శృంగారంలో పాల్గొంటుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మందులు వాడుతున్నా కూడా వీర్యంలో, లాలాజలంలో, జననాంగ స్రావాల వంటి వాటిల్లోని వైరస్ ఇతరులకు అంటుకోవచ్చు. కాబట్టి అంగాంగ సంభోగానికి దూరంగా ఉండటమే మంచిది.
భార్య భర్తలిద్దరికీ హెచ్ఐవీ పాజిటివ్గా ఉంటే.. మందులు వాడుకుంటూ శృంగారంలో పాల్గొన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. అయితే ఇతరత్రా సుఖవ్యాధులేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. చాలామందిలో హెచ్ఐవీతో పాటు సిఫిలిస్, గనోరియా వంటి సుఖవ్యాధులూ కనబడుతుంటాయి. సుఖవ్యాధులుంటే వాటికీ తగు చికిత్స తీసుకోవాలి. సంతానం వద్దనుకుంటే కండోమ్ వాడుకోవటం సురక్షితం. అప్పటికే పిల్లలుంటే సంతానం కోసం ప్రయత్నించకపోవటమే మంచిది.
భార్యాభర్తల్లో ఎవరికి హెచ్ఐవీ నిర్ధరణ అయినా పిల్లలకూ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్గా ఉంటే పిల్లలకూ వెంటనే చికిత్స ఆరంభించాల్సి ఉంటుంది. నిరంతర పరిశీలన కూడా.
హెచ్ఐవీని పూర్తిగా నయం చేసే చికిత్సలేవీ అందుబాటులో లేవు. దీన్ని నియంత్రించుకోవటం ఒక్కటే మార్గం. ఇందుకు యాంటీరెట్రోవైరల్ చికిత్స (ఏఆర్టీ) ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో ప్రధానంగా ఎన్ఆర్టీఎస్, ఎన్ఎన్ఆర్టీఎస్, ప్రోటీజ్ ఇన్హిబిటార్ట్స్ రకం మందులు ఇస్తారు. మొదట్లో ఒక మందుతోనే చికిత్స చేసేవారు. దీంతో వైరస్ త్వరగా మందును తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకునేది. దీన్ని నివారించటానికే ఒకే సమయంలో రెండు, మూడు మందులను కలిపి ఇచ్చే హైలీ యాక్టివ్ రెంట్రోవైరల్ థెరపీ (హార్ట్) అందుబాటులోకి వచ్చింది. సమస్య మరీ తీవ్రంగా ఉంటే 4, 5 మందులనూ కలిపి ఇవ్వొచ్చు. ఇవి ఒంట్లో హెచ్ఐవీ వృద్ధి చెందకుండా చూస్తాయి. రోగనిరోధక వ్యవస్థను కాపాడతాయి. హెచ్ఐవీ పూర్తిస్థాయి ఎయిడ్స్ మారకుండా, ఇతరులకు వైరస్ వ్యాపించకుండా చూడటానికి తోడ్పడతాయి. అయితే వీటిని జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది.
అందువల్ల నిరంతర పరిశీలన కూడా కీలకమే. మందులు వేసుకుంటున్నారా, లేదా? అవెలా పనిచేస్తున్నాయి? అనేవి గమనించాల్సి ఉంటుంది. మందులు సమర్థంగా పనిచేస్తుంటే సీడీ4, సీడీ8 టి కణాల సంఖ్య పెరుగుతుంది. రోగనిరోధకశక్తి పెంపొందుతోందనటానికి, వైరస్ ఉద్ధృతి తగ్గుతోందనటానికి ఇది సూచిక. ఇక కొన్ని మందులు కాలేయం, కిడ్నీల వంటి అవయవాల మీదా ప్రభావం చూపుతాయి. అందువల్ల ఆయా అవయవాల పనితీరు ఏమైనా దెబ్బతింటోందా? అనేదీ చూడాలి. కాబట్టి హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు ప్రతి నెలా డాక్టర్ను సంప్రతించటం తప్పనిసరి. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి సీబీపీ, సీరమ్ క్రియాటినైన్, లివర్ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఏదైనా తేడా కనబడితే మందులను మార్చుకోవచ్చు. దీంతో ఇతరత్రా దుష్ప్రభావాలను ముందే నివారించుకోవచ్చు.
హెచ్ఐవీ బాధితుల్లో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంటుంది కాబట్టి వీరికి ఇతరత్రా సమస్యల ముప్పూ ఎక్కువే. వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్, గడ్డలు, ఎండుగజ్జి, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటివి తరచుగా కనబడుతుంటాయి. ముఖ్యంగా మనదేశంలో హెచ్ఐవీతో పాటు క్షయ కూడా కనబడుతోంది. హెచ్ఐవీ బాధితుల్లో సుమారు 6-7% మంది క్షయ బాధితులే కావటం గమనార్హం. దీన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. క్షయ తీవ్రంగా ఉంటే ముందుగా క్షయ మందులను ఆరంభించి, నెల తర్వాత హెచ్ఐవీ చికిత్సనూ జోడిస్తారు. అంత తీవ్రంగా లేకపోతే రెండు చికిత్సలనూ ఒకేసారి ఆరంభిస్తారు. కొందరికి చికిత్స తీసుకునే సమయంలోనూ కామెర్లు, క్షయ వంటివి రావొచ్చు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ తగు చికిత్సలు చేయటం అవసరం. లేకపోతే ఇతరత్రా బాధలతో అసలు మందులను ఆపేసే అవకాశముంది.
పిల్లలకు రాకుండా..
మనదేశంలో సుమారు 35,000 మంది గర్భిణులు హెచ్ఐవీతో బాధపడుతున్నారని అంచనా. వీరికి యాంటీరెట్రోవైరల్ చికిత్స ఇవ్వటం ద్వారా పిల్లలకు హెచ్ఐవీ సంక్రమించకుండా చూసుకోవచ్చు. హెచ్ఐవీ గర్భిణులు చికిత్స తీసుకోకపోతే పిల్లలకు వైరస్ సంక్రమించే అవకాశం 30% ఉంటుండగా.. చికిత్స తీసుకోవటం ద్వారా దీన్ని పూర్తిగా (1%) తగ్గించుకోవచ్చు. వీరికి సిజేరియన్ కాన్పు చేయటం, అలాగే కాన్పు అనంతరం 12-24 గంటల్లోగా శిశువుకు ముందు జాగ్రత్తగా యాంటీరెట్రోవైరల్ మందుల చుక్కలను ఇవ్వటం ద్వారా వైరస్ బారి నుంచి సంపూర్ణంగా కాపాడుకోవచ్చు.
జీవనశైలి మార్పులు
హెచ్ఐవీ బాధితులకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కాబట్టి పరిశుభ్రత పాటించటం చాలా ముఖ్యం. తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవటం, బయటి తిండి తినకపోవటం, ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకపోవటం ఉత్తమం. వీలైనంతవరకు ఎప్పటికప్పుడు వండిన ఆహారమే తినాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. మద్యం, సిగరెట్ల జోలికి వెళ్లకపోవటం మేలు. అపరిచితులతో శృంగారం, అసురక్షిత సంభోగం వంటి వాటితో వైరస్ వ్యాప్తి చెందటమే కాదు. అవతలి వ్యక్తులకు ఏవైనా సుఖవ్యాధులుంటే వెంటనే అంటుకునే అవకాశముంది. ఇవి మరింత తీవ్రంగానూ వేధించొచ్చు. కాబట్టి అక్రమ సంబంధాలకూ దూరంగా ఉండాలి.
నివారణే ఉత్తమ మార్గం
హెచ్ఐవీ వచ్చాక బాధపడే కన్నా దాని బారినపడకుండా చూసుకోవటమే ముఖ్యం. ఇది వ్యాపించే పద్ధతులను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం మంచిది. దూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు, చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉండేవారికి, మాదకద్రవ్యాల అలవాటు గలవారికి హెచ్ఐవీ ముప్పు ఎక్కువ. హెచ్ఐవీ ప్రధానంగా ఎలా వ్యాపిస్తుందంటే.. - అసురక్షిత శృంగారం
- ఒకరు వాడిన సూదులు, సిరంజీలను వాడటం
- పచ్చబొట్లు, ముక్కు పొడవటం వంటి వాటికి ఉపయోగించే పరికరాలను శుభ్రం చేయకుండా వాడటం
- ఇతరులు వాడిన బ్లేడ్లు, టూత్బ్రష్ల వంటివి వాడుకోవటం
- హెచ్ఐవీ గలవారి రక్తాన్ని ఇతరులకు మార్పిడి చేయటం
లక్షణాలపై కన్నేయండి
మన రోగనిరోధక వ్యవస్థలో సీడీ4 టి కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. హెచ్ఐవీ వైరస్ సరిగ్గా దీని మీదే దాడిచేస్తుంది. దీంతో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. ఫలితంగా రకరకాల లక్షణాలు పొడసూపుతాయి.
- నెల రోజులైనా విడవకుండా జ్వరం
-అకారణంగా బరువు తగ్గిపోతుండటం
- దీర్ఘకాలంగా నీళ్ల విరేచనాలు
- మందులు వేసుకున్నా తగ్గని దగ్గు
- తరచుగా ఇన్ఫెక్షన్లు తలెత్తటం
- నెల రోజులకు పైగా లింఫ్ గ్రంథుల వాపు
హెచ్ఐవీ వైరస్ వృద్ధి చెంది, రక్తంలో కనిపించటానికి కొంత సమయం పడుతుంది. కనీసం 6 వారాలు దాటితే గానీ ఎలెసా పరీక్షలో బయటపడదు. అదే అధునాతన ఆర్ఎన్ఏ, డీఎన్ఏ, పీసీఆర్ పద్ధతుల్లోనైతే 15 రోజుల్లో కనబడుతుంది.